న్యూఢిల్లీ: భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఏకంగా కోటిదాటింది. కొత్తగా 26,786 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం తెలిపింది. కాగా, రాత్రి 11గంటలకు అదనంగా 25,173 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,04,620కు చేరింది. మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 145,167కు పెరిగింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95,20,827కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.40 శాతానికి చేరింది.
యాక్టివ్ కేసుల సంఖ్య 3,13,831గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 3.14 శాతం ఉన్నాయి. గత 12 రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షలలోపే ఉంటోంది. మరణాల శాతం 1.45గా ఉంది. ఈ నెల 18 వరకూ 15,89,18,646 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం 11,13,406 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని చెప్పింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది.
చికిత్స తీసుకుంటున్న ఐసీఎంఆర్ చీఫ్
భారతీయ వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో కోవిడ్ చికిత్స పొందుతున్నారని అధికారులు శుక్రవారం వెల్లడించారు. కార్డియాలజిస్ట్ అయిన భార్గవ దాదాపు ఏడెనిమిది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అనంతరంకొద్ది రోజులు ఇంట్లోనే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరారని అధికారులు చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని అధికారులు వెల్లడించారు.
ఉత్తరాఖండ్ సీఎంకు కరోనా
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం ట్విట్టర్ లో వెల్లడించా రు. ప్రస్తుతం కరోనా లక్షణాలేమీ లేవని, వైద్యుల సల హా మేరకు ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు వెల్లడించారు.
దావానలంలా కోవిడ్..
కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేయకపోవడంతో కోవిడ్ మహమ్మారి దావానలంలా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు అభి ప్రాయపడింది. కరోనా వైరస్ చికిత్స సైతం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తూ, ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 8 నెలలుగా వైద్యులతో సహా, ఆరోగ్యకార్యకర్తలు, నర్సులు అవిశ్రాంతంగా పనిచేయడంతో శారీరకంగా, మానసికంగా అలసిపోయారని, వారికి విరామాన్నిచ్చే కార్యాచరణ ఏదైనా కావాలని జస్టిస్ ఆర్.ఎస్.రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే, కోవిడ్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక చర్యలను పర్యవేక్షించేందుకు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment