Union Home department
-
కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు జెడ్ ప్లస్ భద్రత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జెడ్–ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు గురువారం కేంద్ర హోం శాఖ ఆదేశాలిచ్చింది. ఆయన భద్రతకు ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారి వివరించారు. దేశంలో ఆయన ఎక్కడికెళ్లినా సీఆర్పీఎఫ్ జవాన్లు వెన్నంటి ఉంటారు. రానున్న ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే దేశవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. అందుకే ఆయనకు భద్రతను పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇకపై ఆయనకు 24 గంటలపాటూ మూడు షిఫ్టుల్లో 30 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు రక్షణ కల్పిస్తారు. దీంతోపాటు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, పైలట్, ఎస్కార్టు సమకూరుస్తారు. ప్రధాని మోదీకి అత్యంత కట్టుదిట్టమైన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రత ఉంది. దేశంలో అధిక ముప్పు ఉన్న వారికి అందించేదే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత. ఆ తర్వాత ఎక్స్, వై కేటగిరీలుంటాయి. -
అడిషనల్ డీజీ విజయ్‌కుమార్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ: పోలీస్‌శాఖలో విశిష్ట సేవలకుగాను సీనియర్ ఐపీఎస్ అధికారి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, సంగారెడ్డి ఎస్పీ మదాడి రమణకుమార్‌లకు కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ పోలీస్ పతకాలు దక్కాయి. ఈ ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్ట్వ్ గిష్డ్ సర్విస్) కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 954 మందికి పోలీస్ పతకాలు సోమవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీటిలో ఒకరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్యపతకం, 229 మందికి పోలీస్ శౌర్యపతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు దక్కాయి. విజయ్‌కుమార్ : తెలంగాణ నుంచి జాతీయస్థాయిలో పోలీస్ పతకాలు దక్కిన వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ 1997 బ్యాచ్ ఐపీఎస్‌కు చెందినవారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అ డిషనల్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన గతంలో కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్‌పై ఇంటెలిజెన్స్‌లో పదేళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్ సిటీ, మాదాపూర్ డీసీపీగా, కడప, నల్లగొండ జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు. రమణకుమార్: రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం దక్కిన మరో అధికారి మదాడి రమణకుమార్ ప్రస్తుతం సంగారెడ్డి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సుదీర్ఘకాలంపాటు ఏసీబీలో పనిచేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో పనిచేస్తున్న ఎస్పీ భాస్కరన్‌కు పోలీస్ శౌర్య పతకం దక్కింది. భాస్కరన్ సహా మొత్తం 22 మందికి పోలీస్ శౌర్య పతకాలు(పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ–పీఎంజీ) , ఉత్తమ ప్రతిభా పోలీస్ పతకాలు (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పది మందికి దక్కాయి. నలుగురు జైలు అధికారులకు కూడా... నలుగురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్ చెరుకూరి విజయ, అసిస్టింట్ డిప్యూటీ జైలర్ సీ.హెచ్.కైలాశ్, హెడ్‌వార్డర్ జి.మల్లారెడ్డిలు ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు. జహీరాబాద్ ఫైర్‌స్టేషన్‌కు చెందిన లీడింగ్ ఫైర్‌మ్యాన్ శ్రీనివాస్‌కు ఫైర్ సర్విస్ ప్రతిభా పురస్కారం దక్కింది. హోంగార్డులు కె.సుందర్‌లాల్, చీర్ల కృష్ణ సాగర్లకు హోమ్గార్డ్స్ – సివిల్ డిఫెన్స్ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిద్దరూ బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న తల్లి, ఇద్దరు పిల్లలను రక్షించడంతో ఈ అవార్డుకు ఎంపిక చేశారు. -
National Crime Records Bureau: మూడేళ్లలో..13.13 లక్షల మంది మహిళలు మిస్సింగ్
న్యూఢిల్లీ: దేశంలో 2019–21 సంవత్సరాల మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు కనిపించకుండాపోయారని కేంద్రం తెలిపింది. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి అత్యధికంగా సుమారు 2 లక్షల మంది ఉన్నారని, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉందని పేర్కొంది. గత వారం పార్లమెంట్లో కేంద్ర హోం శాఖ ఇందుకు సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నమోదు చేసిన గణాంకాలను వెల్లడించింది. మూడేళ్ల కాలంలో మిస్సయిన మొత్తం 13.13 లక్షల మందిలో బాలికలు 2,51,430 మంది కాగా, 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 10,61,648 అని వివరించింది. 2019–2021 మధ్య మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1,60,180 మహిళలు, 38,234 మంది బాలికలు అదృశ్యమయినట్లు ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఉన్న పశ్చిమబెంగాల్లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు మిస్సయ్యారని తెలిపింది. ఇదే సమయంలో మహారాష్ట్రలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు.. ఒడిశాలో 70,222 మంది మహిళలు, 16,649 మంది బాలికలు..ఛత్తీస్‌గఢ్‌లో 49,116 మంది మహిళలు, 10,817 మంది బాలికలు కనిపించకుండాపోయారు. 2019–21 మధ్య ఢిల్లీలో 61,054 మంది మహిళలు, 22,919 మంది బాలికలు కనిపించకుండాపోయారు. -
డ్రగ్స్ బారి నుంచి యువత, మహిళలకు విముక్తి
సాక్షి, అమరావతి: దేశంలో మాదకద్రవ్యాల బారి నుంచి యువత, మహిళలను విముక్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ తాజాగా పేర్కొంది. జాతీయ స్థాయిలో నషా ముక్త్ భారత్ అభియాన్ కింద మాదకద్రవ్యాల వినియోగం నుంచి యువత, మహిళలను దూరం చేయడానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించింది. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద దేశంలో అత్యధికంగా మాదకద్ర వ్యాలు వినియోగించే 372 జిల్లాల్లో 8 వేల మంది యువ వలంటీర్ల ద్వారా పెద్ద ఎత్తున కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపింది. తద్వారా 3.12 కోట్ల మంది యువతను మాదకద్ర వ్యాల వినియోగం నుంచి దూరం చేసినట్లు వెల్లడించింది. అలాగే 2.06 కోట్ల మంది మహిళలకు కూడా విముక్తి కల్పించినట్టు పేర్కొంది. ఇందుకు కార్యా చరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపింది. మాదకద్రవ్యాలకు బానిస లైన వారి కోసం 340 సమీకృత పునరావాస కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని వివరించింది. చికిత్స అందించడ మే కాకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. డీఅడిక్షన్ కోసం హెల్ప్‌లైన్ మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక డీఅడిక్షన్ కేంద్రా లకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తోందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 46 డ్రగ్స్ చికిత్సలను అందిస్తున్నట్టు తెలిపింది. అలాగే ప్రాథమిక కౌన్సెలింగ్, తక్షణ సహాయం అందించడానికి డీఅడిక్షన్ కోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14446 ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్‌తో పాటు రాష్ట్ర విద్యా శిక్షణ, పరిశోధన సంస్థలు, కేంద్రీయ విద్యా లయాల ద్వారా క్రమం తప్పకుండా మాదకద్రవ్యా ల వినియోగం వల్ల కలిగే నష్టాలు, హానిపై అవ గాహన కల్పిస్తున్నామని తెలిపింది. అలాగే విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సెన్సిటైజే షన్ సెషన్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. గత మూడేళ్లలో డ్రగ్స్ వినియో గిస్తున్న వారిపై 1,24,891 కేసులను నమోదు చేయ డంతో పాటు 1,30,458 మందిని అరెస్టు చేసినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. 18 ఏళ్లలోపు డ్రగ్స్ వినియోగిస్తూ అరెస్టు అయిన వారి గణాంకాలను పరిశీలిస్తే.. పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నట్లు బాంబుపేల్చింది. గత మూడేళ్లలో 18 ఏళ్లలోపు డ్రగ్స్ వినియోగిస్తున్న 935 మంది పురుషులు అరెస్టు కాగా అదే సమయంలో 9,077 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారని పేర్కొంది. 2018 సర్వే ప్రకారం.. దేశంలో 10 నుంచి 17 ఏళ్లలోపు 86 లక్షల మంది పిల్లలు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తేలిందని వెల్లడించింది. -
లోన్ యాప్‌లకు కళ్లెం..వేధింపుల కట్టడికి గూగుల్ చర్యలు
సాక్షి, అమరావతి : లోన్ యాప్ సంస్థల వేధింపులకు ఎట్టకేలకు కళ్లెం పడనుంది. భారీ వడ్డీలతో బెంబేలెత్తిస్తూ, రుణ గ్రహీతల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ వేధించే లోన్ యాప్ సంస్థల కట్టడికి గూగుల్ సిద్ధమవుతోంది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు వ్యక్తుల వ్యక్తిగత సమాచారం లోన్ యాప్ సంస్థలకు అందుబాటులో లేకుండా మార్గదర్శకాలు రూపొందించింది. కొత్త విధానం మే 31 నుంచి అమలులోకి రానుంది. ఫొటోలు, వీడియోల మార్ఫింగులతో వేధింపులు చైనా కేంద్రంగా పనిచేస్తున్న లోన్ యాప్ సంస్థలు అత్యధిక వడ్డీలు, పారదర్శకతలేని విధానాలతో రుణ గ్రహీతలను వేధిస్తున్నాయి. ఎంతగా వాయిదాలు చెల్లిస్తున్నా వడ్డీ, అసలు కలిపి అప్పు కొండలా పెరుగుతుందే తప్ప తగ్గదు. వాయిదాల చెల్లింపులో జాప్యం చేస్తే రుణ గ్రహీతల మొబైల్ ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని దుర్వినియోగం చేస్తున్నాయి. రుణం తీసుకున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బంధువులు, మిత్రులకు వాట్సాప్ చేస్తూ వేధిస్తున్నాయి. ఈ అవమాన భారంతో దేశంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లోన్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే వ్యక్తుల ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం అంతా ఆ యాప్ నిర్వాహకులకు అందుబాటులోకి తేవాలి. ఈమేరకు యాక్సెస్‌కు అనుమతిస్తేనే లోన్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. రుణం కావాలన్న ఆతృతలో వ్యక్తులు యాక్సెస్‌కు అనుమతిస్తున్నారు. దీన్నే ఆ సంస్థలు దుర్వినియోగం చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాయి. దాంతో రంగంలోకి దిగిన కేంద్ర హోం, ఆర్థిక శాఖలు లోన్‌యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించాయి. మనీలాండరింగ్‌కు, ఆర్థి క మోసాలకు పాల్పడుతున్న పలు లోన్ యాప్ కంపెనీలపై కేసులు పెట్టాయి. 2022లో 2 వేల కంపెనీలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్ ఇవ్వొద్దని గూగుల్‌కు ఆదేశం వ్యక్తుల వ్యక్తిగత సమాచారం లోన్ యాప్ సంస్థలకు అందుబాటులో లేకుండా చేయడమే దీనికి పరిష్కారమని కేంద్ర హోం శాఖ భావించింది. వ్యక్తిగత సమాచారం కోరే లోన్ యాప్‌లకు ప్లే స్టోర్‌లో అవకాశం ఇవ్వద్దని గూగుల్‌కు కొన్ని నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ యాప్ సంస్థలతో పాటు గూగుల్‌పైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తేలి్చచెప్పింది. దాంతో గూగుల్ దిగి వచ్చింది. వ్యక్తిగత సమాచారం లోన్‌యాప్‌లకు అందుబాటులో లేకుండా చేసేందుకు చర్యలు చేపడుతోంది. లోన్ యాప్ కంపెనీలకు గూగుల్ మార్గదర్శకాలు భారత్‌లో వ్యాపారం చేసే లోన్ యాప్ సంస్థలకు గూగుల్ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే వారి వ్యక్తిగత సమాచారాన్ని కోరకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు యాప్‌ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని చెప్పింది. భారత్‌లో నాన్ బ్యాంకింగ్ వ్యవహారాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలను పాటించాలని, ఈమేరకు డిక్లరేషన్ ఇచ్చే యాప్ సంస్థలనే గూగుల్ ఇండియా ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. కొత్త విధానం ప్రకారం లోన్ యాప్‌లను మాడిఫై చేసి ఈ ఏడాది మే 31లోగా అప్లోడ్ చేయాలని చెప్పింది. వాటినే ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీంతో దేశంలో లోన్ యాప్‌ల వేధింపులకు కళ్లెం పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
బాల్య వివాహాల్లో జార్ఖండ్ టాప్
రాంచీ: చిన్నతనంలోనే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండకుండానే 5.8% మంది బాలికలకు పెళ్లిళ్లవుతున్నాయి. ఈ విషయంలో దేశవ్యాప్త సరాసరి 1.9% కాగా, కేరళలో 0.0% గా ఉంది. కేంద్ర హోం శాఖ నిర్వహించిన శాంపిల్ సర్వే–2020లో ఈ విషయం వెల్లడైంది. సర్వే వివరాలను రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వెల్లడించారు. జార్ఖండ్‌లో బాల్య వివాహాలు పల్లెల్లో 7.3%, పట్టణ ప్రాంతాల్లో 3% జరుగుతున్నాయి. 21 ఏళ్లు రాకుండానే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 21 ఏళ్లు రాకుండా 54.0% మంది యువతులకు మూడుముళ్లు పడుతుండగా, జార్ఖండ్‌లో ఇది 54.6% గా ఉంది. ఈ విషయంలో జాతీయ స్థాయి సగటు 29.5% మాత్రమే. జార్ఖండ్ మరో అపప్రథ కూడా మూటగట్టుకుంది. మంత్రాల నెపంతో ఇక్కడ 2015లో 32 హత్యలు చోటుచేసుకోగా 2018లో 18 మంది, 2019, 2020ల్లో 15 మంది చొప్పున హత్యకు గురయినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తెలిపింది. -
షీలా కమిటీ సిఫార్సులే దిక్సూచి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9లో పొందుపరచిన ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల మొత్తం ఆస్తులు, అప్పులను షీలా భిడే కమిటీ సిఫార్సుల మేరకు ఇరు రాష్ట్రాలూ విభజించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ వద్ద ప్రతిపాదించింది. విభజన సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ అడుగు ముందుకు వేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇందుకు విముఖత వ్యక్తం చేసింది. కేంద్ర హోంశాఖ మాత్రం ఏపీ ప్రతిపాదనల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ న్యాయ శాఖ సలహా తీసుకోనున్నట్లు తెలిపింది. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఢిల్లీలో మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎస్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ► షెడ్యూల్ 9లో పేర్కొన్న 90 ప్రభుత్వ రంగ సంస్ధలు, కార్పొరేషన్ల ఆస్తులు, అప్పులను ఇరు రాష్ట్రాలకు విభజిస్తూ షీలా భిడే నిపుణుల కమిటీ సిఫార్సులు చేసింది. అయితే 68 సంస్థలకు సంబంధించిన సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం, వీటిలో 53 సంస్ధల సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ని రోజులుగా అంగీకరిస్తూ వచ్చినా విభజన మాత్రం జరగలేదు. తాజాగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 90 సంస్ధలకు సంబంధించి షీలా భిడే సిఫార్సులను యధాతథంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖను కోరింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరగా న్యాయ సలహా తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. ► విభజన చట్టం షెడ్యూల్ 10లో పేర్కొన్న ఇన్స్టిట్యూట్స్ ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి 2016లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. పదో షెడ్యూల్లోని 142 ఇన్స్టిట్యూషన్ల ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతూ వస్తోంది. అందుకు అనుగుణంగా ఒక సంస్థ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా ఇచి్చంది. అయితే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నందున ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. దీనిపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరింది. ► ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తులను ఇరు రాష్ట్రాలకు త్వరగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. విభజన చట్టం నిబంధనల మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయాలని, జాప్యం చేయవద్దని ఏపీ ప్రభుత్వం కోరింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రాష్ట్ర పునర్విభజన ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యయం భారీగా పెరుగుతోంది.. ► నూతన రాజధాని కోసం రూ.25 వేల కోట్ల వ్యయం అవుతుందని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో పేర్కొన్నారని, ఆ నివేదిక ఇచ్చి చాలా సంవత్సరాలైనందున వ్యయం భారీగా పెరుగుతుందని, ఆ మేరకు నిధులివ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. మీరిచ్చే రూ.2,500 కోట్లు ఏ మూలకూ సరిపోవని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసింది. ► నూతన రాజధానికి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావించగా వయబుల్ కాదని రైల్వే శాఖ పేర్కొంది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని కారణంగానే విభజన చట్టంలో చేర్చారని, వయబుల్ కాకపోయినప్పటికీ కేంద్రం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ వాదనతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏకీభవిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రైల్వే శాఖకు సూచించారు. -
‘పద్మ’ అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం–2023 సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం ఆన్లైన్ నామినేషన్లు, సిఫారసు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైనట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. పద్మ అవార్డుల నామినేషన్లను ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు https://padmaawards.gov.in పోర్టల్ ద్వారా స్వీకరిస్తామని తెలిపింది. వివిధ కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ప్రజాసంబంధాలు, సేవ, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమ మొదలైన రంగాలు, విభాగాలలో విశిష్టమైన, అసాధారణ విజయాలు, సేవలకు ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు. -
2020లో 1.53 లక్షల ఆత్మహత్యలు
న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో రోజుకు 418 చొప్పున మొత్తం 1,53,052 బలవన్మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో వ్యవసాయ రంగానికి చెందిన 10,677 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతకుముందు, 2019 సంవత్సరంలో మొత్తం 1,39,123 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తన వార్షిక నివేదికలో తెలిపింది. ఆత్మహత్యల రేటు ప్రతి వెయ్యి మందికి 2019లో 10.4% ఉండగా 2020లో అది 11.3%కి పెరిగిందని కేంద్ర హోం శాఖ అధీనంలో పనిచేసే ఎన్సీఆర్బీ వెల్లడించింది. 2020లో వ్యవసాయ రంగానికి చెందిన 10,677 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో 5,579 మంది రైతులు, 5,098 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారనీ, మొత్తం 1,53,052 ఆత్మహత్యల్లో 7% మంది సాగు రంగానికి చెందిన వారేనని విశ్లేషించింది. బలవన్మరణం చెందిన 5,579 మంది రైతుల్లో పురుషులు 5,335 మంది, 244 మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది. ఆత్మహత్యల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 19,909, ఆతర్వాత తమిళనాడులో 16,883, మధ్యప్రదేశ్‌లో 14,578, బెంగాల్లో 13,103, కర్ణాటకలో 12,259 చోటుచేసుకున్నట్లు వివరించింది. మొత్తం బలవన్మరణాల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 50.1% వరకు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో మాత్రం మొత్తం బలవన్మరణాల్లో 3.1%మాత్రమే సంభవించాయని నివేదిక తెలిపింది. 2020లో సంభవించిన బలవన్మరణాల్లో 23,885 కేసులు దేశంలోని 53 నగరాల్లోనే నమోదయ్యాయి. మెగా నగరాల్లో ఆత్మహత్యల రేటు 14.8% కాగా, జాతీయ స్థాయి ఆత్మహత్యల రేటు 11.3% కావడం గమనార్హం. మొత్తం ఆత్మహత్యల్లో కుటుంబసమస్యల కారణంగా 33.6%, వివాహ సమస్యలతో 5%, వ్యాధులతో 18% మొత్తం 56.7% సంభవించినట్లు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. అదేవిధంగా, బలవంతంగా ప్రాణాలు తీసుకున్న వారిలో పురుషులు 70.9% కాగా, మహిళలు 29.1% మంది ఉన్నారని నివేదిక పేర్కొంది. -
భిన్నంగా లాక్డౌన్ 4.0
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించే లక్ష్యంగా కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ మూడో దశ నేటితో ముగియనుంది. ఈ నెలాఖరు వరకు కొనసాగే నాలుగో దశ లాక్డౌన్ ఈసారి భిన్నంగా ఉండే అవకాశాలున్నాయని కేంద్రం సూచనలిచ్చింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను విడుదల చేయనుంది. నాలుగో దశలో భాగంగా కంటైన్మెంట్ జోన్లలో మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఆటోలు, రిక్షాలు, బస్సులు, క్యాబ్‌లు తిరిగేందుకు కేంద్రం అనుమతించే చాన్సుంది. కంటైన్మెంట్ జోన్లుకాని అన్ని జిల్లాల్లో అత్యవసరేతర వస్తువుల సరఫరా, ఈ–కామర్స్ సంస్థలకు ఓకేచెప్పనుంది. ఆఫీస్‌లు, కర్మాగారాలను మరింత మంది సిబ్బందితో నడిపేందుకు వెసులుబాటు ఇచ్చే అవకాశాలున్నాయి. కోవిడ్ రెడ్ జోన్ల నిర్వచనాన్ని కూడా కేంద్రం మార్చనుందని సమాచారం. కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు లాక్డౌన్ సమయంలో 33 శాతం సిబ్బందితోనే ఫ్యాక్టరీలుఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే, మరింత మంది సిబ్బందిని పనుల్లోకి తీసుకునే వెసులుబాటు కల్పించాలని ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దేశంలో జూన్, జూలై నెలల్లో మరింతగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తుండగా కేంద్రం ఆంక్షలను క్రమక్రమంగా సడలిస్తూండటం గమనార్హం. 30 మున్సిపాల్టీలు/కార్పొరేషన్లకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచన దేశంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులు 30 మున్సిపాల్టీలు/కార్పొరేషన్లలోనే బయటపడినట్లు తేలడంతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా మున్సిపాల్టీలు/కార్పొరేషన్లు ఉన్న రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లోనే ఈ 30 మున్సిపాల్టీలు/కార్పొరేషన్లు ఉన్నాయి. ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతీ సుదాన్, ఓఎస్డీ రాజేశ్ భూషణ్ మాట్లాడారు. కరోనా బాధితులను గుర్తించడంతో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని, రికవరీ రేటు పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు చేపట్టిన చర్యలను సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో నిఘా పెంచండి.. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి పట్టణ ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు అర్బన్ సెటిల్మెంట్లలో కరోనా నియంత్రణపై మార్గదర్శకాలను శనివారం జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని వెల్లడించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా సెక్షన్ 144ను అమలు చేయాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో చాలాచోట్ల ప్రజలు విచ్చలవిడిగా సంచరిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టికి రావడంతో ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. -
నేటి నుంచి నౌకలు, విమానాల్లో భారతీయుల తరలింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని ప్రాధాన్య క్రమంలో రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. మే 7 నుంచి విమానాలు, నౌ కల ద్వారా విదేశాల నుంచి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుందన్నారు. ఇప్పటికే 1.90 లక్షల మంది భారతీయులు ఇండియాకు వచ్చేందుకు వివిధ దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో, హైకమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. మొదటి దశలో 13 దేశాల నుంచి 14,800 మంది భారతీయులను 64 విమానాల్లో భారత్‌కు తీసుకురానున్నట్లు చెప్పారు. అమెరికా, సింగపూర్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, యూకే, యూఏఈ, సౌదీ, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ దేశాల నుంచి అక్కడున్న భారతీయులను తీసుకువస్తామన్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒక్కో విమానంలో 200 నుంచి 300 మందిని తరలిస్తారన్నారు. ఆయా దేశాల నుంచి వెలివేయబడిన వారు, వీసా గడువు ముగిసిన వారు, వలస కార్మికులు, ఆరోగ్యరీత్యా భారత్‌లోని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అవసరమైన వారు, గర్భిణిలు, భారత్‌లో చనిపోయిన వారి బంధువులు, ఆయా దేశాల్లో చిక్కుకున్న పర్యాటకులు, విదేశాల్లో హాస్టళ్లు మూతబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను అదే ప్రాధాన్య క్రమంలో తీసుకువస్తామన్నారు. మొదటి గల్ఫ్ యుద్ధం తర్వాత మళ్లీ ఇదే అతి పెద్ద తరలింపు కార్యక్రమమని చెప్పారు. భారత్‌కు రావాలనుకున్న వారు కరోనా పరీక్షలు పూర్తయి సర్టిఫికెట్ పొంది ఉండాలని, భారత్ వచ్చాక మళ్లీ పరీక్షల అనంతరం క్వారంటైన్‌కు వెళ్లాలన్నారు. -
తెలంగాణకు కేంద్ర బృందం
సాక్షి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్/లక్నో: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు 5 బహుళ మంత్రిత్వ శాఖల బృందాలను(ఐఎంసీటీ) పంపుతున్నట్టు కేంద్ర హోం శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి ఈ బృందాలను ఏర్పాటు చేశారు. గుజరాత్‌కు రెండు, తెలంగాణకు ఒకటి, తమిళనాడుకు ఒకటి, మహారాష్ట్రకు ఒకటి చొప్పున ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్ జిల్లాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను ప్రజలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, దీనివల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతోపాటు ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తేల్చిచెప్పింది. ఈ జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించి, లాక్డౌన్ నిబంధనల అమలు, నిత్యావసరాల సరఫరా, కరోనా నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్ల లభ్యత, పేదలు, వలస కూలీల క్యాంపుల్లో పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తాయి. అలా అయితే 73,400 కేసులు.. దేశంలో లాక్ డౌన్ విధించకుంటే ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 8 గంటల సమయానికి 73,400 కరోనా పాజిటివ్ కేసులు వచ్చి ఉండేవని కరోనా సాధికార బృందం–1 ఛైర్మన్ డాక్టర్ వీకే పాల్ శుక్రవారం తెలిపారు. కరోనా వ్యాప్తిపై జరిగిన ఒక అధ్యయనం వివరాలను ఆయన తెలిపారు. లాక్డౌన్ విధించడం వల్ల ఏప్రిల్ 24వ తేదీ ఉదయం నాటికి కరోనా పాజిటివ్ కేసులు 23,077కు పరిమితమయ్యాయని చెప్పారు. లాక్డౌన్ విధించని పక్షంలో ఈ కేసులు మే 5వ తేదీ నాటికి 4 లక్షలకు చేరేవని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో ప్రమాదకరం గుజరాత్‌లోని ప్రధాన నగరం అహ్మదాబాద్‌లో నాలుగు రోజులకోసారి కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మే ఆఖరుకల్లా నగరంలో ఈ కేసులు ఏకంగా 8 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్‌లోనే అత్యధికంగా అహ్మదాబాద్‌లో 1,638 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యూపీలో సామూహిక ప్రార్థనలు.. రంజాన్ మాసం సందర్భంగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసినందుకు గాను 32 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మా వాళ్లను వెనక్కి తీసుకొస్తాం యోగి ఆదిత్యనాథ్ లాక్డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన కూలీలను వెనక్కి తీసుకొస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం హామీ ఇచ్చారు. ఈ మేరకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనే ఉండిపోయి, అక్కడ 14 రోజుల క్వారంటైన్ గడువును పూర్తి చేసుకున్నవారి జాబితాలను రూపొందించాలన్నారు. వారందరినీ దశల వారీగా రాష్ట్రానికి రప్పించాలని పేర్కొన్నారు. ఇప్పటికే యూపీ సరిహద్దుల వరకు చేరుకుని, అక్కడే వేచి చూస్తున్న కూలీలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, వారిని వారి సొంత జిల్లాలకు చేర్చి, 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచాలన్నారు. -
20వేల మార్కు దాటేసింది
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి బాధితుల సంఖ్య బుధవారానికి 20 వేల మార్కును అధిగమించింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రానికి 1,486 కొత్త కేసులు నమోదు కాగా, 49 మంది మృతి చెందారు. దీంతో కేసుల సంఖ్య 20,471కి చేరింది. మృతుల సంఖ్య 652కు పెరిగింది. కోవిడ్–19 యాక్టివ్ కేసులు 15,859 కాగా ఇప్పటి వరకు 3,959 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని కేంద్ర హోం శాఖ తెలిపింది. దీంతో, 19 శాతం మంది కోలుకున్నట్లయిందని వివరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 251 మంది మృతి చెందగా, ఆ తర్వాత గుజరాత్(95), మధ్యప్రదేశ్(80), ఢిల్లీ(47), రాజస్తాన్(25) నిలిచాయని తెలిపింది. ఇంకా ఉత్తరప్రదేశ్(21), తమిళనాడు (18), కర్ణాటక(17), పంజాబ్‌లో 16 మంది, బెంగాల్లో 15 మంది మరణించారని పేర్కొంది. ముంబైలో లక్షల్లోనే కేసులు? ముంబై: ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు లక్షల్లోకి చేరే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఐదుగురు సభ్యుల బృందం అంచనా వేసింది. ఏప్రిల్ 16వ తేదీన ఈ కమిటీ తెలిపిన ప్రకారం.. ఏప్రిల్ 30వ తేదీ నాటికి ముంబైలో కరోనా బాధితుల సంఖ్య 42,604కు, మే 15వ తేదీ నాటికి ఈ సంఖ్య 6,56,407కి ఎగబాకుతుంది. అప్పటికల్లా 13,636 వెంటిలేటర్లు, 4,83,000 ఐసోలేషన్ బెడ్ల కొరత ఉంటుంది. ముంబైలో ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఆక్సిజన్ సరఫరా లేని ఐసోలేషన్ బెడ్లు 30,481, ఆక్సిజన్ సపోర్ట్‌తో కూడినవి 5,466 వరకు కావాల్సి ఉంటాయి. -
నిత్యావసరాలకే ఈ–కామర్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసుల్లేని గ్రీన్ జోన్లలో ఈ నెల 20 నుంచి పూర్తి స్థాయిలో ఈ కామర్స్ కార్యకలాపాలకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం నుంచి కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. కేవలం నిత్యావసరాలకే తప్ప (ఆహారోత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు), ఇతర ఉత్పత్తుల విక్రయాలకు ఈ కామర్స్ కంపెనీలకు అనుమతి లేదంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుందన్న ప్రశ్నకు.. అత్యవసరం కాని వస్తువుల విక్రయాలకు ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను అనుమతించడం వల్ల లౌక్‌డౌన్ పటిష్ట అమలుపై ప్రభావం చూపిస్తుందని గ్రహించడంతో నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగినట్టు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పున్య సలీల శ్రీవాస్తవ తెలిపారు. ఈ కామర్స్ సంస్థలను అనుమతించినట్టు, తమను కూడా విక్రయాలకు అనుమతించాలని రిటైల్ వర్తకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే కేంద్రం తన విధానాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. -
రాష్ట్రాలకు కేంద్రం 11 వేల కోట్ల నిధులు
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎంఎఫ్) కింద రాష్ట్రాలకు 11,092 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎంఎఫ్‌కు తొలి విడత కింద ఈ నిధులు విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఈ నిధులను క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు సహా ఇతర వ్యవహారాల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు అనంతరం ఈ నిధులు విడుదల చేయడం గమనార్హం. -
ప్రపంచం భారత్ వైపు చూస్తోంది
రాయదుర్గం: ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం భారతదేశం వైపు చూస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ‘ఐడియాస్ ఫర్ ఇండియా–2020’పాలసీ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ఉదయం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోందని, అందుకు ప్రధాని నరేంద్రమోదీ విధానాలే కారణమన్నారు. ప్రపంచంలోనే బలమైన ఆర్థికశక్తిగా భారత్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వచ్చే రోజుల్లో భారత్ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, నీతిఆయోగ్ ఏర్పాటు వంటి సాహసోపేత నిర్ణయాల అమలు ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు, అన్ని రంగాల్లో ముందంజ వేసేందుకు యువకులు, విద్యార్థులు, మేధావులు సూచనలు చేయాలన్నారు. దేశంలోకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలసలు పెరిగిపోయాయని, అందుకోసమే సీఏఏ చట్టాన్ని రూపొందించారని, కొందరు దీన్ని వక్రీకరిస్తూ అపోహలు సృష్టిస్తున్నారన్నారు. సోషల్ మీడియా బాధ్యతగా ఉండాలి సోషల్ మీడియా బాధ్యతతో వ్యవహరించాలని కిషన్‌రెడ్డి సూచించారు. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు, కొన్ని రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ధోరణే ఢిల్లీ అల్లర్లకు కారణమన్నారు. అల్లర్లకు కారణమైనవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో ఐఎస్బీ డిప్యూటీ డీన్ సంజయ్‌కల్లాపూర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సస్టెయినబుల్ పాలసీ మేకింగ్ ఫర్ ది కంట్రీస్ గ్రోత్, రెస్పాన్సిబుల్ మీడియా, ఫిల్మ్ మేకింగ్ అండ్ సెన్సార్షిప్, యూత్ ఇన్ పాలిటిక్స్, మోటివేటింగ్ దెమ్ టు కాంటెస్ట్ ఎలక్షన్స్, సివిల్ సర్వీస్ పాలసీ రిఫార్మ్స్ ఫర్ ది 21ఫస్ట్ సెంచురీ అనే అంశాలపై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్స్‌లో ఎంపీలు, పోలీసు ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొని అభిప్రాయాలను వెలిబుచ్చారు. -
రాష్ట్ర రాజధానిని నిర్ణయించడంలో కేంద్రం పాత్ర లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధానిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని కేంద్ర హోంశాఖ పునరుద్ఘాటించింది. టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం సమాధానం ఇచ్చారు. ‘రాష్ట్ర రాజధాని ఎంపికలో నిర్దిష్ట విధాన ప్రక్రియ ఏదైనా ఉందా? ఉంటే ఆ వివరాలు ఇవ్వండి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తమ రాజధానులను ఎంపిక చేసుకున్న పద్ధతిని వివరించండి. ఈ ఎంపికలో కేంద్రం ఏదైనా పాత్ర పోషించగలదా? పోషించగలిగితే వివరాలు ఇవ్వండి..’ అంటూ కేశినేని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ‘ఒక రాష్ట్ర రాజధానిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇందులో పాత్ర ఏమీ లేదు..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పునరుద్ఘాటించారు. -
నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే
-
రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విధానానికి మద్దతు పలికింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లోక్‌సభకు మంగళవారం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. దీంతో టీడీపీ వాదనలన్నీ ప్రజలను పక్కదారి పట్టించేందుకేనన్న విషయం స్పష్టమవుతోంది. రాజధాని అంశంలో ప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు పన్నిన కుయుక్తి బెడిసికొట్టింది. లోక్‌సభ వేదికగా టీడీపీ వేసిన పాచిక వారికే ఎదురుతిరిగింది. రాష్ట్ర రాజధాని అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లిఖితపూర్వకంగా సమాధానమివ్వడంతో ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ విధానం సరైనదేనని స్పష్టమైంది. నిత్యానంద్రాయ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చేసిన ప్రకటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్రం స్పందన ఏమిటి?: గల్లా రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని టీడీపీ రాజకీయ ఎత్తుగడ వేసింది. ఈమేరకు ఎంపీ గల్లా జయదేవ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వానికి లోక్‌సభలో ప్రశ్నలు వేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? వస్తే దీనిపై కేంద్రం స్పందన ఏమిటి? ఈ నిర్ణయం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా సహాయపడుతుంది? పెట్టుబడుల వాతావరణం దెబ్బతినడమే కాకుండా రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన వేలాది మంది రైతులకు నష్టం వాటిల్లుతున్నందున ఇలాంటి నిర్ణయాలు తీసుకోరాదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తుందా? ఇస్తే అందుకు సంబంధించి వివరాలేమిటి?’ అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. టీడీపీకి చెందిన మరో సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) అమరావతిలో నిరసన అంశాన్ని రాజకీయం చేసేందుకు యత్నిస్తూ ప్రశ్న అడిగారు. ‘అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో సామూహిక నిరసనలు జరుగుతున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందా? నిరసనకారులపై పోలీసుల దాడులు కేంద్రం దృష్టికి వచ్చాయా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా? ఈ విషయంలో జోక్యం చేసుకునే యోచన ఉందా?’ అని అడిగారు. రాజధాపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే మూడు రాజధానుల అంశంపై టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని ఎక్కడైనా నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే దఖలు పడి ఉంది’ అని విస్పష్టంగా ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరంగా అమరావతిని నోటిఫై చేస్తూ 2015 ఏప్రిల్ 23న జీవో జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే దఖలు పడి ఉంది..’ అని పేర్కొన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశం శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని కూడా కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈమేరకు టీడీపీ సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘ప్రజల భద్రత, పోలీసింగ్ రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు ప్రకారం రాష్ట్రాల జాబితాలోని అంశాలు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడం, చట్టప్రకారం అపరాధులపై చర్యలు తీసుకునే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో శాంతి భద్రతల స్థితిని పర్యవేక్షిస్తుంది. భారీగా శాంతి భద్రతల సమస్యలు ఉన్నట్లైతే రాష్ట్రాల అభ్యర్థన మేరకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్) పంపడం ద్వారా సాయం చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అలాంటి అభ్యర్థనేదీ కేంద్ర హోం శాఖకు ఇంతవరకూ రాలేదు’ అని వివరించారు. రాజకీయ లబ్ధికి టీడీపీ పాట్లు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చడం లేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పరిపాలన, అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని మొదటి నుంచీ చెబుతోంది. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే ఉత్తరాంధ్రలోని విశాఖను పరిపాలనా రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. కానీ దీనికి వక్రభాష్యం చెబుతూ రాజకీయ లబ్ధి కోసం టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. తమ అనుకూల మీడియా ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. బీజేపీలో చంద్రబాబు కోవర్టు సుజనా చౌదరి తదితరులు కూడా టీడీపీ వాదనను వినిపిస్తూ వికేంద్రీకరణను అడ్డుకుంటామని చెబుతూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. కేంద్రం ప్రకటనపై హర్షాతిరేకాలు.. మూడు రాజధానుల విధానానికి అనుకూలంగా ప్రజా మద్దతు పెరుగుతోంది. బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా ‘రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం. అందులో కేంద్రం ప్రత్యేకంగా జోక్యం చేసుకోదు. నిబంధనల మేరకే వ్యవహరిస్తుంది’ అని చెబుతూ వస్తున్నారు. కానీ చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా దుష్ప్రచారానికి తెగబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బలపరుస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ వేదికగానే కీలక ప్రకటన చేయడం గమనార్హం. కేంద్రం ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ విధానానికి ఇటు ప్రజలు సంపూర్ణంగా మద్దతిస్తుండటం అటు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని పేర్కొంటున్నాయి. -
వారంలోపే ఉరి తీయాలి!
న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన దోషులను ఉరి తీసేందుకు డెత్ వారంట్ జారీ అయిన తరువాత వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ దిశగా ఆదేశాలివ్వాలని కోరుతూ కేంద్ర హోం శాఖ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉరిశిక్షను వాయిదా వేసేందుకు ‘నిర్భయ’ దోషులు రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష.. తదితర చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. ఉరిశిక్షను అమలుచేయడానికి సంబంధించి.. దోషుల హక్కులను కాకుండా బాధితుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ‘క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన వారం రోజుల్లో డెత్ వారంట్ జారీ చేయాలి. ఆ తరువాత వారం రోజుల్లో ఉరి శిక్షను అమలు చేయాలి. సహ దోషుల రివ్యూ, క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు ఏ స్థాయిలో ఉన్నా వాటిని పట్టించుకోకూడదు. అన్ని కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, జైలు అధికారులు దీన్ని అమలు జరిపేలా ఆదేశాలివ్వండి’ అని హోంశాఖ తన పిటిషన్లో కోరింది. దోషుల రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన తరువాత క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసేందుకు కచ్చితమైన కాలపరిమితి విధించాలని కూడా హోంశాఖ కోరింది. క్షమాభిక్ష కోరుకునే దోషి.. సంబంధిత కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ తనకు అందిన వారం రోజుల్లోపే క్షమాభిక్ష కోరుకునే విధంగా నిబంధనలను రూపొందించాలని పేర్కొంది. ‘అత్యాచారం కేవలం ఒక వ్యక్తిపై చేసే నేరం కాదు. మానవత్వంపై జరిగిన ఘాతుకం. అది నాగరిక సమాజం క్షమించలేని దారుణం’ అని హోంశాఖ ఆ పిటిషన్లో పేర్కొంది. ‘అందువల్ల ప్రజలు, బాధితులు, వారి కుటుంబాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని, దోషులను శిక్షించేందుకు ఉద్దేశించిన గత నిబంధనలను మార్చాలని.. చట్టంతో ఆడుకుని, శిక్ష అమలును వాయిదావేసే అవకాశం ఆ దారుణానికి ఒడిగట్టిన దోషులకు ఇవ్వవద్దని కోరుతున్నాం’ అని అభ్యర్థించింది. కేంద్ర హోం శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. -
మహేశ్వర్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేశారు?: క్యాట్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ ట్రైనీ కేవీ మహేశ్వర్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేశారో బుధవారం తెలియజేయాలని కేంద్ర హోం శాఖను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశించింది. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని పేర్కొంటూ మహేశ్వర్‌రెడ్డి క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ కేసును మంగళవారం క్యాట్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్ బీవీ సుధాకర్ విచారించి హోం శాఖకు నోటీసులు జారీ చేశారు. అఖిల భారత సర్వీస్ రూల్స్ (డీఅండ్‌ఏ)–1969 ప్రకారం సస్పెండ్ చేయడానికి వీల్లేదని, కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని మహేశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్ శిక్షణ పూర్తి చేశారని, పోస్టింగ్ అందుకోవాల్సిన దశలో నిరాధార ఆరోపణల ఆధారంగా ఆయనను సస్పెండ్ చేశారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఓ క్రిమినల్ కేసు పెండింగ్ ఉందని చెప్పి సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడానికి వీల్లేదని, అలాంటి కేసుల్లో 48 గంటల పాటు రిమాండ్‌లో ఉన్నప్పుడు మాత్రమే సస్పెండ్ చేయొచ్చని చట్టంలో ఉందన్నారు. భువన అనే యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మహేశ్వర్‌రెడ్డి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త మ్యాప్
న్యూఢిల్లీ: ఇటీవలే కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త పటాన్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఇందులో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) జమ్మూకశ్మీర్‌లో ఉండగా, గిల్గిత్–బల్టిస్తాన్ లదాఖ్‌లో ఉంది. పీఓకేలోని ముజఫరాబాద్ భారత సరిహద్దుగా ఉంది. తాజా పటం ప్రకారం లదాఖ్ రెండు జిల్లాలను (కార్గిల్, లేహ్) కలిగి ఉంది. పాత కశ్మీర్ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉండగా, అందులోని లదాఖ్, లేహ్‌లను లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చారు. ఇందులో కార్గిల్ జిల్లాను కొత్తగా ఏర్పాటు చేశారు. కార్గిల్‌తో కలిపి రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో 14 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 28 జిల్లాలు ఏర్పాటయ్యాయి. -
ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి దేశ రాజధానికి చేరుకున్నారు. 11 గంటలకు కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరుతారు. మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని నివాసం చేరుకుంటారు. -
‘మావో అర్బన్’ విచ్ఛిన్నమే లక్ష్యంగా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మావోయిస్టు సానుభూతి పరులు, పౌర హక్కుల నేతల అరెస్టులు తీవ్ర వివాదమవడం తెల్సిందే. అయితే జనావాసాల్లో చురుగ్గా పనిచేస్తున్న మావోయిస్టు వ్యూహకర్తలు, వారి మద్దతుదారుల్ని గుర్తించి అరెస్టులు చేయాలని కేంద్ర హోం శాఖ నుంచి రాష్ట్రాల భద్రతా దళాలకు స్పష్టమైన ఆదేశాలు అందాయని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. అజ్ఞాతంలో ఉన్న మావో దళాలపై దాడులతో సమాంతరంగా మావోయిస్టుల అర్బన్ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడమే తాజా దాడుల లక్ష్యంగా భావిస్తున్నారు. తాజాగా ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) తన నివేదికలో.. నాన్ గవర్నమెంట్ గ్రూపులుగా పైకి కనిపించే మావోయిస్టు ఫ్రంట్ సంస్థలు పట్టణ ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నాయని, అజ్ఞాతంలోని తిరుగుబాటుదారులకు మద్దతుతో పాటు నాయకత్వం వహిస్తున్నాయని తెలిపింది. వారి వ్యూహాలకు అనుగుణంగా.. మావోయిస్టులు భద్రతా దళాలపై దాడులకు ప్రణాళికతో పాటు వ్యూహరచన చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో దాదాపు 300 మంది పట్టణ మావోయిస్టుల్ని అరెస్టు చేసినట్లు హోం శాఖ వర్గాల సమాచారం. అందువల్ల మావో వ్యూహకర్తలు, వారి మద్దతుదారులపై అన్ని వైపుల నుంచి దాడి చేయాలని భద్రతా బలగాలకు ఆదేశాలు అందాయి. రాష్ట్ర బలగాలతో సన్నిహితంగా పనిచేయడంతో పాటు, అప్రమత్తంగా ఉండాలని సీఆర్పీఎఫ్ను కేంద్రం ఆదేశించింది. గ్రేహౌండ్స్‌తో సమాంతరంగా ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసే ఈ దళం ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని ఎదుర్కోనుంది. ఐబీ నివేదిక ప్రకారం పట్టణ మావోయిస్టులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చండీగఢ్, రాంచీ, హైదరాబాద్, నాగ్‌పూర్, మదురై, ఇతర ప్రాంతాల్లో విస్తరించినట్లు సమాచారం. -
ఆపద్బంధు@112
సైదాబాద్‌కు చెందిన 16 ఏళ్ల కీర్తన టెన్త్ చదువుతోంది. తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుండటంతో తల్లి ఫోన్ నుంచి 112కు డయల్ చేసింది. ఫోన్ చేసిన మూడు నిమిషాల్లోనే పోలీసులు రంగప్రవేశం చేశారు. మైనర్‌కు పెళ్లి చేయడం నేరమంటూ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో బాల్యవివాహం బారి నుంచి కీర్తన గట్టెక్కింది. కరీంనగర్ పోలీసు కమిషనరేట్‌లోని సప్తగిరి కాలనీ.. రాత్రి 9 గంటలు కావస్తోంది. ఆఫీస్ నుంచి కాస్త లేటుగా ఇంటికి వస్తున్న కావ్యను దారిలో మందుబాబులు ఏడిపించ సాగారు. దీంతో కావ్య 112కు కాల్ చేసింది. తాగుబోతుల వెక్కిరింతలను పసిగట్టిన 112 సిబ్బంది.. కాలర్ లొకేషన్ గుర్తించి పెట్రోలింగ్‌ను అప్రమత్తం చేశారు. 7 నిమిషాల్లో కావ్య ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకొని ఆకతాయిలను స్టేషన్‌కు తరలించారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి రోజూ 1.2 లక్షల మంది బాధితులు నేరుగా ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ డయల్ 112 సేవలను అత్యవసర సమయాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్‌ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. 911, 000లాగా వివిధ దేశాల్లో ఉన్నట్లుగా అన్ని అత్యవసర సర్వీసులకు ఒకే నంబర్‌కు డయల్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. రాష్ట్రంలో ఇప్పటికే డయల్ 100 (పోలీస్), 101 (ఫైర్ సర్వీసెస్), 108 (అంబులెన్స్) నంబర్ల ద్వారా అత్యవసర సర్వీసులు అందుతున్నా జనవరి ఒకటో తేదీ నుంచి ఈ నంబర్లలో దేనికి కాల్ చేసినా అది ఆటోమెటిక్‌గా డయల్ 112కు డైవర్ట్ అవుతోంది. కాల్ అందుకునే రిసీవర్...వెంటనే సంబంధిత విభాగాన్ని క్షణాల్లో అలర్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ మొబైల్స్‌లో ఎమర్జెన్సీగా...: ప్రస్తుతం జీవీకే సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఈఎంఆర్ఐ) కాల్ సెంటర్ ద్వారా అత్యవసర సేవలను పర్యవేక్షిస్తున్నారు. అయితే నిత్యం వస్తున్న కాల్స్‌లో 40 శాతం వరకు బ్లాంక్ కాల్స్ ఉంటున్నాయని, తాజా స్మార్ట్‌ఫోన్స్‌లో లాక్ బటన్‌ను గట్టిగా నొక్కుతున్నప్పుడు ఆటోమెటిక్‌గా 112కు ఎమర్జెన్సీ కాల్ కలుస్తున్నట్లు ఈఎంఆర్ఐ, పోలీస్‌శాఖ అధ్యయనంలో తేల్చాయి. గతంలో ప్రతి సర్వీస్ ఆపరేటర్, మొబైల్ సంస్థలు ఎమర్జెన్సీ, పోలీస్, అంబులెన్స్ సర్వీసు పేరుతో డయల్ 100, 101, 108 నంబర్లను పీడ్ చేసి పెట్టేవని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మూడు నిమిషాల్లో సర్వీస్ డెలివరీ..: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 నిమిషాల్లోనే పోలీస్ సర్వీస్ డెలివరీ ఉందని, అలాగే రాచకొండలో కొంత ప్రాంతం, సైబరాబాద్‌లో 70 శాతం ప్రాంతం 3 నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్నారని ఈఎంఆర్ఐ సర్వేలో తేలింది. మిగతా ప్రాంతాల్లో 5 నుంచి 7 నిమిషాల్లో పోలీసులు బాధితుల చెంతకు చేరుతున్నట్లు శాంపిల్ సర్వేలో వెల్లడైంది. జిల్లాల్లోని అర్బన్ ప్రాంతాల్లో సర్వీస్ డెలివరీ 7 నుంచి 8 నిమిషాలు పడుతోందని, మారుమూల ప్రాంతాల్లో మాత్రం 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతున్నట్లు ఈఎంఆర్‌ఐలో డయల్ 112ను పర్యవేక్షించే పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జిల్లాలపై డీజీపీ ప్రత్యేక దృష్టి...: హైదరాబాద్ కమిషనరేట్ తరహాలో జిల్లాల్లోనూ పోలీసు సర్వీస్ డెలివరీ వీలైనంత వేగంగా ఉండేలా చూడటంపై డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈఎంఆర్ఐ చేసిన సర్వే ఆధారం గా జిల్లాల్లో పెట్రోలింగ్ విస్తృతం చేయడం, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్ధ అనుసంధానం, జియో ట్యాగింగ్ ద్వారా ప్రజలకు పోలీస్ సర్వీస్ డెలివరీ సమయాన్ని వీలైనంత తగ్గించేలా కార్యచరణ రూపొందించనున్నారు. 94 శాతం సంతృప్తి: రాష్ట్రంలో పోలీస్ సేవలపై ఈఎంఆర్ ద్వారా ఉన్నతాధికారులు శాంపిల్ సర్వే చేయించారు. నిత్యం వచ్చే దాదాపు లక్ష కాల్స్‌లో పది శాతం అంటే 10 వేల మంది బాధితుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఐదు అంశాలతో కూడిన ప్రశ్నలపై సమాధానాలు సేకరించి నివేదిక సమర్పించారు. దీని ప్రకారం 94 శాతం మంది బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. భార్యాభర్తల కేసుల పరిష్కారం, ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో మిగిలిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది.