ఆపద్బంధు@112 | New Emergency Number Services from across the country from January 1 | Sakshi
Sakshi News home page

ఆపద్బంధు@112

Published Sat, Nov 18 2017 2:07 AM | Last Updated on Sat, Nov 18 2017 3:25 AM

New Emergency Number Services from across the country from January 1 - Sakshi - Sakshi

సైదాబాద్‌కు చెందిన 16 ఏళ్ల కీర్తన టెన్త్‌ చదువుతోంది. తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుండటంతో తల్లి ఫోన్‌ నుంచి 112కు డయల్‌ చేసింది. ఫోన్‌ చేసిన మూడు నిమిషాల్లోనే పోలీసులు రంగప్రవేశం చేశారు. మైనర్‌కు పెళ్లి చేయడం నేరమంటూ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో బాల్యవివాహం బారి నుంచి కీర్తన గట్టెక్కింది.

కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌లోని సప్తగిరి కాలనీ.. రాత్రి 9 గంటలు కావస్తోంది. ఆఫీస్‌ నుంచి కాస్త లేటుగా ఇంటికి వస్తున్న కావ్యను దారిలో మందుబాబులు ఏడిపించ సాగారు. దీంతో కావ్య 112కు కాల్‌ చేసింది. తాగుబోతుల వెక్కిరింతలను పసిగట్టిన 112 సిబ్బంది.. కాలర్‌ లొకేషన్‌ గుర్తించి పెట్రోలింగ్‌ను అప్రమత్తం చేశారు. 7 నిమిషాల్లో కావ్య ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకొని ఆకతాయిలను స్టేషన్‌కు తరలించారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతి రోజూ 1.2 లక్షల మంది బాధితులు నేరుగా ఇంటిగ్రేటెడ్‌ ఎమర్జెన్సీ డయల్‌ 112 సేవలను అత్యవసర సమయాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్‌ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. 911, 000లాగా వివిధ దేశాల్లో ఉన్నట్లుగా అన్ని అత్యవసర సర్వీసులకు ఒకే నంబర్‌కు డయల్‌ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. రాష్ట్రంలో ఇప్పటికే డయల్‌ 100 (పోలీస్‌), 101 (ఫైర్‌ సర్వీసెస్‌), 108 (అంబులెన్స్‌) నంబర్ల ద్వారా అత్యవసర సర్వీసులు అందుతున్నా జనవరి ఒకటో తేదీ నుంచి ఈ నంబర్లలో దేనికి కాల్‌ చేసినా అది ఆటోమెటిక్‌గా డయల్‌ 112కు డైవర్ట్‌ అవుతోంది. కాల్‌ అందుకునే రిసీవర్‌...వెంటనే సంబంధిత విభాగాన్ని క్షణాల్లో అలర్ట్‌ చేస్తున్నారు.

లేటెస్ట్‌ మొబైల్స్‌లో ఎమర్జెన్సీగా...: ప్రస్తుతం జీవీకే సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఈఎంఆర్‌ఐ) కాల్‌ సెంటర్‌ ద్వారా అత్యవసర సేవలను పర్యవేక్షిస్తున్నారు. అయితే నిత్యం వస్తున్న కాల్స్‌లో 40 శాతం వరకు బ్లాంక్‌ కాల్స్‌ ఉంటున్నాయని, తాజా స్మార్ట్‌ఫోన్స్‌లో లాక్‌ బటన్‌ను గట్టిగా నొక్కుతున్నప్పుడు ఆటోమెటిక్‌గా 112కు ఎమర్జెన్సీ కాల్‌ కలుస్తున్నట్లు ఈఎంఆర్‌ఐ, పోలీస్‌శాఖ అధ్యయనంలో తేల్చాయి. గతంలో ప్రతి సర్వీస్‌ ఆపరేటర్, మొబైల్‌ సంస్థలు ఎమర్జెన్సీ, పోలీస్, అంబులెన్స్‌ సర్వీసు పేరుతో డయల్‌ 100, 101, 108 నంబర్లను పీడ్‌ చేసి పెట్టేవని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

మూడు నిమిషాల్లో సర్వీస్‌ డెలివరీ..: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 3 నిమిషాల్లోనే పోలీస్‌ సర్వీస్‌ డెలివరీ ఉందని, అలాగే రాచకొండలో కొంత ప్రాంతం, సైబరాబాద్‌లో 70 శాతం ప్రాంతం 3 నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్నారని ఈఎంఆర్‌ఐ సర్వేలో తేలింది. మిగతా ప్రాంతాల్లో 5 నుంచి 7 నిమిషాల్లో పోలీసులు బాధితుల చెంతకు చేరుతున్నట్లు శాంపిల్‌ సర్వేలో వెల్లడైంది. జిల్లాల్లోని అర్బన్‌ ప్రాంతాల్లో సర్వీస్‌ డెలివరీ 7 నుంచి 8 నిమిషాలు పడుతోందని, మారుమూల ప్రాంతాల్లో మాత్రం 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతున్నట్లు ఈఎంఆర్‌ఐలో డయల్‌ 112ను పర్యవేక్షించే పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

జిల్లాలపై డీజీపీ ప్రత్యేక దృష్టి...: హైదరాబాద్‌ కమిషనరేట్‌ తరహాలో జిల్లాల్లోనూ పోలీసు సర్వీస్‌ డెలివరీ వీలైనంత వేగంగా ఉండేలా చూడటంపై డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈఎంఆర్‌ఐ చేసిన సర్వే ఆధారం గా జిల్లాల్లో పెట్రోలింగ్‌ విస్తృతం చేయడం, వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్ధ అనుసంధానం, జియో ట్యాగింగ్‌ ద్వారా ప్రజలకు పోలీస్‌ సర్వీస్‌ డెలివరీ సమయాన్ని వీలైనంత తగ్గించేలా కార్యచరణ రూపొందించనున్నారు.

94 శాతం సంతృప్తి: రాష్ట్రంలో పోలీస్‌ సేవలపై ఈఎంఆర్‌ ద్వారా ఉన్నతాధికారులు శాంపిల్‌ సర్వే చేయించారు. నిత్యం వచ్చే దాదాపు లక్ష కాల్స్‌లో పది శాతం అంటే 10 వేల మంది బాధితుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. ఐదు అంశాలతో కూడిన ప్రశ్నలపై సమాధానాలు సేకరించి నివేదిక సమర్పించారు. దీని ప్రకారం 94 శాతం మంది బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. భార్యాభర్తల కేసుల పరిష్కారం, ప్రాపర్టీ అఫెన్స్‌ కేసుల్లో మిగిలిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement