సాక్షి, హైదరాబాద్: వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకే అవకాశం ఉంటుందని, అయితే వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం అతితక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) వెల్లడించింది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో మాత్రం సమస్యలు తలెత్తి, ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చే అవకాశముందని హెచ్చరించింది. చాలా మంది వ్యాక్సిన్ వేసుకున్నామన్న ఉద్దేశంతో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కరోనా సోకుతోందని పేర్కొంది. కోవిడ్ టీకాలు తీసుకున్న తర్వాత వైరస్ సోకిన వారిపై ఐసీఎంఆర్ ఇటీవల అధ్యయనం చేసింది.
మార్చి నుంచి జూన్ మధ్య దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో వెయ్యి మంది పేషెంట్ల పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించింది. ఈ వివరాలతో రూపొందించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. టీకా వేసుకున్న తర్వాత కరోనా ఇన్ఫెక్షన్ సోకినా.. చాలా మందిలో పెద్దగా అనారోగ్య సమస్యలేవీ తలెత్తలేదని తెలిపింది. కేవలం సాధారణ లక్షణాలైన జలుబు, జ్వరం, దగ్గు వంటివే కనిపించాయని.. మామూలు మందులతోనే ఈ లక్షణాలు తగ్గిపోయాయని వెల్లడించింది.
ప్రాణాపాయం తగ్గింది..
వ్యాక్సిన్ వేసుకున్న వారిలో రిస్క్ రేటు బాగా తక్కువగా ఉంటోందని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇలాంటివారికి కరోనా సోకినా.. 99.5శాతం మంది సురక్షితంగా బయటపడుతున్నారని, 0.5 శాతం మందికి మాత్రమే ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతోందని తెలిపింది.
►వ్యాక్సిన్ తీసుకున్నవారికి సగటున 39 రోజుల తర్వాత కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్టు ఐసీఎంఆర్ పేర్కొంది. 70 శాతం మందిలో లక్షణాలు కనిపించకపోగా, మిగతావారిలో సాధారణంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు వస్తున్నాయని వివరించింది.
►తాము పరిశీలించిన బాధితుల్లో 85 శాతం మందికి డెల్టా (బి.1.617) వేరియంట్ సోకినట్టుగా గుర్తించామని పేర్కొంది.
►వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా బారినపడ్డ వారిలో 22 శాతం మంది ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వస్తోందని.. అయితే వీరిలో చాలావరకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారేనని పేర్కొంది. 78 శాతం హోం ఐసోలేషన్, సాధారణ మందులతోనే రికవరీ అవుతున్నారని తెలిపింది.
►దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో 43 శాతం మంది ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని పేర్కొంది. అందువల్ల వారు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటివి తప్పనిసరిగా పాటించాలని.. వీలైనంత జన సమూహాలున్న చోటికి వెళ్లకుండా ఉండాలని స్పష్టం చేసింది.
►ఛత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్టు వెల్లడించింది.
వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి
కోవిడ్ నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి. ప్రపంచవ్యాప్తంగా చేసిన వివిధ పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇన్పెక్షన్ రావచ్చు. కానీ అనారోగ్యానికి గురై మరణించే అవకాశాలు తక్కువ. దీర్ఘకాలిక జబ్బులున్న వారు జాగ్రత్తగా ఉండడం మంచిది.
-కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment