![Kishan Reddy Comments On Modi Govt - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/2/ddd.jpg.webp?itok=j3hluDFL)
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కిషన్‌రెడ్డి
రాయదుర్గం: ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం భారతదేశం వైపు చూస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో ‘ఐడియాస్ ఫర్ ఇండియా–2020’పాలసీ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ఉదయం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోందని, అందుకు ప్రధాని నరేంద్రమోదీ విధానాలే కారణమన్నారు.
ప్రపంచంలోనే బలమైన ఆర్థికశక్తిగా భారత్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వచ్చే రోజుల్లో భారత్ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమన్నారు. జీఎస్‌టీ, నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, నీతిఆయోగ్ ఏర్పాటు వంటి సాహసోపేత నిర్ణయాల అమలు ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు, అన్ని రంగాల్లో ముందంజ వేసేందుకు యువకులు, విద్యార్థులు, మేధావులు సూచనలు చేయాలన్నారు. దేశంలోకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలసలు పెరిగిపోయాయని, అందుకోసమే సీఏఏ చట్టాన్ని రూపొందించారని, కొందరు దీన్ని వక్రీకరిస్తూ అపోహలు సృష్టిస్తున్నారన్నారు.
సోషల్ మీడియా బాధ్యతగా ఉండాలి
సోషల్ మీడియా బాధ్యతతో వ్యవహరించాలని కిషన్‌రెడ్డి సూచించారు. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు, కొన్ని రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ధోరణే ఢిల్లీ అల్లర్లకు కారణమన్నారు. అల్లర్లకు కారణమైనవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో ఐఎస్‌బీ డిప్యూటీ డీన్ సంజయ్‌కల్లాపూర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సస్టెయినబుల్ పాలసీ మేకింగ్ ఫర్ ది కంట్రీస్ గ్రోత్, రెస్పాన్సిబుల్ మీడియా, ఫిల్మ్ మేకింగ్ అండ్ సెన్సార్‌షిప్, యూత్ ఇన్ పాలిటిక్స్, మోటివేటింగ్ దెమ్ టు కాంటెస్ట్ ఎలక్షన్స్, సివిల్ సర్వీస్ పాలసీ రిఫార్మ్స్ ఫర్ ది 21ఫస్ట్ సెంచురీ అనే అంశాలపై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్స్‌లో ఎంపీలు, పోలీసు ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొని అభిప్రాయాలను వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment