న్యూఢిల్లీ: మనుషులపై రసాయనాలు చల్లే డిస్‌ఇన్‌ఫెక్షన్ టన్నెల్స్‌ని నిషేధిస్తూ ఒక నెల రోజుల్లోగా ఆదేశాలు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మనుషులు కృత్రిమ అతినీలలోహిత కిరణాలకు గురికాకుండా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్–2005 లాంటి చట్టాల ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలంది. మనుషులను అతి నీలలోహిత కిరణాలకు గురిచేయడం, డిస్‌ఇన్‌ఫెక్షన్ టన్నెల్స్‌ని వాడటం లాంటి చర్యలను నిషేధించాలని కోరుతూ గుర్ సిమ్రాన్ నరూలా దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు విచారించింది. ఇప్పటికే మనుషులపై క్రిమిసంహారాలను చల్లరాదని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మార్గదర్శకాలను విడుదల చేసినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నెలరోజుల్లోగా ఈ ప్రక్రియని ముగించాలని కేంద్రానికి కోర్టు సూచించింది.
‘నాలుగ్గోడల మధ్య అలా దూషిస్తే నేరం కాదు’
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన ఒక వ్యక్తిని దూషించడానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంట్లోని నాలుగు గోడల మధ్య, ఎలాంటి సాక్షులు లేకుండా కులం పేరుతో దూషించడం నేరం కిందకు రాదని పేర్కొంది. బాధితుడు/ బాధితురాలు షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వ్యక్తి అయినప్పుడే.. కులం పేరుతో జరిగే అన్ని రకాలైన అవమానాలు, దూషణలను ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరాలుగా భావిస్తామని తెలిపింది. సమాజంలోని అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిని ఎవరైనా బహిరంగంగా అగౌరవపరచడం, అవమానించడం, వేధించడం వంటివి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరంగా చూడాలని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనం తెలిపింది. ఉత్తరాఖండ్‌కు చెందిన హితేశ్ వర్మ తన ఇంట్లోకి వచ్చి కులం పేరుతో దూషించాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ రాష్ట్ర హైకోర్టు అతడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ధర్మాసనం పైవ్యాఖ్యలు చేస్తూ..ఆ కేసును కొట్టేసింది.
డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్‌ని నిషేధించాలి
Published Fri, Nov 6 2020 4:32 AM | Last Updated on Fri, Nov 6 2020 8:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment