న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గురు వారం తాజాగా రికార్డు స్థాయిలో 83,883 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,53,406కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,043 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 67,376కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 6 రోజుల నుంచి దేశంలో వరుసగా రోజుకు 60 వేలకు పైగా కోలుకుంటున్నారని తెలిపింది.
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 29,70,492కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,15,538గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 21.16 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. మంగళవారానికి ఇది 77.09 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.75 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 1 వరకు 4,55,09,380 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మంగళవారం మరో 11,72,179 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.
ఇప్పటి వరకూ 24 గంటల్లో నిర్వహించిన అత్యధిక పరీక్షలు ఇవే కావడం గమనార్హం. తాజా 1,043 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 292 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో మొత్తం 1,623 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దేశంలో ప్రతి పది లక్షల మందికి 31వేలకు పైగా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. కోవిడ్ మరణాల్లో 51 శాతం మంది 60కి పైగా వయసు ఉన్నవారని చెప్పింది. కోవిడ్–19 మరణాల్లో 69 శాతం మంది పురుషులే ఉన్నారని గురువారం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment