సాక్షి, న్యూఢిల్లీ: కరోనా టీకా వేసుకోవాల్సిందిగా ఎవరినీ బలవంతపెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ శరీరానికి ఏం కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ప్రతి పౌరునికీ కల్పించిందని పేర్కొంది. సేవలు పొందడానికి టీకాను తప్పనిసరి చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
వ్యాక్సినేషన్ తాలూకు ప్రతికూల ప్రభావాలకు సంబంధించిన వివరాలను, గణాంకాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్రానికి సూచించింది. అంతేగాక కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నంత కాలం టీకా తీసుకోని వాళ్లు బహిరంగ స్థలాల్లో స్వేచ్ఛగా తిరగడం, ఇతరత్రా సేవలు పొందడంపై ఆంక్షలు విధించరాదని సూచించింది. అయితే ప్రభుత్వ కరోనా టీకా కార్యక్రమాన్ని సమర్థించింది. అది అసమగ్రంగా ఉందని చెప్పలేమని పేర్కొంది. ప్రజాప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం కొన్ని పరిమితులు కూడా విధించొచ్చని తెలిపింది. పిల్లలకూ కరోనా టీకా వేయించాలన్న కేంద్రం నిర్ణయం కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీసుకున్నదేనని అభిప్రాయపడింది.
ఈ విషయంలో కూడా పలు దశల పరీక్షల తాలూకు ఫలితాలను అందరికీ అందుబాటులో ఉంచాలని కేంద్రానికి సూచించింది. కరోనా టీకాలకు సంబంధించి అన్ని వివరాలనూ ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంచినట్టు కేంద్రం తెలిపింది. ‘‘మార్చి 13 నాటికి దేశవ్యాప్తంగా 180 కోట్లకు పైగా డోసులు వేశాం. 15–18 ఏళ్ల వయసు వాళ్లకు 8.91 కోట్ల డోసులు వేశాం. టీకా వల్ల స్వల్ప ఆరోగ్య సమస్యలు వచ్చాయంటూ 1,739, తీవ్ర సమస్యలంటూ 81, అతి తీవ్ర సమస్యలొచ్చాయని 6 కేసులు నమోదయ్యాయి’’ అని వివరించింది.
టీకా వేసుకోవాలని... బలవంతపెట్టలేం: సుప్రీం
Published Mon, May 2 2022 11:45 AM | Last Updated on Tue, May 3 2022 7:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment