రెండో డోసు తీసుకోకపోతే...! | Special Story About Covid 19 Vaccine Second Dose | Sakshi
Sakshi News home page

రెండో డోసు తీసుకోకపోతే...!

Published Sat, Jul 10 2021 1:56 AM | Last Updated on Sat, Jul 10 2021 1:55 PM

Special Story About Covid 19 Vaccine Second Dose - Sakshi

గడువు దాటినా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ రెండో డోసు ఇంకా మీరు తీసుకోలేదా ? వ్యాక్సిన్‌ తీసుకోవడానికి మీన మేషాలు లెక్కిస్తున్నారా ? లేదంటే టీకా డోసులే దొరకడం లేదా ? కారణం ఏదైనా సెకండ్‌ డోసు మిస్సయితే ఏం జరుగుతుంది? అమెరికా నుంచి అండమాన్‌ వరకు సెకండ్‌ డోసు వేసుకోవడానికి ఎందుకు సంకోచం?   

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటానికి వ్యాక్సినే బ్రహ్మాస్త్రం. ఈ విషయాన్ని ఎందరో నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నప్పటికీ వ్యాక్సిన్‌పై అపోహలు ఇంకా తొలగిపోవడం లేదు. అమెరికా నుంచి భారత్‌ వరకు ఎన్నో దేశాల్లో రెండో డోసు తీసుకోవడానికి ప్రజలు విముఖత ప్రదర్శిస్తున్నారు. అమెరికాలో ఫైజర్, మోడర్నా టీకాలు అందుబాటులో ఉంటే మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే మొదటి టీకా డోసు తీసుకున్నప్పుడున్న ఉత్సాహం రెండో డోసు తీసుకోవడంలో కనిపించడం లేదు.  

మిస్సయితే ఏం జరుగుతుంది ?  
కోవిడ్‌–19 రెండో డోసు ప్రాధాన్యతపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు వెలువడ్డాయి. ఎందరో నిపుణులు తమ అభిప్రాయాలను వివిధ వేదికలపై పంచుకున్నారు. భారత్‌లో లభించే కరోనా టీకాల్లో ఒక డోసు తీసుకుంటే 30% మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయి. మిగిలిన 70 శాతం మందికి అది కేవలం బూస్టర్‌ డోసుగానే ఉపయోగపడిందని ఐసీఎంఆర్‌ మాజీ చీఫ్, ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ జాకబ్‌ జాన్‌ చెప్పారు.

ఒక్కటే డోసు తీసుకుంటే మళ్లీ కోవిడ్‌ సోకే అవకాశాలుంటాయని ఆయన హెచ్చరించారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత మన శరీరం కరోనాపై పోరాటానికి ప్రాథమికంగా సిద్ధమవుతుంది. రెండో డోసు తీసుకున్నాక నిరోధకత మరింత బలోపేతమై మెమొరీ–బి కణాలు ఉత్పన్నమవుతాయి. వైరస్‌ వివరాలను ఈ కణాలు నమోదు చేసుకొని భవిష్యత్తులో ఇదే వైరస్‌ మన శరీరంపై దాడి చేస్తే, వాటిని గుర్తించి యాంటీబాడీలను ఉత్పత్తి చేసి యుద్ధం ప్రకటిస్తాయి. రెండో డోసు తర్వాతే పూర్తి స్థాయిలో యాంటీబాడీలు చేరి కరోనా నుంచి రక్షణ లభిస్తుందని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా వెల్లడించారు.  

ఆ అధ్యయనం చెప్పిందేమిటంటే
కోవిడ్‌–19 రెండు డోసులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అమెరికాలోని యేల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. మొత్తంగా 91,134 మంది కరోనా రోగుల్ని డిసెంబర్‌–ఏప్రిల్‌ వరకు వారిని పరీక్షించారు. ఆ రోగుల్లో అత్యధికులు వ్యాక్సిన్‌ తీసుకోలేదు. ఆ కరోనా రోగుల్లో 4.5% మందిలో స్వల్పంగా యాంటీబాడీలు ఉత్పత్తయితే, 25.4 శాతం మంది పూర్తి స్థాయిలో యాంటీ బాడీలు చేరాయి. ఈ రోగుల్లో 225 మంది మరణిస్తే వారిలో వ్యాక్సిన్‌ తీసుకోని వారు 219 (97%) మంది కావడం గమనార్హం. మరో అయిదుగురు పాక్షికంగా నిరోధకత కలిగిన వారు కాగా, మృతుల్లో కేవలం ఒకే ఒక్కరు పూర్తి స్థాయి యాంటీబాడీలు వచ్చిన వ్యక్తి కూడా ఉన్నాడు. అదే అధ్యయనంలో తేలిన అంశాలేమిటంటే...

► రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో 96% మందికి ఆస్పత్రి అవసరం రాదు
► రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకుంటే 98.7% మంది మృత్యు ఒడికి చేరుకోరు
► ఒక్క డోసు వ్యాక్సిన్‌ తీసుకుంటే 77% మందికి మాత్రమే ఆస్పత్రిలో చేరే అవసరం రాదు
► ఒక్క డోసు తీసుకుంటే 64% మంది ప్రాణాలకే భద్రత ఉంటుంది.    


ఎందుకీ సంకోచం ?  
కోవిడ్‌–19 సెకండ్‌ డోసు తీసుకోకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ముందు వెనుక ఆలోచించడానికి  ఎన్నో కారణాలున్నాయి. వీటిలో ప్రభుత్వ వైఫల్యాలు కొన్నయితే, ప్రజల్లో అవగాహనా లేమి మరి కొంత కారణమవుతోంది.

టీకా కొరత, మొదటి డోసు తీసుకున్న సమయంలో వచ్చిన సైడ్‌ ఎఫెక్ట్‌లు, రెండో డోసు తీసుకుంటే మరింత ఎక్కువ అవుతాయనే అపోహ, భారత్‌ వంటి దేశాల్లో  నిరక్షరాస్యుల్లో టీకా అంటే ఒక్కటే డోసు అన్న భావన తరతరాలుగా నెలకొని ఉండడం  వంటివెన్నో సెకండ్‌ డోసు తీసుకోకపోవడానికి కారణాలుగా నిలుస్తున్నాయని  ది న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసన్‌ తన తాజా సంచికలో వెల్లడించింది. ఇక అమెరికాలో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్‌లు మొదటి డోసుతోనే 80% రక్షణ కల్పిస్తే, రెండో డోసు తర్వాత 90శాతానికి పైగా రక్షణ ఉంటుంది. ఈ వ్యత్యాసం తక్కువగా ఉండడంతో రెండో డోసు అవసరం లేదన్న అభిప్రాయం అత్యధికుల్లో నెలకొంది.  

కోవిడ్‌–19 టీకా మొదటి డోసు తీసుకున్న 70%మందిలో కరోనా పోరాటానికి శరీరం సిద్ధమవుతుంది. రెండో డోసు తీసుకుంటేనే వారిలో యాంటీబాడీలు ఉత్పన్నమవుతాయి. అదే ఏడాది పాటు రెండో డోసు తీసుకోకుండా ఉంటే, దానిని పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా మళ్లీ రెండు డోసులు తీసుకోవాలి. అప్పుడే కరోనా నుంచి రక్షణ కలుగుతుంది’’     
– డాక్టర్‌ జాకబ్‌ జాన్, వైరాలజిస్టు 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement