సాక్షి, అమరావతి: వేగంగా వ్యాప్తిచెందుతున్న కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌పై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శ కాలను తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. కోవిడ్ వల్ల మరణించినవారి కుటుంబాలకు పరిహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున, తా ము జోక్యం చేసుకోబోమని చెప్పింది. మాస్క్‌లు ధరించని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాస్క్ విషయంలో ఉల్లంఘనలు ఎన్ని? ఎంతమేర జరిమానాలు వసూలు చేశారు? తదితర వివరాలను తమ ముందుం చాలని ఆదేశించింది.
ఐసీఎంఆర్ వివరాలను పరిశీలించిన తర్వాత కోవిడ్ విషయంలో తగిన ఆదేశాలు జారీచేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల్లో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ), సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఒమిక్రాన్ ఉధృతి ఎక్కువగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన సంఖ్యలో పరీక్షలు నిర్వహించడంలేదన్నారు. 39 వేల పరీక్షలు నిర్వహిస్తే, అందులో 14 వేలు పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మూడో దశలో ప్రజలే పరీక్షలు చేయించుకోవడం లేదని చెప్పింది.
ఐసీఎంఆర్ సైతం పరీక్షలు వద్దని, లక్షణాలు ఉంటేనే చేయించుకోవాలని చెప్పిందని గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ.. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపిందని, వాటి ప్రకారం దేశంలో కోవిడ్ పరీక్షలు తగ్గాయన్నారు. ప్రజలు ఇంటి వద్దే పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిపారు. «ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు మా ముందుంచండి
Published Tue, Jan 25 2022 4:29 AM | Last Updated on Tue, Jan 25 2022 8:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment