సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై లాన్సెట్ సంచలన హెచ్చరికలు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వసానుకూల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శాస్త్రీయ ఆధారాల నుంచి పక్కకుపోతోందని లాన్సెట్ మెడికల్ జర్నల్ సంపాదకీయంలో పేర్కొంది. ఫలితంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు అందడమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వారిని నిరోధిస్తుందని, ఇది మరింత సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించింది. శాస్త్రీయ ఆధారాలనుంచి తప్పుకోవడంతోపాటు రాజకీయంగా ప్రేరేపితమైన ధోరణిగా వ్యాఖ్యనించడం గమనార్హం.
దేశంలో మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వం చాలా పాజిటివ్ ధోరణితో ఉందని ఆరోపించింది. పెరుగుతున్న కరోనా సంక్షోభం మధ్య వాస్తవాలను దాచి, ప్రజల్లో తప్పుడు ఆశలను కల్పించవద్దని దేశ నాయకులకు పిలుపునిచ్చింది. అసలు నిజాలు చెప్పకుండా, కప్పివుంచడం అంటే ఆరోగ్య సంక్షోభాన్ని తీవ్రంగా పరిగణించకుండా ప్రజలను నిరోధించcడమేనని వ్యాఖ్యానించింది. నివారణ చర్యల పట్ల ప్రజల్లో అనిశ్చితికి దారి తీయడమే కాకుండా, ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని లాన్సెట్ పేర్కొంది. ఆశావాదాన్ని ప్రోత్సహించే ఒత్తిడికి దేశ శాస్త్రీయ సంస్థలు కూడా ప్రభావితమయ్యాయని తెలిపింది. మహమ్మారి ప్రారంభం తగిన సాక్ష్యాలు లేనప్పటికీ యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ న్వాడకంపై ఐసీఎంఆర్ పాత్రను ప్రశ్నించింది.అలాగే స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ టీకాను ఆగస్టు 15లోగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్న ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ప్రకటనను కూడా తప్పుబట్టింది. ఇది వివాదాస్పదంగా ఉందని సంపాదకీయం పేర్కొంది.
ఇతర దేశాల కంటే తక్కువ మరణాల రేటు ఉందని భారత ప్రభుత్వం వాదించడాన్ని లాన్సెట్ సవాలు చేసింది. కేసులు,మరణాల డేటా పారదర్శకతను తప్పుబట్టింది ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో మరణాల రేటు 1.8 శాతంగా నివేదించినా, ఈ సంఖ్యలు పోల్చదగినవా కావా అని తెలుసుకోవడం కష్టంగా ఉందంటూ సందేహాలను వ్యక్తం చేసింది. మహమ్మారిని నిలువరించే సామర్థ్యం భారతదేశానికి ఉందనీ, కానీ నాయకులు శాస్త్రీయ ఆధారాలను, నిపుణుల సలహాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని తెలిపింది. వైద్యం, మందులు, ప్రజారోగ్యం, పరిశోధన, తయారీలో తగినంత నైపుణ్యం ఉందని పేర్కొంది. తప్పుడు ఆశావాదాన్ని ప్రజలకు అందించకుండా వీటన్నింటిని ఉపయోగించాలని, గౌరవించాలని హితవు పలికింది. అయితే కరోనా నిర్వహణకు సంబంధించి కొన్ని అంశాలపై ప్రభుత్వం స్పందించిన తీరును ప్రశంసించింది.
Comments
Please login to add a commentAdd a comment