exgrashia
-
సిలిండర్ పేలి ఐదుగురు దుర్మరణం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని సేలంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి నాలుగు ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. సేలం జిల్లా కరుంగల్ పట్టి పాండురంగన్ విట్టల్ వీధిలో వెంకటరాజన్, ఇంద్రాణి దంపతులకు నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఓ ఇంట్లో గోపినాథ్, ఆయన తల్లి, అత్తతో నివసిస్తున్నారు. మరో రెండు ఇళ్లల్లో వేర్వేరు కుటుంబాలు ఉంటున్నాయి. ఈ ఇంటికి పక్కనే సేలం అగ్నిమాపక విభాగంలో ఎస్ఎస్ఐగా పనిచేస్తున్న పద్మనాభన్ ఇల్లు ఉంది. మంగళవారం తెల్లవారుజామున గోపినాథ్ తల్లి స్టౌవ్ వెలిగించే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ధాటికి ఆ నాలుగు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలుసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం స్టాలిన్ తలా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
రూ.4 లక్షల నష్టపరిహారంపై సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: కోవిడ్–19 వల్ల మరణించినవారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షాతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎస్.బి.ఉపాధ్యాయ తదితరులు వాదనలు వినిపించారు. ఏ ప్రాతిపదికన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారో తెలియజేస్తూ మూడు రోజుల్లో రాతపూర్వకంగా వినతులు సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది. కరోనా కారణంగా మృతిచెందిన వారి డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని పేర్కొంది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించలేమంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందంటూ కేంద్రం చేతులెత్తేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్–2005 లోని సెక్షన్ 12(3) ప్రకారం విపత్తుల వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం నుంచి పొందే హక్కు ఉందని పిటిషనర్లలో ఒకరైన అడ్వొకేట్ గౌరవ్‌కుమార్ బన్సల్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వొద్దని ఎన్డీఎంఏ నిర్ణయించిందా? కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించవద్దని ప్రధానమంత్రి నేతృత్వంలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) నిర్ణయం తీసుకుందా? అని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని ప్రశ్నించింది. బాధిత కుటుంబాల ఆవేదనను పట్టించుకోవాలని, ఏకరూప పరిహార పథకానికి రూపకల్పన చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. కరోనా వల్ల జనం ఎదుర్కొంటున్న సమస్యలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘మానవత్వం నశించిపోతున్నప్పుడు, ఔషధాల బ్లాక్ మార్కెటింగ్ వంటివి విచ్చలవిడిగా సాగుతున్నప్పుడు ఇంకేం చెప్పగలం. సామాన్య ప్రజల కష్టనష్టాలకే మా తొలి ప్రాధాన్యం’’ అని వెల్లడించింది. కాటికాపరులకు బీమా! కోవిడ్ బారినపడి మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించే కాటికాపరులకు బీమా వర్తింపజేసే అంశాన్ని పరిశీలించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇలాంటి బీమా సౌకర్యాన్ని ఇప్పటికే కల్పిస్తున్నట్లు గుర్తుచేసింది. కరోనా బాధితుల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తిచేస్తున్న కాటికాపరులు సైతం వైరస్ బారినపడుతున్నారని, కొందరు మరణించారని పిటిషనర్ గౌరవ్‌కుమార్ బన్సల్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: షాకింగ్ న్యూస్: దుష్టశక్తుల నుంచి రక్షణకు బాలిక కిడ్నాప్ -
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, అంత సాయం చేయలేం
న్యూఢిల్లీ: కోవిడ్ 19తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణమైన ఒత్తిడిలో ఉన్నాయని, ఈ పరిస్థితిలో ఆ భారం భరించలేమని స్పష్టం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం–2005లోని సెక్షన్ 12 ప్రకారం ప్రతీ పౌరుడికి ఆరోగ్యం, మౌలిక వసతులు, ఆహార భద్రత కల్పించేందుకు పలు చర్యలు చేపట్టామని ఆదివారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర హోం శాఖ పేర్కొంది. ప్రస్తుతం తమవద్ద ఉన్న పరిమిత ఆర్థిక వనరులతో పిటిషనర్ కోరినట్లు పరిహారం ఇస్తే.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఇతర చర్యలు చేపట్టే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటామని, తద్వారా, మరింత హాని జరిగే ప్రమాదముందని వివరించింది. విపత్తుల సమయంలో ఎక్స్‌గ్రేషియా సహా కనీస సహాయ చర్యలను నిర్ణయించే విషయంలో సిఫారసులు చేసే అధికారం ‘నేషనల్ అథారిటీ’దని విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 12లో స్పష్టంగా ఉందని తెలిపింది. నేషనల్ అథారిటీకి ఆ బాధ్యత పార్లమెంటు చేసిన చట్టం ద్వారా లభించిందని పేర్కొంది. గత పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు కూడా ఈ విషయం స్పష్టం చేసిందని గుర్తు చేసింది. చట్టం పేర్కొన్న అధీకృత సంస్థ చేయాల్సిన పనికి కోర్టు తన తీర్పు ద్వారా ప్రత్యామ్నాయాన్ని చూపలేదని వాదించింది. ఆ ప్రయత్నం చేస్తే రాజ్యాంగపరంగా, పరిపాలనాపరంగా అవాంఛిత విపరిణామాలు చోటు చేసుకునే ప్రమాదముందని హెచ్చరించింది. ‘ఎక్స్‌గ్రేషియా ద్వారా మాత్రమే సాయం చేయగలమనడం సరికాదు. అది పరిమిత స్థాయి సాయం మాత్రమే. విస్తృత స్థాయి సహాయంలో.. వైద్య రంగంలో మౌలిక వసతులు మెరుగుపర్చడం, ఆర్థిక రంగ పునరుత్తేజం, సామాజిక భద్రత.. మొదలైనవి వస్తాయి. ఇది మరింత బాధ్యతాయుతమైన, తెలివైన మార్గం అవుతుంది’ అని వివరించింది. పలు విదేశీ ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని పాటిస్తున్నాయని తెలిపింది. ఇతరత్రా అనారోగ్యాలు ఉండి కరోనాతో మృతి చెందితే కరోనా మరణంగానే ధ్రువీకరించాలని తెలిపింది. జూన్ 11న మరో మాట ఇదే కేసు విషయంలో జూన్ 11న సుప్రీంకోర్టులో కేంద్రం మరో విధంగా స్పందించడం విశేషం. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన సరైనదేనని, ఆ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అప్పుడు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించాలని, కోవిడ్ మృతులకు డెత్ సర్టిఫికెట్ జారీ దేశవ్యాప్తంగా ఒకేలా ఉండాలని దాఖలైన రెండు పిటిషన్లపై మే 24న సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా, కోవిడ్ మృతులకు డెత్ సర్టిఫికెట్లను జారీ చేసే విషయంలో దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం ఉండాలంది. ఈ నోటీసుకు సమాధానంగా 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రే షియా ఇవ్వలేమని కేంద్ర అఫిడవిట్ వేసింది. విపత్తు ద్వారా ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి రూ. 4 లక్షల పరిహా రం ఇవ్వాలని జాతీయ విపత్తు నిర్వహణ చట్టం– 2005 సెక్షన్ 12 (జీజీజీ) చెబుతోందని, కోవిడ్‌ను ఈ చట్టం కింద విపత్తుగా ప్రకటించారు కాబట్టి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనేది పిటిషనర్ల వాదన. రూ. 15,468 కోట్లు కావాలి దేశంలో శనివారం నాటికి కరోనాతో 3,86,713 మంది చనిపోయారు. వీరి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటే మొత్తం రూ. 15,468 కోట్లు కావాలి. ఇది భారమని, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని భరించలేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
జర్నలిస్ట్ కుటుంబానికి 15 లక్షల ఎక్స్‌గ్రేషియా
భువనేశ్వర్ : కరోనా కారణంగా మృతిచెందిన జర్నలిస్ట్ కుటుంబానికి 15 లక్షల రూపాయాల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ప్రాణంతక కరోనా మహమ్మరిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులు పోషిస్తున్న బాధ్యత అనిర్వచనీయం అని పేర్కొన్నారు. విధినిర్వహణలో ఏ జర్నలిస్ట్ అయినా వైరస్ భారిన పడి చనిపోతే ఆయా కుటుంబాలకు 15 లక్షల రూపాయాల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కష్టకాలంలో తమ ప్రాణాలనే పణంగా పెట్టి ప్రజలకు అవగామన కల్పిస్తున్నారని ట్వీట్ చేశారు. CM @Naveen_Odisha has announced ₹ 15 lakh compassionate assistance to families of working journalists who may lose life to #COVID19 infection. CM said journalists are dedicatedly working to raise awareness about the pandemic during this difficult times. #OdishaCares — CMO Odisha (@CMO_Odisha) April 27, 2020 కోవిడ్-19 మహమ్మరి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లు కరోనా కారణంగా మరణిస్తే వారి కుటుంబానికి చేయూత అందించేందుకు 50 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ వైద్య సిబ్బందిని అమర వీరులుగా పరిగణించి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని పేర్కొంది. (కరోనా: ఆరోగ్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు) -
ఆగని కన్నీళ్లు
కొలంబో: శ్రీలంకలోని ఉగ్రమూకల రాక్షసక్రీడలో ప్రాణాలు కోల్పోయిన ప్రజల సంఖ్య అమాంతం పెరిగింది. మూడు చర్చిలు, మూడు ఐదు నక్షత్రాల హోటళ్లపై ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 215 మంది చనిపోగా, తాజాగా చికిత్స పొందుతూ మరో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 290కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో 500 మందికిపైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. కొలంబోలోని సెయింట్ ఆంథోనీ చర్చి, నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికలోవాలోని జియోన్ చర్చితో పాటు షాంగ్రీలా, సినమన్ గ్రాండ్, కింగ్స్బరీ ఫైవ్‌స్టార్ హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. వరుస బాంబుపేలుళ్ల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఓ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు చెందిన 24 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురికి కొలంబో మేజిస్ట్రేట్ మే 6 వరకూ రిమాండ్ విధించారు. విచారణ కమిటీ ఏర్పాటు... ఈ విషయమై శ్రీలంక ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ.. ఈ ఉగ్రదాడుల వెనుక నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ‘ఈ ఉగ్రదాడిలో ఏడుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారు. వీరంతా శ్రీలంక వాసులేనని అనుమానిస్తున్నాం. ఎన్టీజేకు విదేశీ సాయం అందిందా? ఈ సంస్థకు విదేశీ ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ కేసును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)కి అప్పగించాం. ఉగ్రదాడి జరిగే అవకాశముందని నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏప్రిల్ 11కు ముందుగానే పోలీస్ ఐజీ పుజిత్ జయసుందరకు సమాచారం అందించారు. నిఘా సంస్థల హెచ్చరికలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఐజీ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈ ఉగ్ర దుశ్చర్య నేపథ్యంలో ఈ నెల 23న జాతీయ సంతాప దినంగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఈ దాడి ఘటనపై అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. రెండు వారాల్లోగా విచారణను పూర్తిచేసి నివేదికను అందించాలని ఆదేశించారు. జాతీయ భద్రతా మండలి భేటీ.. ఉగ్రదాడి నేపథ్యంలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో సమావేశమైన జాతీయ భద్రతా మండలి(ఎన్ఎస్సీ).. సోమవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించాలని నిర్ణయం తీసుకుంది. కేవలం ఉగ్రమూకలను ఏరివేసేందుకే ఈ అత్యవసర పరిస్థితిని విధించా మనీ, ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది లేదని అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎమర్జెన్సీ నేపథ్యంలో పోలీసులు, భద్రతాబలగాలు కోర్టు వారంట్ లేకుండానే ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారించేందుకు వీలవుతుంది. ఈ ఉగ్రదాడి వెనుక విదేశీ ఉగ్రసంస్థల హస్తం ఉండొచ్చన్న నిఘావర్గాల సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరుకు శ్రీలంక విదేశాల సాయం కోరే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబాలకు పరిహారం.. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో నష్టపోయిన కుటుంబాలకు శ్రీలంక ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఈ విషయమై శ్రీలంక ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ.. ‘ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు 10 లక్షల శ్రీలంక రూపాయలను అందజేస్తాం. అలాగే అంత్యక్రియల నిర్వహణకు మరో రూ.లక్ష ఇస్తాం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మధ్యలో నష్టపరిహారం అందజేస్తాం. ఉగ్రదాడిలో దెబ్బతిన్న చర్చిలను ప్రభుత్వమే పునర్నిర్మిస్తుంది. ఇప్పటివరకూ ఓ అతివాద సంస్థకు చెందిన 24 మందిని అరెస్ట్‌చేశాం. అనవసర ప్రచారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే వీరి వివరాలను బయటపెట్టడం లేదు’ అని స్పష్టం చేశారు. 10 లక్షల శ్రీలంక రూపాయలు తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు. దాడి వెనుక ఐసిస్ హస్తం? శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 290 మంది చనిపోవడం వెనుక ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) హస్తం ఉండే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రదాడి విషయంలో భారత ప్రభుత్వం శ్రీలంకతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ విషయమై శ్రీలంకకు చెందిన భద్రతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ దాడి తీవ్రత, జరిగిన తీరును చూస్తే దీన్ని ఐసిస్ ఉగ్రవాదులే చేసినట్లు అనిపిస్తోంది. ఆత్మాహుతిదాడిలో వాడిన పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను జాగ్రత్తగా మరింత క్షుణ్ణంగా విశ్లేషించాల్సిన అవసరముంది. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికే శ్రీలంకలోని చర్చిలను ఈస్టర్ రోజున ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రసంస్థ లష్కరే తోయిబా శ్రీలంకలో అడుగుపెట్టేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్లు నిఘావర్గాల వద్ద సమాచారం ఉంది. ఇటీవల న్యూజిలాండ్‌లో రెండు మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటున్న 50 మంది ముస్లింలను బ్రెంటన్ అనే క్రైస్తవ శ్వేతజాతీయుడు కాల్చిచంపినందుకు ప్రతీకారంగా శ్రీలంక ఐసిస్ మాడ్యూల్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చు’ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు శ్రీలంకలోని బౌద్ధులు క్రైస్తవ మతం స్వీకరించడంపై ఇరువర్గాల మధ్య స్వల్పఘర్షణలు చోటుచేసుకున్నాయనీ, దాని కారణంగానే ఈ బాంబు పేలుళ్లు జరిగి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అలాగే శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలే ఈ దాడులకు తెగబడ్డాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మృతుల్లో 8 మంది భారతీయులు దొడ్డబళ్లాపుర / తుమకూరు: శ్రీలంక ఉగ్రదాడుల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య సోమవారం నాటికి ఎనిమిదికి చేరుకుంది. బాంబు పేలుళ్లలో లక్ష్మీ, నారాయణ్ చంద్రశేఖర్, రమేశ్ గౌడ చనిపోయినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అంతకుముందు ప్రకటించగా, ఇదే దాడుల్లో కె.జి.హనుమంతరాయప్ప, ఎం.రంగప్ప, హెచ్.శివకుమార్, వేమురై తులసీరాం, ఎస్.ఆర్.నాగరాజ్ చనిపోయినట్లు కొలంబోలోని భారత హైకమిషన్ తెలిపింది. చనిపోయివారిలో ఐదుగురు జేడీఎస్ నేతలు ఉన్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే కేరళకు చెందిన పీఎస్ రసైనా(58) ఈ ఉగ్రదాడిలో దుర్మరణం చెందినట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. అయితే రసైనా మృతిని శ్రీలంక అధికారులు ధ్రువీకరించలేదు. వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశమంతటా రాత్రిపూట కర్ఫ్యూను విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కొలంబోలోని పెట్టాహ్ ప్రాంతంలో ఉన్న బస్‌స్టేషన్‌లో పోలీసులు 87 బాంబు డిటోనేటర్లను కనుగొన్నారు. అలాగే ఈ ఘాతుకానికి తెగబడేముందు ఉగ్రమూకలు దక్షిణ కొలంబోలోని పనదుర ప్రాంతంలో 3 నెలలపాటు తలదాచుకున్న ఇంటిని గుర్తించారు. కాగా, కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేదారిలో 6 అడుగుల పైపులో అమర్చిన శక్తిమంతమైన ఐఈడీ బాంబును అధికారులు గుర్తించారు. కొలంబోలో మరో బాంబు పేలుడు.. కొలంబోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో సోమవారం మరో బాంబు పేలుడు సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. దీంతో అధికారులు స్పందిస్తూ.. ఉగ్రవాదులు ఓ వాహనంలో బాంబును అమర్చారని తెలిపారు. దీన్ని నిర్వీర్యం చేస్తుండగా బాంబు ఒక్కసారిగా పేలిందన్నారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. -
అకాల వర్షాలు : ప్రధాని తీరుపై విపక్షం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్ధాన్, గుజరాత్, మహారాష్ట్రలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో 34 మంది మరణించారు. అకాల వర్షాలు నాలుగు రాష్ట్రాలను ముంచెత్తడంతో భారీ నష్టం వాటిల్లింది. మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షంతో 11 మంది మృత్యువాతన పడ్డారు. ఖర్గోనే జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలకు వందలాది ఇళ్లు నీటమునిగాయి. జముదిర్ సర్వార్ గ్రామంలో పిడుగుపాటుతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఇక గుజరాత్లో భారీ వర్షాలు, పిడుగుపాటుకు 9 మంది మరణించారు. మెహసనా, బనస్కంత, సబర్కంత ప్రాంతాల్లో భారీ వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. మరోవైపు మహారాష్ట్రలో భారీ వర్షాలు, పిడుగుపాటు కారణంగా ఏడుగురు వ్యక్తులు మరణించారు. నాసిక్, పుణేలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. రాజస్ధాన్‌లో భారీ వర్షాలకు ఏడుగురు వ్యక్తులు మరణించారు. అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పెద్దసంఖ్యలో మట్టిఇళ్లు దెబ్బతిన్నాయి. మోదీపై భగ్గుమన్న కాంగ్రెస్ గుజరాత్లో భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ, పంట నష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని కార్యాలయం ప్రకటించింది. కాగా గుజరాత్ సహా నాలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తే ప్రధాని కేవలం గుజరాత్‌నే ప్రస్తావించడం పట్ల విపక్ష కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గుజరాత్లో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం సంతోషమే..కానీ కాంగ్రెస్ పాలిత మధ్యప్రదేశ్‌లోనూ అకాల వర్షాలతో ప్రాణ నష్టం జరిగిందని, ఇక్కడ బీజేపీ అధికారంలో లేకపోయినా తమ రాష్ట్రంలో అకాల వర్ష బాధితులకు కూడా ప్రధాని సంతాపం తెలపాలని ఆ రాష్ట్ర సీఎం కమల్ నాధ్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో బాధితులకు ఎలాంటి సాయం చేయని ప్రదాని గుజరాత్ పట్ల పక్షపాతం చూపారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆక్షేపించారు. -
మూడేళ్లయినా అందని సాయం..
శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పాత గానసర గ్రామానికి చెందిన వలరోతు భాస్కర్‌రావు 2 ఎకరాల సొంత భూమికి తోడు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి పంటలు సాగు చేశాడు. వరుసగా రెండు సంవత్సరాలు నష్టం వచ్చింది. కూతురు ఝాన్సీ పెళ్లికి రూ. లక్ష అప్పు అయ్యింది. పంటలకు చేసిన అప్పు రూ. 2 లక్షలు కలసి.. మొత్తం ప్రైవేటు అప్పు రూ. 3 లక్షలు. వడ్డీ నెలకు నూటికి 3 రూపాయలు. ఇక అప్పుల బాధ తీరదని భావించిన భాస్కర్‌రావు 2014 డిసెంబర్ 24న పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్లు దాటిపోయింది. కానీ, భాస్కర్‌రావు భార్య లక్ష్మికి ఇంతవరకూ వితంతు పింఛను కూడా రావటం లేదు. ఇక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ఊసేలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ. -
ఆ కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో మరణించిన చేనేత కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వీవర్స్ డెవలప్మెంట్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది. కులవృత్తిపై ఆధారపడ్డ చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారికి చేయూత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వీవర్స్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అధ్యక్షుడు సురేష్ దాసు, సలహాదారులు కుంటాల గంగాధర్ తిలక్, ఊర్మిళ, శ్రీనివాస్ తదితరులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 58 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయని, కానీ ఈ సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల వివరాలను తేల్చాలని, అనంతరం వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. -
మృతుల కుటుంబాలకు రూ.6లక్షలు మంజూరు
–ఎస్‌కోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల కొత్తవలస: విశాఖబీచ్‌లో గల్లంతై మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.6లక్షలు మంజూరైనట్లు శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సీఎస్‌డీటీ ఆనందరావు అధ్యక్షతన జాతీయకుటుంబ బీమాయోజనప«థకం కింద 53మంది లబ్దిదారులకు మంజూరైన రూ.6.60లక్షల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మే నెలలో విశాఖపట్నం ఆర్కె,బీచ్‌లో విద్యార్థులు గల్లంతై మృతిచెందిన విషయం ఇప్పటికీ మరువలేనిదన్నారు.ఆ మూడుకుటుంబాలకు ఒక్కొక్కరికి రెండులక్షలు వంతున సీఎం సహాయనిధినుంచి మంజూరయ్యాయని చెప్పారు. కొత్తవలసలో ఉన్న ముస్లిం సోదరులకోసం షాదీఖానానిర్మాణానికి రూ.20లక్షలు మంజూరయ్యాయని ఇందుకోసం స్థలం చూడవలసిందిగా తహసీల్దార్‌కు సూచించానన్నారు. పంచాయతీ అభివృద్ధిపై అసహనం కొత్తవలస పంచాయతీ అభివృద్ధికి సుమారు రూ.ఆరుకోట్ల నిధులు మూలుగుతున్నా అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించలేదని కొత్తవలస ఒకటవ ఎంపీటీసీ సభ్యుడు, మండల వైఎస్సాఆర్సీపీ అధ్యక్షుడు మేళాస్త్రి అప్పారావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే నిధులుండీ ఎందుకు పనులుచేయలేదో త్వరలో పంచాయతీ పాలకవర్గంతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని హామీఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కె.రమణమ్మ.మండల ఉపాధ్యక్షుడు పి.రాజన్న మండల టీడీపీ అధ్యక్షుడు కోళ్ల శ్రీను పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇస్తాం