Garbage-free city
-
16 పురపాలికలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. ఇవి స్వచ్ఛ సర్వేక్షణ్–22 అవార్డులను సాధించాయి. జాతీయస్థాయిలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ పారిశుధ్య సంబంధిత సమస్యల పరిష్కారాలను, చెత్తరహిత నగరాల(జీఎఫ్‌సీ)కు స్టార్ రేటింగ్ ఇచ్చి(జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు) ఈ అవార్డులకు ఎంపిక చేసింది. పారిశుధ్యం, పురపాలక ఘన వ్యర్థాల నిర్వహణ, ఇతర అంశాలపై ప్రజల్లో అవగాహనకుగాను దేశవ్యాప్తంగా 4,355 పట్టణ, స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన 16 పట్టణ, స్థానిక సంస్థలకు అవార్డులొచ్చాయి. వీటి ఎంపికకు 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్యప్రాంతాలు, కమ్యూనిటీ లెవెల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రజల అవగాహన, సిటిజన్ ఎంగేజ్మెంట్, ఇన్నోవేషన్స్‌లో అవార్డులను ఎంపిక చేశారు. ఢిల్లీలో అక్టోబర్ 1న జరిగే స్వచ్ఛ మహోత్సవ్‌లో అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డులతోపాటు రాష్ట్రంలోని 142 పట్టణ, స్థానిక సంస్థల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 70 పట్టణ స్థానికసంస్థలను బహిరంగ మలవిసర్జన లేని (ఓడీఎఫ్+)గా, 40 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్++గా, ఒక పట్టణ స్థానిక సంస్థను వాటర్+, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్ పట్టణాలుగా ప్రకటించారు. అవార్డులు సాధించిన మున్సిపాలిటీలివే.. ఆదిభట్ల, బడంగ్పేట్, భూత్పూర్, చండూర్, చిట్యాల, గజ్వేల్, ఘట్కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరేడుచర్ల, సికింద్రాబాద్ కంటోన్మెంట్, సిరిసిల్ల, తుర్కయాంజాల్, వేములవాడ. సంస్కరణల ఫలితమే ఈ అవార్డులు: మంత్రి కేటీఆర్ ఈ ఏడాది కూడా భారీగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక కావడంపట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అవార్డులకు ఎంపికైన 16 పురపాలికల్లోని మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులను అభినందించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నూతన పురపాలక చట్టం, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందన్నారు. పాలనాపరమైన సంస్కరణలు చేపట్టి వదిలేయకుండా, పట్టణాలకు ప్రతినెలా రాష్ట్ర బడ్జెట్ నుంచి నిరంతరం నిధులు అందించడంతో ప్రాథమిక సేవలకు వీలు కలిగిందన్నారు. ఈ అవార్డుల ద్వారా పట్టణాభివృద్ధి, పట్టణ పరిపాలన రంగాల్లో సైతం తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో, పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నా రు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2022 అవార్డుల్లో తెలంగాణలోని 16 పట్టణాలు అవార్డులు గెలుచుకోవడం, రాష్ట్ర ప్రభుత్వ కృషికి దర్పణంగా నిలిచిందన్నారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద తెలంగాణ పలు విభాగాల్లో 13 అవార్డులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పట్టణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పురపాలక చట్టంతో పాటు, విడతల వారీగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయని సీఎం వివరించారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, పట్టణ హరిత వనాల ఏర్పాటు, గ్రీన్ కవర్‌ను పెంచడం, నర్సరీల ఏర్పాటు, ఓడీఎఫ్‌ల దిశగా కృషితో పాటు పలు అభివృద్ధి చర్యలు చేపట్టడం ద్వారా గుణాత్మక ప్రగతి సాధ్యమైందని వెల్లడించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశా నికి తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను, ఆ శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, భాగస్వాములైన అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాల సాధన దిశగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇదే స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. -
నేడే అర్బన్ 2.0, అమృత్ 2.0
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నగరాలను చెత్త రహితమైన నగరాలుగా, సురక్షితమైన తాగునీరు లభించే నగరాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్– అర్బన్ 2.0, అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్(అమృత్) 2.0కు రూపకల్పన చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టనున్నారు. దేశంలో పట్టణీకరణ విసురుతున్న సవాళ్లను ప్రభావ వంతమైన రీతిలో ఎదుర్కోవడంతోపాటు 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఈ రెండు కార్యక్రమాలు దోహదపడతాయని కేంద్రం భావిస్తోంది. అర్బన్ 2.0.. అన్ని నగరాలను ‘చెత్త రహితం’గా మార్చడమే అర్బన్ 2.0 లక్ష్యం. ఇందులో భాగంగా ఆయా నగరాల్లో మురుగు నీటి నిర్వహణకు చర్యలు చేపడతారు. బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా తీర్చిదిద్దుతారు. స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0కు దాదాపు రూ.1.41 లక్షల కోట్లు నిధులు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. అమృత్ 2.0.. దాదాపు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లను ఇవ్వడం ద్వారా 4,700 పట్టణ స్థానిక సంస్థల్లోని అన్ని కుటుంబాలకు 100 శాతం మంచినీరు అందించేందుకు అమృత్ 2.0ను రూపొందించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో 10.5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఉపరితల, భూగర్భ జలాల పరిరక్షణ, పునరుజ్జీవనాన్ని అమృత్ 2.0 ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమ వ్యయం రూ.2.87 లక్షల కోట్లు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
5 స్టార్ జస్ట్ మిస్!
సాక్షి, విశాఖపట్నం: చెత్త రహిత నగరాల జాబితాలో కేవలం 16 పాయింట్ల తేడాతో విశాఖ నగరం 5 స్టార్ రేటింగ్ కోల్పోయింది. సవరించిన గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్స్ జాబితాలో సింగిల్ స్టార్ నుంచి త్రీస్టార్ రేటింగ్ సాధించిన విశాఖ నగరం.. తృటిలో 5 స్టార్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. మొత్తం మూడు విభాగాల్లో కలిపి 225 పాయింట్లు రావాల్సి ఉండగా.. విశాఖ నగరం 209 పాయింట్లకే పరిమితమైంది. దీంతో త్రీస్టార్ రేటింగ్‌కే పరిమితమైపోయింది. మాండేటరీ విభాగంలో 85 పాయింట్లకు గాను 84, ఎసెన్షియల్‌లో 80కి 70, డిజైరబుల్ విభాగంలో 60 పాయింట్లు రావాల్సి ఉండగా 55 పాయింట్లు విశాఖ నగరానికి దక్కాయి. దీంతో 5 స్టార్ రేటింగ్ రానప్పటికీ 3 స్టార్ సాధించిన నగరాల జాబితాలో విశాఖ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 72 నగరాలు 3 స్టార్ సాధించగా.. విశాఖ మొదటి స్థానంలో, తిరుపతి, విజయవాడ నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తిరుపతి నగరానికి విశాఖ కంటే 4 పాయింట్లు ఎక్కువ వచ్చినప్పటికీ.. కీలక విభాగాల్లో జీవీఎంసీ మెరుగైన స్థానంలో నిలవడంతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. కొన్ని విభాగాల్లో 50 పాయింట్లు మాత్రమే సాధించడంతో 5 స్టార్ ర్యాంకింగ్ కోల్పోయినట్లు జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, అదనపు కమిషనర్ వి.సన్యాసిరావు, సీఎంహెచ్వో డా.కేఎల్ఎస్జీ శాస్త్రి తెలిపారు. గ్రీవెన్స్ పరిష్కారం, ప్లాస్టిక్ నిషేధం, కాల్వల స్రీ్కనింగ్, తడిచెత్త ప్రాసెసింగ్, డంప్‌సైట్ రెమిడియేషన్ పద్ధతుల్లో 50 చొప్పున పాయింట్లు మాత్రమే సాధించడంతో 5 స్టార్ రేటింగ్ సాధించుకోవడంలో విఫలమయ్యామని కమిషనర్ వివరించారు. అయితే తొలి జాబితాలో సింగిల్ స్టార్‌కు పరిమితమైన సమయంలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ విభాగంలో సున్నా మార్కులు వేశారని.. తాజాగా సవరించిన మార్కుల జాబితాలో 100 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది కచ్చితంగా 5 స్టార్ రేటింగ్ సాధిస్తామని సృజన దీమా వ్యక్తం చేశారు. -
త్రీ స్టార్ విశాఖ.. ఫలించిన పోరాటం
జీవీఎంసీ పోరాటం ఫలించింది. స్వచ్ఛ సర్వేక్షణ్–2020కి కీలకం కానున్న గార్బేజ్ ఫ్రీసిటీ ర్యాంకింగ్స్‌లో 3–స్టార్ రేటింగ్ సాధించింది. నెల రోజుల క్రితం స్వచ్ఛభారత్ మిషన్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో జీవీఎంసీకి సింగిల్ స్టార్ రేటింగ్ కేటాయించింది. అన్ని అర్హతలున్నా సరైన రేటింగ్ దక్కకపోవడంతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో జీవీఎంసీ పోరాటం సాగించింది. ఈ క్రమంలో కాపులుప్పాడలోని భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను పరిశీలించిన కేంద్ర బృందం రేటింగ్‌లో మార్పుచేసినట్లు ప్రకటించింది. మహా నగరం స్ఫూర్తితో మరో ఆరు నగరాలు సైతం త్రీస్టార్ రేటింగ్ పొందాయి. 2018–19లో సింగిల్ స్టార్కే పరిమితమైన గ్రేటర్.. తాజా రేటింగ్స్‌తో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉందని జీవీఎంసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: అనేక రంగాల్లో ది బెస్ట్ సిటీగా మన్ననలు పొందిన మహా విశాఖ నగరం.. తాజాగా గార్బేజ్ ఫ్రీ సిటీ ర్యాంకింగ్స్‌లోనూ మెరుగైన స్థానం సంపాదించింది. 2019–20 సంవత్సరానికిగానూ త్రీస్టార్ రేటింగ్ సాధించింది. నెల రోజుల క్రితం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సింగిల్ స్టార్కే పరిమితం చెయ్యడంతో.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో జీవీఎంసీ అమీతుమీ తేల్చుకోవడంతో పొరపాటు గ్రహించిన కేంద్రం.. విశాఖ నగరం త్రీస్టార్ రేటింగ్ సాధించినట్లు గురువారం ప్రకటించింది. అన్నీ ఉన్నా.. సింగిల్ రావడంతో.. వ్యర్థాల నిర్వహణలో భాగంగా చెత్తలేని నగరాలకు స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా గార్బేజ్ ఫ్రీ సిటీ స్టార్ రేటింగ్స్ కేటాయిస్తున్నారు. ఈ విభాగంలో 2018–19లో విశాఖ నగరం సింగిల్ స్టార్ సాధించింది. అప్పుడు రాష్ట్రాలకు కూడా మెరుగుపరచుకునే అవకాశం ఇవ్వడంతో.. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 2 స్టార్ రేటింగ్ సాధించినట్లుగా ప్రకటించారు. అయితే 2019–20లో సింగిల్ స్టార్, 3, 5, 7 స్టార్ కేటగిరీలు మాత్రమే కేటాయింపులు చేశారు. మొత్తం మూడు విభాగాల్లో వీటిని గణించారు. మాండేటరీ, ఎసెన్షియల్, డిజైరబుల్ విభాగాల్లో మొత్తం 25 ఉప విభాగాలుంటాయి. వీటిలో 24 విభాగాల్లో పాస్ అయిన జీవీఎంసీ.. కేవలం భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణలో మాత్రం ఫెయిల్ అయ్యింది. వీటిలో ఒక్కదాంట్లో ఫెయిల్ అయినా సున్నా మార్కులు కేటాయిస్తారు. భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఉన్నప్పటికీ థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన కాంటార్ సంస్థ విశాఖలో సీ అండ్ డీ ప్లాంట్ లేదంటూ నమోదు చేసింది. దీంతో ఈ విభాగంలో ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను రెండేళ్ల క్రితం నుంచే జీవీఎంసీ నిర్వహిస్తునప్పటికీ.. ఇందులో నమోదు చెయ్యకపోవడంపై జీవీఎంసీ కమిషనర్ జి.సృజన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్‌తో పోరాటం సాగించాలని నిర్ణయించారు. కమిషనర్ సూచనలతో అదనపు కమిషనర్ వి.సన్యాసిరావు అన్ని ఆధారాలు, డాక్యుమెంట్స్‌తో ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులకు అందించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర బృందం పది రోజుల క్రితం విశాఖ వచ్చి.. సీ అండ్ డీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ని సందర్శించింది. అన్ని అనుకూలంగా ఉన్నాయని గుర్తించిన స్వచ్ఛభారత్ మిషన్ గురువారం రేటింగ్స్‌ను మార్పు చేస్తూ త్రీ స్టార్ కేటాయించింది. విశాఖ స్ఫూర్తితో 148 నగరాలు గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్స్‌లో తమకు అన్యాయం జరిగిందని విశాఖ నగరం పోరాటం ప్రారంభించిందని తెలుసుకున్న తర్వాత అనేక నగరాలు ముందడుగు వేశాయి. తమకూ అన్యాయం జరిగిందంటూ 148 నగరాలు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు ఫిర్యాదు చేశాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న స్వచ్ఛభారత్ మిషన్ అన్ని నగరాలకూ ప్రత్యేక బృందాల్ని పంపించి.. అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేశాయి. వీటిలో జీవీఎంసీతో పాటు మరో ఆరు నగరాలకు త్రీస్టార్ రేటింగ్ కేటాయిస్తున్నట్లు స్వచ్ఛభారత్ మిషన్ ప్రకటించింది. వడోదర, అహ్మద్‌నగర్, పూణే, బల్లార్పూర్, నోయిడా, గ్వాలియర్ నగరాలకూ త్రీస్టార్ ర్యాంకింగ్స్ లభించాయి. ఇందులో విశాఖ ఫిర్యాదు బలమైంది కావడంతో జాబితాలో తొలి పేరును విశాఖ నగరాన్ని ప్రకటించడం విశేషం. మార్పు చేయడం సంతోషకరం అన్ని అర్హతలున్నా సింగిల్ స్టార్‌కి పరిమితం చెయ్య డం నిరాశకు గురిచేసింది. 2019 నుంచి భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌లో పనులు కొనసాగుతున్నప్పటికీ ఈ విభాగంలో సున్నా మార్కులు వెయ్యడం చూసి ఎక్కడో తప్పు జరిగిందని అర్ధమైంది. అందుకే ఫిర్యాదు చేసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. ప్లాంట్‌లో తయారవుతున్న ఇసుక, టైల్స్ ఇలా పునర్వినియోగ సామగ్రిని చూసిన బృందం రేటింగ్‌ను మార్పు చేయడం సంతోషకరం. మా కష్టానికి ప్రతిఫలం లభించింది. జీవీఎంసీ టీమ్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ ర్యాంకు మెరుగయ్యేందుకు అవకాశం జీఎఫ్‌సీలో సింగిల్ స్టార్ రావడంతో దీని ప్రభావం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుపై పడుతుందని చాలా బాధపడ్డాం. కమిషనర్ సూచనల మేరకు ఢిల్లీ వెళ్లి స్వచ్ఛభారత్ మిషన్‌కు అన్ని డాక్యుమెంట్లు అందించాం. వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ని పరిశీలించిన ఉన్నతా«ధికారుల బృందం రేటింగ్‌ని పెంచింది. త్రీ స్టార్ రావడంతో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు మరింత మెరుగవుతుంది. – వి.సన్యాసిరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్ -
చెత్తడబ్బా.. కొట్టింది దెబ్బ..
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గార్బేజ్ ఫ్రీ సిటీస్ ర్యాంకింగ్స్‌లో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి స్థానం దక్కలేదు. ఫైవ్‌స్టార్ రేట్ ర్యాంకింగ్‌కు డాక్యుమెంటేషన్‌లో అర్హత సాధించినప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులతో ర్యాంకు లభించలేదు. స్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో గార్బేజ్ ఫ్రీ సిటీ ర్యాంక్, ఓడీఎఫ్++ ర్యాంక్‌లు కూడా ప్రభావం చూపుతాయి. ఓడీఎఫ్++కు ర్యాంక్‌కు 500 మార్కులు, గార్బేజ్ ఫ్రీసిటీకి వెయ్యి మార్కులు ఉన్నాయి. ఓడీఎఫ్++ ర్యాంక్‌ను సాధించినప్పటికీ గార్బేజ్ఫ్రీ సిటీ ర్యాంకింగ్స్‌లో మాత్రం జీహెచ్ఎంసీ ఫెయిలైంది. ఈ ర్యాంకింగ్‌కు 25 ఇండికేటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలో ఎనిమిది ఇండికేటర్లు వార్డు స్థాయిల్లో అమలు చేసేవి. ఇందులో మూడింటిలో జీహెచ్ఎంసీ ఫెయిలైనందున ఎలాంటి ర్యాంక్ రాలేదని తెలిసింది. డస్ట్‌బిన్ ఫ్రీ కాక పోవడం.. నాలాల్లో చెత్త పేరుకుపోవడం, నూరు శాతం ప్లాస్టిక్ ఫ్రీ కాకపోవడంతో జీహెచ్ఎంసీ అర్హత సాధించ లేకపోయింది. మొత్తం వార్డుల్లో ఏ ఒక్క వార్డులో ఏ ఒక్క అంశంలో ఫెయిలైనా ఆ ప్రభా వం మొత్తం ర్యాంకింగ్‌పై పడుతుందని, గత సంవత్సరం టూ స్టార్ రేటింగ్‌కు అర్హత పొందినా ఈసారి ఎలాంటి ర్యాంకింగ్ రాలేదని సంబంధిత నిపుణుడొకరు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఈసారి ఇంటింటినుంచి చెత్త సేకరణ, ఉత్పత్తి స్థానం వద్దే చెత్త తడిపొడిగా వేరు చేయడం, సీఆండ్ డీ వేస్ట్, యూజర్ చార్జీలు, ప్రాసెసింగ్ ప్లాంట్ తదితర అంశాల్లో అర్హత పొందినా, మూడు అంశాల్లో ఫెయిలైనందునే ర్యాంకింగ్ రాలేదని సమాచారం. స్వచ్ఛ సర్వేక్షణ్కు మొత్తం 6వేల మార్కు లు ఉండగా, గార్బేజ్ ఫ్రీకి సంబంధించిన వెయ్యి మార్కుల్లో ఎలాంటి మార్కులు రాకపోవడంతో ఇది స్వచ్ఛ ర్యాంకింగ్స్‌లోనూ ప్రభావం చూపను ంది. గత సంవత్సరం 350 మార్కులతో టూ స్టార్ ర్యాంకింగ్ పొందడాన్ని మననం చేసుకుంటు న్న జీహెచ్ఎంసీ డస్ట్‌బిన్ ఫ్రీ కాకపోవడమే తీ వ్ర ప్రభావం చూపిందని భావిస్తోంది. ఈసారి 141 నగరాలు ఆయా స్టార్ ర్యాంకులు సాధించాయి. దిగజారుతున్న జీహెచ్ఎంసీ.. ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్కు సంబంధించి మొదటి, రెండో త్రైమాసికాల ఫలితాల్లోనూ జీహెచ్ఎంసీ ర్యాంక్ కిందికు దిగిపోవడం తెలిసిందే. మొదటి త్రైమాసికంలో 29వ ర్యాంకు, రెండో త్రైమాసికంలో 33వ ర్యాంకు లభించాయి. గత మూడేళ్లలో ర్యాంకులిలా.. గత మూడేళ్లుగా స్వచ్ఛ ర్యాంకింగ్‌లలో జీహెచ్ఎంసీ కిందకు దిగజారుతోంది. 2017లో 22వ ర్యాంక్ రాగా, 2018లో 27, 2019లో 35వ ర్యాంక్ లభించింది. -
5స్టార్ నగరాలు ఆరు
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ నగరాల రేటింగ్స్‌లో అంబికాపూర్(ఛత్తీస్‌గఢ్), రాజ్‌కోట్, సూరత్ (గుజరాత్), మైసూర్(కర్ణాటక), ఇండోర్(మధ్యప్రదేశ్), నవీ ముంబై(మహారాష్ట్ర)లకు అత్యున్నత 5స్టార్ లభించింది. వ్యర్థాల(గార్బేజ్) నిర్వహణలో సమర్ధంగా వ్యవహరించినందుకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంగళవారం ఈ నగరాలకు ‘గార్బేజ్ ఫ్రీ నగరాలుగా’ అత్యుత్తమ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆరు నగరాలకు 5స్టార్, 65 నగరాలకు 3స్టార్, 70 నగరాలకు స్టార్ ప్రకటిస్తున్నట్లు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ తెలిపారు. కరోనాపై పోరులో స్వచ్ఛభారత్ మిషన్ గణనీయ పాత్ర పోషిస్తోందన్నారు. 2019–20 సంవత్సరానికి గానూ మొత్తం 1435 నగరాలు ఈ రేటింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా, 141 నగరాలకు రేటింగ్స్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 3స్టార్‌లో న్యూఢిల్లీ గార్బేజ్ ఫ్రీ నగరాలుగా 3 స్టార్ రేటింగ్ పొందిన వాటిలో న్యూఢిల్లీ, కర్నాల్(హరియాణా), చండీగఢ్, అహ్మదాబాద్(గుజరాత్), భోపాల్(మధ్యప్రదేశ్), జంషెడ్పూర్(జార్ఖండ్).. మొదలైనవి ఉన్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్, రోహ్తక్(హరియాణా), గ్వాలియర్(మధ్యప్రదేశ్), వడోదర, భావ్‌నగర్(గుజరాత్)లకు 1 స్టార్ లభించింది. గత ఐదేళ్లుగా స్వచ్ఛభారత్ మిషన్ విజయవంతంగా కొనసాగడం వల్లనే కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని పురి చెప్పారు. ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను ప్రారంభించిందని, దీని వల్ల నగరాల మధ్య స్వచ్ఛత విషయంలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొందన్నారు. 1.19 కోట్ల మంది పౌరుల నుంచి సమాచారం సేకరించామని, 10 లక్షల జియోట్యాగ్డ్ ఫొటోలను పరిశీలించామని, 5175 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లను తమ క్షేత్రస్థాయి పర్యవేక్షకులు సందర్శించారని మంత్రి వివరించారు. రేటింగ్స్ పొందిన ఆంధ్రప్రదేశ్ నగరాల 3స్టార్: తిరుపతి, విజయవాడ 1స్టార్: విశాఖపట్నం, పలమనేరు(చిత్తూరు జిల్లా), చీరాల(ప్రకాశం జిల్లా), సత్తెనపల్లి(గుంటూరు జిల్లా) -
బెంగళూరు తరహాలో ప్లాంట్
సాక్షి, సిద్దిపేట: పట్టణాల్లో పెరుగుతోన్న చెత్త సమస్యను తీర్చేందుకు బెంగళూరు తరహాలో సేంద్రియ ఎరువుల తయారీ ప్లాంట్లను సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్నారు. వ్యర్థం.. వేరుచేసి చూస్తే పర మార్థం ఉంటుందనే ఆలోచనతో సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ వినూ త్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ పట్టణాలుగా రూపొందిన బెంగళూరు, పుణే వంటి పట్టణాలకు సిద్దిపేట వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులను పంపించి ఆయా ప్రాంతాల్లో ఉన్న విధానాన్ని ఇక్కడ అమ లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వచ్ఛ సిద్దిపేట చేయాల నే ఆలోచనతో మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో బెంగళూరు తరహాలో సేంద్రియ ఎరువుల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ముందస్తుగా తడి, పొడి చెత్తను వేరు చేసే విధానంపై నాలుగు రోజులుగా హెచ్ఎస్ఆర్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శాంతితో కలసి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. తడి, పొడి చెత్తలు వేరు చేసేందుకు డబ్బాలు పంపిణీ చేశారు. బెంగళూరు తరహాలో ప్లాంట్స్ బెంగళూరు వంటి పట్టణాల్లో పారిశుధ్య సమస్యను పరిష్కరించిన హెచ్ఎస్ఆర్ సామాజిక సేవా సంస్థ పనితీరును సిద్దిపేట జిల్లాలో అమలు చేయనున్నారు. బెంగళూరులోని హుజూర్ సర్జాపూర్ రోడ్డులోని 1.50 లక్షల మంది జనాభా ఉన్న కాలనీలో ఈ విధానంలో ఎక్కడి చెత్తను అక్కడే.. ఆయా కాలనీల్లోనే సేంద్రియ ఎరువులుగా మార్చడంలో హెచ్ఎస్ఆర్ సంస్థ సఫలీకృతమైంది. అలా తయారు చేసిన ఎరువును స్థానికంగా ఇళ్లలో, రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు వేస్తారు. పొడిచెత్తను రీసైక్లింగ్‌కు పంపిస్తారు. పరిశుభ్రమైన సిద్దిపేట లక్ష్యం ప్రజల్లో అవగాహన లేక తడి, పొడి చెత్తను విచ్చలవిడిగా పారేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. తడి చెత్తతో బెంగళూరులో సేంద్రియ ఎరువులు తయారీ చేసిన విధానం బాగుంది. ఈ విధానం సిద్దిపేటలో అమలకు శ్రీకారం చుట్టామన్నారు. -
జేడీఎస్ మేనిఫెస్టో విడుదల
నగరంలో ‘చెత్త’ సమస్య విముక్తి కోసం యాంత్రీకరణ పేదలకు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం బెంగళూరు : బెంగళూరు నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడంతో పాటు చెరువులు, ఉద్యానవనాల సంరక్షణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, బీబీఎంపీలో పారదర్శక పాలనకు గాను మేయర్ ఇన్ కౌన్సిల్ అమలు వంటి హామీలతో బీబీఎంపీ ఎన్నికల మేనిఫెస్టోను జేడీఎస్ పార్టీ విడుదల చేసింది. ముఖ్యంగా హాంకాంగ్ తరహాలో నగరంలో ఐదు లక్షల ఇళ్లను నిర్మిస్తామని తన మేనిఫెస్టోలో పేర్కొంది. గురువారమిక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 33 పేజీల మేనిఫెస్టోను పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి లాంఛనంగా ఆవిష్కరించారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాను 124 అండర్‌పాస్‌ల నిర్మాణం, 21రోడ్లలో ద్విముఖ సంచారానికి అవకాశం కల్పించడంతో పాటు ఎనిమిది సిగ్నల్ ఫ్రీకారిడార్ల ఏర్పాటు, మెట్రో పరిధి విస్తరణ చేపడతామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక ఇదే సందర్భంలో నగర వాసులకు పెద్ద తలనొప్పిగా మారిన చెత్త సమస్య పరిష్కారానికి గాను ముందుగా ప్లాస్టిక్ సంచుల వాడకానికి సంబంధించి 11 మార్గదర్శకాలను రూపొందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇక నగరంలోని 198 వార్డుల్లోనూ, 198 చెత్త శుద్ధీకరణ కేంద్రాల ఏర్పాటు, చెత్త నిర్వహణ, శుద్దీకరణ కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు, రానున్న ఐదేళ్లలో యంత్రాల ద్వారా నగరంలోని రోడ్లను శుభ్రపరిచే దిశగా ప్రణాళికలు రచిస్తామని హామీ ఇచ్చారు. ఇక నగరంలో రోజురోజుకు కనుమరుగైపోతున్న చెరు వుల సంరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రచిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నగరంలోని ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా సదుపాయాల కల్పనతో పాటు ఉత్తమ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. అన్నపూర్ణ కిచెన్ల ఏర్పాటు..... ఇక ఇప్పటికే తమిళనాడులో అమలవుతున్న ‘అమ్మ క్యాంటీన్’ల తరహాలో నగరంలోని బడుగు, బలహీన వర్గాల వారికి తక్కువ ధరకే భోజనాన్ని అందించేందుకు గాను అన్నపూర్ణ కిచెన్లు ఏర్పాటు చేస్తామని జేడీఎస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇక నగరంలోని పేదల కోసం బీబీఎంపీ ఆధ్వర్యంలో ఐదు లక్షల ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్‌ల పై చార్జ్‌షీట్.... ఇదే సందర్భంలో తన పార్టీ మేనిఫెస్టోతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌లపై చార్జ్‌షీట్‌ను కూడా జేడీఎస్ విడుదల చేసింది. 2009నుంచి బీబీఎంపీ బడ్జెట్లో బీజేపీ నగర వాసులకు ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చని వైనంతో పాటు 2013-14 ఏడాదికి గాను రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ నగర వాసులకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ఈ చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది.