Disaster Management Act
-
కోరలు లేని ఫైర్ సర్వీసెస్ యాక్ట్.. హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్ యజమాని నిర్లక్ష్యం ఎనిమిది మంది ప్రాణాలు బలిగొంది. కేవలం ఈ ఒక్క భవనమే కాదు సరిగ్గా వెతికితే నగరంలోని ప్రతి వీధికి కనీసం మూడు ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి నిర్మాణాలు చేపట్టిన యజమానులపై చర్యలు తీసుకోవడానికి అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టాన్నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వాణిజ్య భవనాలు, సముదాయాల యజమానులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడటానికి ఇదీ ఓ కారణమే అన్నది నిపుణుల మాట. సమరీ ట్రయల్‌కు మాత్రమే అవకాశం... ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సర్వీసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగ్నిమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అదే ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై నమోదైన కేసుల మాదిరిగానే ఉంటుంది. గరిష్ట శిక్ష మూడు నెలలు మాత్రమే... ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లంఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు 2014 నుంచి ఇప్పటి వరకు 689 కేసులు నమోదు చేశారు. వీటిలో కనీసం ఒక్క కేసులోనూ ఉల్లంఘనులకు జైలు శిక్ష పడలేదు. 83 కేసులు జరిమానాలతో ముగిసిపోగా... మరో 60 ఆ విభాగమే ఉపసంహరించుకుంది. మిగిలిన వాటిలో 257 కేసులను న్యాయస్థానం రిటర్న్ చేసి మార్పు చేర్పులు సూచించింది. ఇంకో 270 కేసులు ఇప్పటికీ వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని 665 నిర్మాణాలకు నోటీసులు, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన మరో 636 మంది యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోనే అత్యధికంగా కేసులు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధిక హైదరాబాద్‌కు సంబంధించివనే. మొత్తం 689 కేసులకు నగరానికి సంబంధించినవి 325, రంగారెడ్డి 154, వరంగల్ 70, నల్లగొండ 56, ఖమ్మం 36 కేసులు ఉన్నాయి. గతంలో అగ్నిమాపక శాఖకు సొంతంగా ప్రాసిక్యూషన్ సర్వీస్ కూడా ఉండేది కాదు. పంజగుట్టలోని మీన జ్యువెలర్స్‌లో 2006లో జరిగిన అగ్నిప్రమాదం ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఆ కేసు నుంచి అగ్నిమాపక శాఖ ప్రాసిక్యూషన్ మొదలెట్టింది. అగ్నిమాపక శాఖలో పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘2000 సంవత్సరం తర్వాత అభివృద్ధి వేగం పుంజుకుంది. దీంతో అనేక భారీ నిర్మాణాలు, భవనాలు వచ్చాయి. వాణిజ్య కార్యకలాపాలూ పెరగడంతో ఉల్లంఘనలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్ సర్వీసెస్ యాక్ట్‌ను మార్చాలి. కఠినమైన నిబంధనలతో పాటు శిక్షలు అమలులోకి తీసుకువస్తేనే అగ్ని ప్రమాదాల్లో అమాయకులు బలికాకుండా ఉంటారు. మీన జ్యువెలర్స్ కేసులో ఆ భవన యాజమాన్యానికి పడిన జరిమానా కేవలం రూ.15 వేలే’ అని అన్నారు. (క్లిక్ చేయండి: హైదరాబాద్ మెట్రో రైలు.. తప్పని తిప్పలు) -
అక్కడ ఒమిక్రాన్ కలకలం.. కోవిడ్ రూల్స్‌పై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కనిష్ట స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను సడలించాయి. కాగా, కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో భద్రతా చర్యల కోసం కేంద్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేంద్రం కొవిడ్ రూల్స్ విధించిందిన విషయం తెలిసిందే. అయితే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీ నుంచి అన్ని నిబంధనలను తొలగిస్తున్నట్టు బుధవారం కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ, బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మాస్క్ ధరించాల్సి ఉంటుందని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేంద్రం తీసుకున్న కోవిడ్ రూల్స్ మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. యూరప్, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం, ఫ్రాన్స్, జర్మనీలలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 23, బుధవారం నాటికి 1,81,89,15,234 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. దేశంలో ప్రస్తుతం 12 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం టీకాలు అందిస్తోంది. ఇక, కోవిషీల్డ్ టీకాల మధ్య గ్యాప్‌ను కూడా కేంద్రం 8-16 వారాలకు తగ్గించిన విషయం తెలిసిందే. కోవాగ్జిన్ టీకాల మధ్య గ్యాప్ 28 రోజులుగా ఉంది. ఇది చదవండి: బయటపడ్డ మాజీ ఎమ్మెల్యే సమాధి.. అధికారులు పట్టించుకోకపోవడంతో.. -
రూ.4 లక్షల నష్టపరిహారంపై సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: కోవిడ్–19 వల్ల మరణించినవారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షాతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎస్.బి.ఉపాధ్యాయ తదితరులు వాదనలు వినిపించారు. ఏ ప్రాతిపదికన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారో తెలియజేస్తూ మూడు రోజుల్లో రాతపూర్వకంగా వినతులు సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది. కరోనా కారణంగా మృతిచెందిన వారి డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని పేర్కొంది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించలేమంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందంటూ కేంద్రం చేతులెత్తేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్–2005 లోని సెక్షన్ 12(3) ప్రకారం విపత్తుల వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం నుంచి పొందే హక్కు ఉందని పిటిషనర్లలో ఒకరైన అడ్వొకేట్ గౌరవ్‌కుమార్ బన్సల్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వొద్దని ఎన్డీఎంఏ నిర్ణయించిందా? కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించవద్దని ప్రధానమంత్రి నేతృత్వంలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) నిర్ణయం తీసుకుందా? అని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని ప్రశ్నించింది. బాధిత కుటుంబాల ఆవేదనను పట్టించుకోవాలని, ఏకరూప పరిహార పథకానికి రూపకల్పన చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. కరోనా వల్ల జనం ఎదుర్కొంటున్న సమస్యలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘మానవత్వం నశించిపోతున్నప్పుడు, ఔషధాల బ్లాక్ మార్కెటింగ్ వంటివి విచ్చలవిడిగా సాగుతున్నప్పుడు ఇంకేం చెప్పగలం. సామాన్య ప్రజల కష్టనష్టాలకే మా తొలి ప్రాధాన్యం’’ అని వెల్లడించింది. కాటికాపరులకు బీమా! కోవిడ్ బారినపడి మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించే కాటికాపరులకు బీమా వర్తింపజేసే అంశాన్ని పరిశీలించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇలాంటి బీమా సౌకర్యాన్ని ఇప్పటికే కల్పిస్తున్నట్లు గుర్తుచేసింది. కరోనా బాధితుల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తిచేస్తున్న కాటికాపరులు సైతం వైరస్ బారినపడుతున్నారని, కొందరు మరణించారని పిటిషనర్ గౌరవ్‌కుమార్ బన్సల్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: షాకింగ్ న్యూస్: దుష్టశక్తుల నుంచి రక్షణకు బాలిక కిడ్నాప్ -
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, అంత సాయం చేయలేం
న్యూఢిల్లీ: కోవిడ్ 19తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణమైన ఒత్తిడిలో ఉన్నాయని, ఈ పరిస్థితిలో ఆ భారం భరించలేమని స్పష్టం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం–2005లోని సెక్షన్ 12 ప్రకారం ప్రతీ పౌరుడికి ఆరోగ్యం, మౌలిక వసతులు, ఆహార భద్రత కల్పించేందుకు పలు చర్యలు చేపట్టామని ఆదివారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర హోం శాఖ పేర్కొంది. ప్రస్తుతం తమవద్ద ఉన్న పరిమిత ఆర్థిక వనరులతో పిటిషనర్ కోరినట్లు పరిహారం ఇస్తే.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఇతర చర్యలు చేపట్టే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటామని, తద్వారా, మరింత హాని జరిగే ప్రమాదముందని వివరించింది. విపత్తుల సమయంలో ఎక్స్‌గ్రేషియా సహా కనీస సహాయ చర్యలను నిర్ణయించే విషయంలో సిఫారసులు చేసే అధికారం ‘నేషనల్ అథారిటీ’దని విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 12లో స్పష్టంగా ఉందని తెలిపింది. నేషనల్ అథారిటీకి ఆ బాధ్యత పార్లమెంటు చేసిన చట్టం ద్వారా లభించిందని పేర్కొంది. గత పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు కూడా ఈ విషయం స్పష్టం చేసిందని గుర్తు చేసింది. చట్టం పేర్కొన్న అధీకృత సంస్థ చేయాల్సిన పనికి కోర్టు తన తీర్పు ద్వారా ప్రత్యామ్నాయాన్ని చూపలేదని వాదించింది. ఆ ప్రయత్నం చేస్తే రాజ్యాంగపరంగా, పరిపాలనాపరంగా అవాంఛిత విపరిణామాలు చోటు చేసుకునే ప్రమాదముందని హెచ్చరించింది. ‘ఎక్స్‌గ్రేషియా ద్వారా మాత్రమే సాయం చేయగలమనడం సరికాదు. అది పరిమిత స్థాయి సాయం మాత్రమే. విస్తృత స్థాయి సహాయంలో.. వైద్య రంగంలో మౌలిక వసతులు మెరుగుపర్చడం, ఆర్థిక రంగ పునరుత్తేజం, సామాజిక భద్రత.. మొదలైనవి వస్తాయి. ఇది మరింత బాధ్యతాయుతమైన, తెలివైన మార్గం అవుతుంది’ అని వివరించింది. పలు విదేశీ ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని పాటిస్తున్నాయని తెలిపింది. ఇతరత్రా అనారోగ్యాలు ఉండి కరోనాతో మృతి చెందితే కరోనా మరణంగానే ధ్రువీకరించాలని తెలిపింది. జూన్ 11న మరో మాట ఇదే కేసు విషయంలో జూన్ 11న సుప్రీంకోర్టులో కేంద్రం మరో విధంగా స్పందించడం విశేషం. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన సరైనదేనని, ఆ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అప్పుడు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించాలని, కోవిడ్ మృతులకు డెత్ సర్టిఫికెట్ జారీ దేశవ్యాప్తంగా ఒకేలా ఉండాలని దాఖలైన రెండు పిటిషన్లపై మే 24న సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా, కోవిడ్ మృతులకు డెత్ సర్టిఫికెట్లను జారీ చేసే విషయంలో దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం ఉండాలంది. ఈ నోటీసుకు సమాధానంగా 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రే షియా ఇవ్వలేమని కేంద్ర అఫిడవిట్ వేసింది. విపత్తు ద్వారా ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి రూ. 4 లక్షల పరిహా రం ఇవ్వాలని జాతీయ విపత్తు నిర్వహణ చట్టం– 2005 సెక్షన్ 12 (జీజీజీ) చెబుతోందని, కోవిడ్‌ను ఈ చట్టం కింద విపత్తుగా ప్రకటించారు కాబట్టి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనేది పిటిషనర్ల వాదన. రూ. 15,468 కోట్లు కావాలి దేశంలో శనివారం నాటికి కరోనాతో 3,86,713 మంది చనిపోయారు. వీరి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటే మొత్తం రూ. 15,468 కోట్లు కావాలి. ఇది భారమని, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని భరించలేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కొవిడ్ పరిహారం 4 లక్షలు.. ఏం తేల్చారు?
న్యూఢిల్లీ: కొవిడ్-19తో మరణించిన బాధితులకు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించే విషయంపై సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థనల వ్యహారంలో ఏం తేల్చారని శుక్రవారం సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆరా తీసింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, సహేతుకమైన ఈ అంశం పరిశీలనలో ఉందని, దీనిపై బదులు ఇవ్వడానికి మరికొంత టైం కావాలని కోర్టును కోరాడు. బిహార్ ప్రభుత్వం కరోనా వైరస్‌తో చనిపోయిన బాధితులకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ విషయం మీడియా ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని బెంచ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ అభ్యర్థనల విషయంలో ఏం తేల్చారని, కరోనా మరణాల ఎక్స్‌గ్రేషియా స్పష్టమైన రూల్స్ తెలపాలని బెంచ్ కోరింది. అంతేకాదు మరో పిటిషన్లో కొవిడ్ డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేయడంలో అవకతవకలు, జాప్యం జరుగుతోందన్న ఆరోపణలపై ఏం స్పందిస్తారని కోర్టు ఆరా తీసింది. దీనిపై మెహతా స్పందిస్తూ.. ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చా యని, వీటిని పరిష్కరించడంపైనే కేంద్రం దృష్టి సారించిందని పేర్కొన్నాడు. అయితే సొలిసిటర్ జనరల్ రెండువారాల గడువు కోరగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. మే 24నే పిటిషన్లు దాఖలు కావడంతో.. ఇంకెంత గడువు ఇవ్వాలని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 18న కేంద్రం తన వివరణను అందించాలని డెడ్‌లైన్ విధిస్తూ, జూన్21న తదుపరి విచారణ ఉంటుందని మెహతాకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 12(ii) ప్రకారం.. కరోనాతో చనిపోయిన వాళ్లకు నాలుగు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాదు బాధిత కటుంబాల బాధ్యతల్ని ప్రభుత్వాలే భరించాలని ఓ పిటిషన్‌దారుడు పేర్కొన్నాడు. ఇక మరో పిటిషన్లో కొవిడ్ మరణాల సర్టిఫికెట్ల జాప్యంపై పేర్కొనగా, ఐసీఎంఆర్ గైడ్లెన్స్ ప్రకారం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. చదవండి: వాక్సినేషన్.. దేవుడ్ని ప్రార్థించండి -
డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్‌ని నిషేధించాలి
న్యూఢిల్లీ: మనుషులపై రసాయనాలు చల్లే డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్‌ని నిషేధిస్తూ ఒక నెల రోజుల్లోగా ఆదేశాలు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మనుషులు కృత్రిమ అతినీలలోహిత కిరణాలకు గురికాకుండా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్–2005 లాంటి చట్టాల ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలంది. మనుషులను అతి నీలలోహిత కిరణాలకు గురిచేయడం, డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్‌ని వాడటం లాంటి చర్యలను నిషేధించాలని కోరుతూ గుర్ సిమ్రాన్ నరూలా దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు విచారించింది. ఇప్పటికే మనుషులపై క్రిమిసంహారాలను చల్లరాదని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మార్గదర్శకాలను విడుదల చేసినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నెలరోజుల్లోగా ఈ ప్రక్రియని ముగించాలని కేంద్రానికి కోర్టు సూచించింది. ‘నాలుగ్గోడల మధ్య అలా దూషిస్తే నేరం కాదు’ న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన ఒక వ్యక్తిని దూషించడానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంట్లోని నాలుగు గోడల మధ్య, ఎలాంటి సాక్షులు లేకుండా కులం పేరుతో దూషించడం నేరం కిందకు రాదని పేర్కొంది. బాధితుడు/ బాధితురాలు షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వ్యక్తి అయినప్పుడే.. కులం పేరుతో జరిగే అన్ని రకాలైన అవమానాలు, దూషణలను ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరాలుగా భావిస్తామని తెలిపింది. సమాజంలోని అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిని ఎవరైనా బహిరంగంగా అగౌరవపరచడం, అవమానించడం, వేధించడం వంటివి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరంగా చూడాలని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనం తెలిపింది. ఉత్తరాఖండ్‌కు చెందిన హితేశ్ వర్మ తన ఇంట్లోకి వచ్చి కులం పేరుతో దూషించాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ రాష్ట్ర హైకోర్టు అతడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ధర్మాసనం పైవ్యాఖ్యలు చేస్తూ..ఆ కేసును కొట్టేసింది. -
యూజీసీ నిర్ణయం సరైందే
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాలు ఫైనలియర్ పరీక్షలను రద్దు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీ కల్లా పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాతే విద్యార్థులను పై తరగతులకు అనుమతించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సమర్థ్ధించింది. విపత్తు నిర్వహణ చట్టం కింద పరీక్షలను రాష్ట్రాలు వాయిదా వేసుకోవచ్చన్న అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సెప్టెంబర్ 30లోగా పరీక్షలు జరపడం వీలుకాదని భావించే రాష్ట్రాలు, యూజీసీని సంప్రదించి, పరీక్షలకు ప్రత్యామ్నాయ తేదీలను ఖరారు చేసుకోవాలని స్పష్టం చేసింది. చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్రాలు, వర్సిటీలు యూజీసీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలనీ, ఏవైనా మినహాయింపులు ఇవ్వాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.ఎస్.రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాల ధర్మాసనం ఆదేశించింది. పరీక్షల ద్వారానే విద్యార్థుల ప్రతిభ బయటపడుతుందని అభిప్రాయపడింది. రాష్ట్రాలు, వర్సిటీలు ఫైనలియర్/ టెర్మినల్ పరీక్షలు చేపట్టకుండా విద్యార్థులను తదుపరి తరగతులకు ప్రమోట్ చేయజాలవని తెలిపింది. విపత్తు నిర్వహణ చట్టం–2005 చట్టం కింద.. విద్యార్థులకు ఫైనలియర్ పరీక్షలు జరపకుండా అంతకుముందు సంవత్సరం ఫలితాలు/అంతర్గత మదింపు ఆధారంగా ప్రమోట్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలిపింది. పరీక్షలు తప్పనిసరి చేస్తూ జూలై 6వ తేదీన యూజీసీ ఇచ్చి న రివైజ్డు మార్గదర్శకాలు నిపుణుల సూచనల మేరకు చేసినవేననీ, చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదనడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్‌ను కారణంగా చూపుతూ మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు వివిధ కోర్సుల ఫైనలియర్ పరీక్షలను రద్దు చేయాలంటూ తీసుకున్న నిర్ణయం ఉన్నతవిద్యా ప్రమాణాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయని యూజీసీ తెలిపింది. ఈ చర్య రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని వాదించింది. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ మార్గదర్శకాలను సవాలు చేస్తూ శివసేన పార్టీ యువజన విభాగం తదితరులు వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం పై ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలను విద్యకు దూరంగా ఉంచి, రాజకీయ అవగాహన పెంచుకుందామని పిలుపునిచ్చారు. -
పూర్తి వేతనాల చెల్లింపు ఉత్తర్వులు వెనక్కి
న్యూఢిల్లీ: దేశంలో లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో వివిధ వాణిజ్య సంస్థలు, కంపెనీలు పనిచేయకున్నా సరే, సిబ్బందికి పూర్తి వేతనాలివ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం ఉపసంహరించుకుంది. నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ విషయం వెల్లడించారు. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆదాయం లేని సమయంలో, పూర్తి వేతనాలు చెల్లించే స్తోమత లేని చాలా కంపెనీలు, పారిశ్రామిక యూనిట్లకు ఊరట లభించినట్లయింది. వేతనాలు చెల్లించలేని కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
తెలంగాణకు కేంద్ర బృందం
సాక్షి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్/లక్నో: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు 5 బహుళ మంత్రిత్వ శాఖల బృందాలను(ఐఎంసీటీ) పంపుతున్నట్టు కేంద్ర హోం శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి ఈ బృందాలను ఏర్పాటు చేశారు. గుజరాత్‌కు రెండు, తెలంగాణకు ఒకటి, తమిళనాడుకు ఒకటి, మహారాష్ట్రకు ఒకటి చొప్పున ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్ జిల్లాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను ప్రజలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, దీనివల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతోపాటు ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తేల్చిచెప్పింది. ఈ జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించి, లాక్డౌన్ నిబంధనల అమలు, నిత్యావసరాల సరఫరా, కరోనా నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్ల లభ్యత, పేదలు, వలస కూలీల క్యాంపుల్లో పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తాయి. అలా అయితే 73,400 కేసులు.. దేశంలో లాక్ డౌన్ విధించకుంటే ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 8 గంటల సమయానికి 73,400 కరోనా పాజిటివ్ కేసులు వచ్చి ఉండేవని కరోనా సాధికార బృందం–1 ఛైర్మన్ డాక్టర్ వీకే పాల్ శుక్రవారం తెలిపారు. కరోనా వ్యాప్తిపై జరిగిన ఒక అధ్యయనం వివరాలను ఆయన తెలిపారు. లాక్డౌన్ విధించడం వల్ల ఏప్రిల్ 24వ తేదీ ఉదయం నాటికి కరోనా పాజిటివ్ కేసులు 23,077కు పరిమితమయ్యాయని చెప్పారు. లాక్డౌన్ విధించని పక్షంలో ఈ కేసులు మే 5వ తేదీ నాటికి 4 లక్షలకు చేరేవని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో ప్రమాదకరం గుజరాత్‌లోని ప్రధాన నగరం అహ్మదాబాద్‌లో నాలుగు రోజులకోసారి కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మే ఆఖరుకల్లా నగరంలో ఈ కేసులు ఏకంగా 8 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్‌లోనే అత్యధికంగా అహ్మదాబాద్‌లో 1,638 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యూపీలో సామూహిక ప్రార్థనలు.. రంజాన్ మాసం సందర్భంగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసినందుకు గాను 32 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మా వాళ్లను వెనక్కి తీసుకొస్తాం యోగి ఆదిత్యనాథ్ లాక్డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన కూలీలను వెనక్కి తీసుకొస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం హామీ ఇచ్చారు. ఈ మేరకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనే ఉండిపోయి, అక్కడ 14 రోజుల క్వారంటైన్ గడువును పూర్తి చేసుకున్నవారి జాబితాలను రూపొందించాలన్నారు. వారందరినీ దశల వారీగా రాష్ట్రానికి రప్పించాలని పేర్కొన్నారు. ఇప్పటికే యూపీ సరిహద్దుల వరకు చేరుకుని, అక్కడే వేచి చూస్తున్న కూలీలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, వారిని వారి సొంత జిల్లాలకు చేర్చి, 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచాలన్నారు. -
కరువుపై సాకులొద్దు!
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం స్పష్టీకరణ ♦ రాష్ట్రాల పనితీరును కారణంగా చెప్పొద్దని వ్యాఖ్య ♦ మూడునెలల్లో విపత్తు నివారణకు నిధులివ్వాలి న్యూఢిల్లీ: రాష్ట్రాలు కరువుపై వాస్తవాలను అందించటం లేదనే కారణంతో బాధిత ప్రజలను ఆదుకోవటంలో కేంద్రం అలసత్వం వహించరాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆర్టికల్ 21 ప్రకారం కేంద్రం ప్రజాసంక్షేమానికి సంబంధించిన అంశాలనుంచి కేంద్రం తప్పించుకోలేదని జస్టిస్ ఎంబీ లోకుర్, ఎన్వీ రమణల ధర్మాసనం తెలిపింది. సమాఖ్య విధానం, రాజ్యాంగ బాధ్యతను భారత ప్రభుత్వం సమతూకంగా అమలు చేస్తోందని.. అలా చేయని పక్షంలో ప్రజల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని తెలిపింది. రాష్ట్రాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూనే.. కేంద్రం, రాష్ట్రం స్పందించని పక్షంలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తుందని తెలిపింది. కరువు పరిస్థితిని అంచనా వేయటంలో, వాస్తవాలను అందించటంలో రాష్ట్రాలు విఫలమైతే.. కేంద్రమే ముందుచూపుతో చొరవ తీసుకోవాలని 53 పేజీల నివేదికలో సూచించింది. ‘సమస్యకు మూలం వనరులు లేకపోవటం కాదు. సమస్యను పరిష్కరించాలనే ధృ డసంకల్పం లేకపోవటమే’ అన్న బాలాగంగాధర్ తిలక్ సూక్తిని ధర్మాసనం ఉటంకించింది. 2005లో విపత్తు నిర్వహణ చట్టం అమల్లోకి వచ్చినా దీనికి ఓ జాతీయ ప్రణాళిక, సరైన నిధులు సమకూర్చకపోవటంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేంద్రం వీలైనంత త్వరగా కరువుపై జాతీయ ప్రణాళికను రూపొందించాలన్న ధర్మాసనం.. మూడు నెలల్లోగా ఈ చట్టం కింద నిధులు సమకూర్చాలని ఆదేశించింది. రాష్ట్రాలు విపత్తు నివారణ ప్రణాళికలు రూపొందించుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించింది. కరువుపై హరియాణా, బిహార్, గుజరాత్ రాష్ట్రాలు అనుసరించిన తీరుపై మండిపడ్డ ధర్మాసనం ఈ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం కావాలని ఆదేశించింది. 12 రాష్ట్రాల్లో కరువు పరిస్థితిపై స్పందించాలంటూ స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.