పిల్లలకూ కరోనా వ్యాక్సిన్‌ సిద్ధం.. ఎలా పనిచేస్తుంది?  | Zydus Cadila to test Covid19 Vaccine For 12 to 18 Years Age Group | Sakshi
Sakshi News home page

పిల్లలకూ కరోనా వ్యాక్సిన్‌ సిద్ధం!

Published Sat, Aug 21 2021 3:21 AM | Last Updated on Sat, Aug 21 2021 9:18 AM

Zydus Cadila to test Covid19 Vaccine For 12 to 18 Years Age Group - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మూడు డోసుల టీకా.. 
ఇప్పటివరకు ఉన్న అన్ని టీకాలు రెండు డోసులు ఇస్తుండగా.. జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ మూడు డోసులు ఉంటుంది. మొదటిరోజుతోపాటు 28వ రోజున, 56వ రోజున ఈ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. 

సూదిలేని మందు..
ప్రస్తుతమున్న కరోనా టీకాలన్నీ ఇంట్రామస్క్యులర్‌ (కండరాల లోపల ఇచ్చేవి) కాగా.. జైకోవ్‌–డి టీకాను ఇంట్రాడెర్మల్‌ (చర్మానికి, కండరాలకు మధ్య) రూపంలో ఇస్తారు. దీనిలో సూది ఉండదు. ఫార్మాజెట్‌గా పిలిచే ప్రత్యేక ఇంజెక్టర్‌ను వాడుతారు.

ఎలా పనిచేస్తుంది? 
జైకోవ్‌–డి టీకాను డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ విధానంలో అభివృద్ధి చేశారు. ఈ టీకా తీసుకున్నవారిలో అచ్చంగా కరోనా వైరస్‌పై ఉండే స్పైక్‌ ప్రొటీన్ల వంటి ప్రొటీన్‌ ఉత్పత్తి అవుతుంది. మన రోగ నిరోధక వ్యవస్థ దానిని వైరస్‌గా భావించి.. తగిన యాంటీబాడీలను విడుదల చేస్తుంది. ఈ యాంటీబాడీలు శరీరంలో అలాగే ఉండిపోతాయి. తర్వాత ఎప్పుడైనా కరోనా వైరస్‌ ఆ వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తే.. వెంటనే అడ్డుకుంటాయి.  

కొత్త వేరియెంట్లకు తగ్గట్టు  
డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ టెక్నాలజీతో రూపొందించిన టీకాల్లో మార్పులు చేయడం సులభమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనాలో ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు వస్తే.. దానికి తగినట్టుగా వెంటనే వ్యాక్సిన్‌లో మార్పులు చేసి వినియోగించవచ్చని అంటున్నారు.

న్యూఢిల్లీ: పన్నెండేళ్లు దాటిన పిల్లలకూ ఇవ్వగలిగిన సరికొత్త కరోనా టీకా సిద్ధమైంది. పిల్లలతోపాటు పెద్దవారిలోనూ ప్రభావవంతంగా పనిచేసే ‘జైకోవ్‌–డి’ టీకా త్వరలోనే మార్కెట్లోకి రానుంది. గుజరాత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన ఈ టీకా అత్యవసర వాడకానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం అనుమతి ఇచ్చింది. అత్యంత ఆధునికమైన డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ టెక్నాలజీతో ఈ టీకాను రూపొందించారు. ఈ తరహా వ్యాక్సిన్లలో ప్రపంచంలోనే ఇదే మొదటిది. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన రెండో కరోనా వ్యాక్సిన్‌ కూడా ఇదే. కాగా జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ను అనుమతిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో దేశం మరో ముందడుగు వేసిందని, శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారని అభినందించారు. 

డీబీటీ, ఐసీఎంఆర్‌ సహకారంతో..: ‘మిషన్‌ కోవిడ్‌ సురక్ష’ కార్యక్రమంలో భాగంగా.. జాతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), కేంద్ర బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ)ల సహకారంతో జైడస్‌ క్యాడిలా సంస్థ ‘జైకోవ్‌–డి’ వ్యాక్సిన్‌ను అభి వృద్ధి చేసింది. తొలిరెండు దశల్లో సంతృప్తికర ఫలితాలు రావడంతో.. దేశవ్యాప్తంగా 28వేల మందిపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఈ డేటాను పరిశీలించిన నిపుణుల కమిటీ.. అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వొచ్చని డీసీజీఐకి సిఫార్సు చేసింది. డీసీజీఐ శుక్రవారం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు వివరాలతో డీబీటీ ప్రకటన విడుదల చేసింది. జైకోవ్‌–డి టీకా అన్నిరకాల కరోనా వేరియంట్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని తెలిపింది. 

రెండు నెలల్లో మార్కెట్లోకి..: జైకోవ్‌–డి టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం గత నెల ఒకటిన దరఖాస్తు చేసుకున్నట్టు జైడస్‌ క్యాడిలా సంస్థ వెల్లడించింది. పెద్దల్లోనే కాకుండా 12 –18 ఏళ్లవారికి కూడా తమ టీకా సురక్షితమని ప్రకటించింది. అనుమతులు వచ్చాక రెండు నెలల్లోనే టీకాను మార్కెట్లోకి తెచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిపింది. ఏటా 24 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ ఎండీ షర్విల్‌ పటేల్‌ వెల్లడించారు. 

దేశంలో ఆరో టీకా..: దేశంలో ఇప్పటివరకు సీరం ఇనిస్టిట్యూట్‌–ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన కోవి షీల్డ్, భారత్‌ బయోటెక్‌ సంస్థకు చెందిన కోవాగ్జిన్, రష్యా తయారీ స్పుత్నిక్‌–వి, అమెరికాకు చెందిన మొడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లకు అనుమతి ఉంది. తాజాగా అందుబాటులోకి వస్తున్న జైకోవ్‌–డి టీకా ఆరోది కానుంది. 

అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్స్‌తో.. 
జైకోవ్‌–డి ప్రపంచంలోనే తొలి ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ వ్యాక్సిన్‌. పూర్తిగా మన దేశంలోనే అభివృద్ధి చేసి, అందుబాటులోకి వస్తున్న రెండో వ్యాక్సిన్‌. ఒకవేళ కరోనా సోకితే.. సాధారణ లక్షణాలు మాత్రమే కనిపించే వారి విషయంలో తమ టీకా 100% ప్రభావవంతంగా పనిచేస్తుందని జైడస్‌ క్యాడిలా కంపెనీ ప్రకటించింది. అదే లక్షణాలు ఎక్కువగా వచ్చే అవకాశమున్న వారిలో 66.6% మేర పనితీరు చూపుతుందని వెల్లడించింది. 50కిపైగా కేంద్రాల్లో 28వేల మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపారు. దేశంలో చేపట్టిన కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఇదే అతిపెద్దది. 

డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ టీకా అంటే? 
వ్యాక్సిన్లకు సంబంధించి అత్యంత అధునాతనమైన కొత్త విధానమే డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌ టెక్నాలజీ. కణాల్లో కేంద్రకానికి బయట ఉండే డీఎన్‌ ఏను ప్లాస్మిడ్స్‌ అంటారు. ఈ ప్లాస్మిడ్స్‌ను జన్యుపరంగా మార్పిడి చేసి, టీకా ఉత్పత్తిలో వాడుతారు. టీకా ఇచ్చినప్పుడు జన్యుమార్పిడి ప్లాస్మిడ్లు.. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ(ఇమ్యూనిటీ సిస్టమ్‌)ను ప్రేరేపిస్తాయి. దీంతో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. భవిష్యత్‌లో కరోనా సోకితే.. వెంటనే హతమారుస్తాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement