సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ ట్రైనీ కేవీ మహేశ్వర్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేశారో బుధవారం తెలియజేయాలని కేంద్ర హోం శాఖను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశించింది. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని పేర్కొంటూ మహేశ్వర్‌రెడ్డి క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ కేసును మంగళవారం క్యాట్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్ బీవీ సుధాకర్ విచారించి హోం శాఖకు నోటీసులు జారీ చేశారు. అఖిల భారత సర్వీస్ రూల్స్ (డీఅండ్‌ఏ)–1969 ప్రకారం సస్పెండ్ చేయడానికి వీల్లేదని, కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని మహేశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు.
ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్ శిక్షణ పూర్తి చేశారని, పోస్టింగ్ అందుకోవాల్సిన దశలో నిరాధార ఆరోపణల ఆధారంగా ఆయనను సస్పెండ్ చేశారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఓ క్రిమినల్ కేసు పెండింగ్ ఉందని చెప్పి సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడానికి వీల్లేదని, అలాంటి కేసుల్లో 48 గంటల పాటు రిమాండ్‌లో ఉన్నప్పుడు మాత్రమే సస్పెండ్ చేయొచ్చని చట్టంలో ఉందన్నారు. భువన అనే యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మహేశ్వర్‌రెడ్డి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment