కరువుపై సాకులొద్దు!
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం స్పష్టీకరణ
♦ రాష్ట్రాల పనితీరును కారణంగా చెప్పొద్దని వ్యాఖ్య
♦ మూడునెలల్లో విపత్తు నివారణకు నిధులివ్వాలి
న్యూఢిల్లీ: రాష్ట్రాలు కరువుపై వాస్తవాలను అందించటం లేదనే కారణంతో బాధిత ప్రజలను ఆదుకోవటంలో కేంద్రం అలసత్వం వహించరాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆర్టికల్ 21 ప్రకారం కేంద్రం ప్రజాసంక్షేమానికి సంబంధించిన అంశాలనుంచి కేంద్రం తప్పించుకోలేదని జస్టిస్ ఎంబీ లోకుర్, ఎన్వీ రమణల ధర్మాసనం తెలిపింది. సమాఖ్య విధానం, రాజ్యాంగ బాధ్యతను భారత ప్రభుత్వం సమతూకంగా అమలు చేస్తోందని.. అలా చేయని పక్షంలో ప్రజల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని తెలిపింది. రాష్ట్రాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూనే.. కేంద్రం, రాష్ట్రం స్పందించని పక్షంలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తుందని తెలిపింది.
కరువు పరిస్థితిని అంచనా వేయటంలో, వాస్తవాలను అందించటంలో రాష్ట్రాలు విఫలమైతే.. కేంద్రమే ముందుచూపుతో చొరవ తీసుకోవాలని 53 పేజీల నివేదికలో సూచించింది. ‘సమస్యకు మూలం వనరులు లేకపోవటం కాదు. సమస్యను పరిష్కరించాలనే ధృ డసంకల్పం లేకపోవటమే’ అన్న బాలాగంగాధర్ తిలక్ సూక్తిని ధర్మాసనం ఉటంకించింది. 2005లో విపత్తు నిర్వహణ చట్టం అమల్లోకి వచ్చినా దీనికి ఓ జాతీయ ప్రణాళిక, సరైన నిధులు సమకూర్చకపోవటంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
కేంద్రం వీలైనంత త్వరగా కరువుపై జాతీయ ప్రణాళికను రూపొందించాలన్న ధర్మాసనం.. మూడు నెలల్లోగా ఈ చట్టం కింద నిధులు సమకూర్చాలని ఆదేశించింది. రాష్ట్రాలు విపత్తు నివారణ ప్రణాళికలు రూపొందించుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించింది. కరువుపై హరియాణా, బిహార్, గుజరాత్ రాష్ట్రాలు అనుసరించిన తీరుపై మండిపడ్డ ధర్మాసనం ఈ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం కావాలని ఆదేశించింది. 12 రాష్ట్రాల్లో కరువు పరిస్థితిపై స్పందించాలంటూ స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.