కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు | Los Angeles Wildfire State of Emergency Declared as 5 Dead in California | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు

Published Thu, Jan 9 2025 10:40 AM | Last Updated on Thu, Jan 9 2025 11:36 AM

Los Angeles Wildfire State of Emergency Declared as 5 Dead in California

లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌, కాలిఫోర్నియాలలోని అడవుల్లో కార్చిచ్చు చల్లారడంలేదు. ఈ కార్చిచ్చుకు  ప్రభావితమైన పదివేల మందిలో నటులు, సంగీతకారులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. పాలిసాడ్స్, ఈటన్ తదితర ప్రాంతాల్లో గాలి వేగం చాలా ఎక్కువగా ఉండటంతో అటవీ మంటలు అదుపులోనికి  రావడంలేదు. గడచిన 24 గంటల్లో లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలోని గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతాల నుండి 70 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇళ్లను విడిచిపెట్టిన పదివేల మంది 
పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కాలిఫోర్నియా(California) ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించారు.అలాగే అనుభవం ఉన్న రిటైర్డ్ అగ్నిమాపక సిబ్బందిని సహాయం కోసం పిలిపించారు.  కాలిఫోర్నియా నగరం చుట్టూ చెలరేగిన మంటల కారణంగా వెయ్యికిపైగా భవనాలు కాలిబూడిదయ్యాయి. పదివేల మంది తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అటవీ మంటల నుంచి వెలువడుతున్న పొగ ఆకాశాన్నంతా కమ్మేసింది. పరిస్థితిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.

వందల మీటర్ల మేర ఎగిరిపడుతున్న నిప్పురవ్వలు
హాలీవుడ్ ప్రముఖులు అమితంగా ఇష్టపడే కాలిఫోర్నియాలోని రియల్ ఎస్టేట్‌ నేలమట్టమయ్యింది. బలమైన గాలులు మంటలను  మరింతగా వ్యాపింపజేశాయి. వందల మీటర్ల మేరకు నిప్పురవ్వలు ఎగిరి పడుతున్నాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ ఆంథోనీ మర్రోన్ తెలిపిన వివరాల ప్రకారం మంటలు విస్తరిస్తున్న తీరు అగ్నిమాపక సిబ్బంది(Firefighters)కే ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినప్పటికీ సిబ్బంది ఏమాత్రం వెనక్కి తగ్గక అగ్నికీలలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.

చుట్టుపక్కల ప్రాంతాలకు అగ్నికీలలు
పసిఫిక్ పాలిసాడ్స్‌లో చెలరేగిన మంటలు బుధవారం మధ్యాహ్నం నాటికి దాదాపు 16 వేల ఎకరాలను దగ్ధం చేశాయి. వెయ్యి ఇళ్లు , వ్యాపార స్థలాలు నాశనమయ్యాయి. నగరానికి ఉత్తరాన ఉన్న అల్టాడెనా సమీపంలోని 10,600 ఎకరాల అడవులు తగలబడిపోతున్నాయి. ఈ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా మీడియాతో మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదాల్లో  తొలుత ఇద్దరు మరణించారని, మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

సురక్షిత ప్రాంతాలకు నటులు
హాలీవుడ్ ఈవెంట్లలో నిత్యం కళకళలాడే లాస్‌ ఏంజిల్స్‌(Los Angeles) లో పమేలా ఆండర్సన్ సినిమా ప్రీమియర్‌తో పాటు పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. ప్రముఖ గాయని, నటి మాండీ మూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో చాట్‌ చేస్తూ అల్టాడెనాలో వ్యాపిస్తున్న మంటలను చూసి తాను తన పిల్లలు, పెంపుడు జంతువులతో పాటు సురక్షిత ‍ప్రాంతానికి తరలివెళ్లానని తెలిపారు.  ఎమ్మీ విజేత, నటుడు జేమ్స్ వుడ్స్ తన ఇంటి సమీపంలోని చెట్లు దహనవడాన్ని సోషల్‌ మీడియాలో వీడియో ద్వారా చూపించారు. తాను తన ఇంటిని ఖాళీ చేశానని తెలిపారు.

ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణ వాయిదా
‘స్టార్ వార్స్’ స్టార్ మార్క్ హామిల్ తన ఇంటిని మంటలు చుట్టుముట్టే పరిస్థితులు ఉండటంతో తన భార్య, పెంపుడు కుక్కతోపాటు సురక్షిత ప్రాంతానికి వెళ్లానని తెలిపారు. ఆస్కార్ విజేత జామీ లీ కర్టిస్ కూడా అయిష్టంగా తన ఇంటిని ఖాళీ చేయవలసి వచ్చింది. కాగా అగ్నిప్రమాదాల బారిన పడిన అకాడమీ సభ్యులు తమ బ్యాలెట్లను వేయడానికి మరింత సమయం ఇచ్చారు. ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణను జనవరి 19కి వాయిదా వేశారు.

ఇది కూడా చదవండి: దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement