పట్నాలో వాహనదారులపై క్రిమిసంహారిణులను స్ప్రే చేస్తున్న సిబ్బంది
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి బాధితుల సంఖ్య బుధవారానికి 20 వేల మార్కును అధిగమించింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రానికి 1,486 కొత్త కేసులు నమోదు కాగా, 49 మంది మృతి చెందారు. దీంతో కేసుల సంఖ్య 20,471కి చేరింది. మృతుల సంఖ్య 652కు పెరిగింది. కోవిడ్–19 యాక్టివ్ కేసులు 15,859 కాగా ఇప్పటి వరకు 3,959 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని కేంద్ర హోం శాఖ తెలిపింది. దీంతో, 19 శాతం మంది కోలుకున్నట్లయిందని వివరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 251 మంది మృతి చెందగా, ఆ తర్వాత గుజరాత్(95), మధ్యప్రదేశ్(80), ఢిల్లీ(47), రాజస్తాన్(25) నిలిచాయని తెలిపింది. ఇంకా ఉత్తరప్రదేశ్(21), తమిళనాడు (18), కర్ణాటక(17), పంజాబ్‌లో 16 మంది, బెంగాల్‌లో 15 మంది మరణించారని పేర్కొంది.
ముంబైలో లక్షల్లోనే కేసులు?
ముంబై: ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు లక్షల్లోకి చేరే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఐదుగురు సభ్యుల బృందం అంచనా వేసింది. ఏప్రిల్ 16వ తేదీన ఈ కమిటీ తెలిపిన ప్రకారం.. ఏప్రిల్ 30వ తేదీ నాటికి ముంబైలో కరోనా బాధితుల సంఖ్య 42,604కు, మే 15వ తేదీ నాటికి ఈ సంఖ్య 6,56,407కి ఎగబాకుతుంది. అప్పటికల్లా 13,636 వెంటిలేటర్లు, 4,83,000 ఐసోలేషన్ బెడ్ల కొరత ఉంటుంది. ముంబైలో ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఆక్సిజన్ సరఫరా లేని ఐసోలేషన్ బెడ్లు 30,481, ఆక్సిజన్ సపోర్ట్‌తో కూడినవి 5,466 వరకు కావాల్సి ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment