న్యూఢిల్లీ: కోవిడ్ 19తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణమైన ఒత్తిడిలో ఉన్నాయని, ఈ పరిస్థితిలో ఆ భారం భరించలేమని స్పష్టం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం–2005లోని సెక్షన్ 12 ప్రకారం ప్రతీ పౌరుడికి ఆరోగ్యం, మౌలిక వసతులు, ఆహార భద్రత కల్పించేందుకు పలు చర్యలు చేపట్టామని ఆదివారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర హోం శాఖ పేర్కొంది.
ప్రస్తుతం తమవద్ద ఉన్న పరిమిత ఆర్థిక వనరులతో పిటిషనర్ కోరినట్లు పరిహారం ఇస్తే.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఇతర చర్యలు చేపట్టే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటామని, తద్వారా, మరింత హాని జరిగే ప్రమాదముందని వివరించింది. విపత్తుల సమయంలో ఎక్స్‌గ్రేషియా సహా కనీస సహాయ చర్యలను నిర్ణయించే విషయంలో సిఫారసులు చేసే అధికారం ‘నేషనల్ అథారిటీ’దని విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 12లో స్పష్టంగా ఉందని తెలిపింది. నేషనల్ అథారిటీకి ఆ బాధ్యత పార్లమెంటు చేసిన చట్టం ద్వారా లభించిందని పేర్కొంది. గత పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు కూడా ఈ విషయం స్పష్టం చేసిందని గుర్తు చేసింది.
చట్టం పేర్కొన్న అధీకృత సంస్థ చేయాల్సిన పనికి కోర్టు తన తీర్పు ద్వారా ప్రత్యామ్నాయాన్ని చూపలేదని వాదించింది. ఆ ప్రయత్నం చేస్తే రాజ్యాంగపరంగా, పరిపాలనాపరంగా అవాంఛిత విపరిణామాలు చోటు చేసుకునే ప్రమాదముందని హెచ్చరించింది. ‘ఎక్స్‌గ్రేషియా ద్వారా మాత్రమే సాయం చేయగలమనడం సరికాదు. అది పరిమిత స్థాయి సాయం మాత్రమే. విస్తృత స్థాయి సహాయంలో.. వైద్య రంగంలో మౌలిక వసతులు మెరుగుపర్చడం, ఆర్థిక రంగ పునరుత్తేజం, సామాజిక భద్రత.. మొదలైనవి వస్తాయి. ఇది మరింత బాధ్యతాయుతమైన, తెలివైన మార్గం అవుతుంది’ అని వివరించింది. పలు విదేశీ ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని పాటిస్తున్నాయని తెలిపింది. ఇతరత్రా అనారోగ్యాలు ఉండి కరోనాతో మృతి చెందితే కరోనా మరణంగానే ధ్రువీకరించాలని తెలిపింది.
జూన్ 11న మరో మాట
ఇదే కేసు విషయంలో జూన్ 11న సుప్రీంకోర్టులో కేంద్రం మరో విధంగా స్పందించడం విశేషం. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన సరైనదేనని, ఆ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అప్పుడు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించాలని, కోవిడ్ మృతులకు డెత్ సర్టిఫికెట్ జారీ దేశవ్యాప్తంగా ఒకేలా ఉండాలని దాఖలైన రెండు పిటిషన్‌లపై మే 24న సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా, కోవిడ్ మృతులకు డెత్ సర్టిఫికెట్‌లను జారీ చేసే విషయంలో దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం ఉండాలంది. ఈ నోటీసుకు సమాధానంగా 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రే షియా ఇవ్వలేమని కేంద్ర అఫిడవిట్ వేసింది. విపత్తు ద్వారా ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి రూ. 4 లక్షల పరిహా రం ఇవ్వాలని జాతీయ విపత్తు నిర్వహణ చట్టం– 2005 సెక్షన్ 12 (జీజీజీ) చెబుతోందని, కోవిడ్‌ను ఈ చట్టం కింద విపత్తుగా ప్రకటించారు కాబట్టి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనేది పిటిషనర్ల వాదన.
రూ. 15,468 కోట్లు కావాలి
దేశంలో శనివారం నాటికి కరోనాతో 3,86,713 మంది చనిపోయారు. వీరి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటే మొత్తం రూ. 15,468 కోట్లు కావాలి. ఇది భారమని, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని భరించలేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment