నగరంలో ‘చెత్త’ సమస్య విముక్తి కోసం యాంత్రీకరణ
పేదలకు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం
బెంగళూరు : బెంగళూరు నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడంతో పాటు చెరువులు, ఉద్యానవనాల సంరక్షణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, బీబీఎంపీలో పారదర్శక పాలనకు గాను మేయర్ ఇన్ కౌన్సిల్ అమలు వంటి హామీలతో బీబీఎంపీ ఎన్నికల మేనిఫెస్టోను జేడీఎస్ పార్టీ విడుదల చేసింది. ముఖ్యంగా హాంకాంగ్ తరహాలో నగరంలో ఐదు లక్షల ఇళ్లను నిర్మిస్తామని తన మేనిఫెస్టోలో పేర్కొంది. గురువారమిక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 33 పేజీల మేనిఫెస్టోను పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి లాంఛనంగా ఆవిష్కరించారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాను 124 అండర్‌పాస్‌ల నిర్మాణం, 21రోడ్లలో ద్విముఖ సంచారానికి అవకాశం కల్పించడంతో పాటు ఎనిమిది సిగ్నల్ ఫ్రీకారిడార్‌ల ఏర్పాటు, మెట్రో పరిధి విస్తరణ చేపడతామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.
ఇక ఇదే సందర్భంలో నగర వాసులకు పెద్ద తలనొప్పిగా మారిన చెత్త సమస్య పరిష్కారానికి గాను ముందుగా ప్లాస్టిక్ సంచుల వాడకానికి సంబంధించి 11 మార్గదర్శకాలను రూపొందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇక నగరంలోని 198 వార్డుల్లోనూ, 198 చెత్త శుద్ధీకరణ కేంద్రాల ఏర్పాటు, చెత్త నిర్వహణ, శుద్దీకరణ కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు, రానున్న ఐదేళ్లలో యంత్రాల ద్వారా నగరంలోని రోడ్లను శుభ్రపరిచే దిశగా ప్రణాళికలు రచిస్తామని హామీ ఇచ్చారు. ఇక నగరంలో రోజురోజుకు కనుమరుగైపోతున్న చెరు వుల సంరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రచిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నగరంలోని ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా సదుపాయాల కల్పనతో పాటు ఉత్తమ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.
అన్నపూర్ణ కిచెన్‌ల ఏర్పాటు.....
ఇక ఇప్పటికే తమిళనాడులో అమలవుతున్న ‘అమ్మ క్యాంటీన్’ల తరహాలో నగరంలోని బడుగు, బలహీన వర్గాల వారికి తక్కువ ధరకే భోజనాన్ని అందించేందుకు గాను అన్నపూర్ణ కిచెన్‌లు ఏర్పాటు చేస్తామని జేడీఎస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇక నగరంలోని పేదల కోసం బీబీఎంపీ ఆధ్వర్యంలో ఐదు లక్షల ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపింది.
బీజేపీ, కాంగ్రెస్‌ల పై చార్జ్‌షీట్....
ఇదే సందర్భంలో తన పార్టీ మేనిఫెస్టోతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌లపై చార్జ్‌షీట్‌ను కూడా జేడీఎస్ విడుదల చేసింది. 2009నుంచి బీబీఎంపీ బడ్జెట్‌లో బీజేపీ నగర వాసులకు ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చని వైనంతో పాటు 2013-14 ఏడాదికి గాను రాష్ట్ర బడ్జెట్‌లో కాంగ్రెస్ పార్టీ నగర వాసులకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ఈ చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది.
జేడీఎస్ మేనిఫెస్టో విడుదల
Published Fri, Aug 14 2015 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM
Advertisement