తెలంగాణకు కేంద్ర బృందం | Central teams to visit 4 more States to assess execution of lockdown | Sakshi
Sakshi News home page

తెలంగాణకు కేంద్ర బృందం

Published Sat, Apr 25 2020 2:21 AM | Last Updated on Sat, Apr 25 2020 9:31 AM

Central teams to visit 4 more States to assess execution of lockdown - Sakshi

కరోనా కేసులను గుర్తించేందుకు కోల్‌కతాలో ప్రతీ ఇంటికీ వెళ్లి చెక్‌ చేస్తున్న వైద్య సిబ్బంది

సాక్షి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌/లక్నో: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు 5 బహుళ మంత్రిత్వ శాఖల బృందాలను(ఐఎంసీటీ) పంపుతున్నట్టు కేంద్ర హోం శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి ఈ బృందాలను ఏర్పాటు చేశారు. గుజరాత్‌కు రెండు, తెలంగాణకు ఒకటి, తమిళనాడుకు ఒకటి, మహారాష్ట్రకు ఒకటి చొప్పున ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి.

దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్‌ జిల్లాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, దీనివల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతోపాటు ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తేల్చిచెప్పింది. ఈ జిల్లాల్లో  కేంద్ర బృందాలు పర్యటించి, లాక్‌డౌన్‌ నిబంధనల అమలు, నిత్యావసరాల సరఫరా, కరోనా నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్ల లభ్యత, పేదలు, వలస కూలీల క్యాంపుల్లో పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తాయి.    

అలా అయితే 73,400 కేసులు..
దేశంలో లాక్‌ డౌన్‌ విధించకుంటే ఏప్రిల్‌ 24వ తేదీ ఉదయం 8 గంటల సమయానికి 73,400 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చి ఉండేవని కరోనా సాధికార బృందం–1 ఛైర్మన్‌ డాక్టర్‌ వీకే పాల్‌ శుక్రవారం తెలిపారు. కరోనా వ్యాప్తిపై జరిగిన ఒక అధ్యయనం వివరాలను ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఏప్రిల్‌ 24వ తేదీ ఉదయం నాటికి కరోనా పాజిటివ్‌ కేసులు 23,077కు పరిమితమయ్యాయని చెప్పారు. లాక్‌డౌన్‌ విధించని పక్షంలో ఈ కేసులు మే 5వ తేదీ నాటికి 4 లక్షలకు చేరేవని పేర్కొన్నారు.  

అహ్మదాబాద్‌లో ప్రమాదకరం  
గుజరాత్‌లోని ప్రధాన నగరం అహ్మదాబాద్‌లో నాలుగు రోజులకోసారి కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మే ఆఖరుకల్లా  నగరంలో ఈ కేసులు ఏకంగా 8 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్‌లోనే అత్యధికంగా అహ్మదాబాద్‌లో 1,638 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  
యూపీలో సామూహిక ప్రార్థనలు..  
రంజాన్‌ మాసం సందర్భంగా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసినందుకు గాను 32 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

మా వాళ్లను వెనక్కి తీసుకొస్తాం  
యోగి ఆదిత్యనాథ్‌  
లాక్‌డౌన్‌ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన కూలీలను వెనక్కి తీసుకొస్తామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం హామీ ఇచ్చారు. ఈ మేరకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనే ఉండిపోయి, అక్కడ 14 రోజుల క్వారంటైన్‌ గడువును పూర్తి చేసుకున్నవారి జాబితాలను రూపొందించాలన్నారు. వారందరినీ దశల వారీగా రాష్ట్రానికి రప్పించాలని పేర్కొన్నారు. ఇప్పటికే యూపీ సరిహద్దుల వరకు చేరుకుని, అక్కడే వేచి చూస్తున్న కూలీలకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని, వారిని వారి సొంత జిల్లాలకు చేర్చి, 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement