న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జెడ్–ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు గురువారం కేంద్ర హోం శాఖ ఆదేశాలిచ్చింది. ఆయన భద్రతకు ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారి వివరించారు. దేశంలో ఆయన ఎక్కడికెళ్లినా సీఆర్‌పీఎఫ్ జవాన్లు వెన్నంటి ఉంటారు. రానున్న ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే దేశవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది.
అందుకే ఆయనకు భద్రతను పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇకపై ఆయనకు 24 గంటలపాటూ మూడు షిఫ్టుల్లో 30 మంది సీఆర్‌పీఎఫ్ కమాండోలు రక్షణ కల్పిస్తారు. దీంతోపాటు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, పైలట్, ఎస్కార్టు సమకూరుస్తారు. ప్రధాని మోదీకి అత్యంత కట్టుదిట్టమైన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రత ఉంది. దేశంలో అధిక ముప్పు ఉన్న వారికి అందించేదే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత. ఆ తర్వాత ఎక్స్, వై కేటగిరీలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment