ఇటీవల చాలామంది నాన్‌స్టిక్ పాత్రలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిల్లో అయితే డీప్ ఫ్రైలు చేస్తే ఆయిల్ ఎక్కుపట్టదు. అదీగాక గమ్మున అడుగంటదు, ఈజీగా వంట అయిపోతుందని మహిళలు ఈ పాత్రలకే ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఐతే వీటిని అస్సలు ఉపయోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) గట్టిగా హెచ్చరిస్తోంది. వీటి వినియోగం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదమని తెలిపింది. పైగా ఎలాంటి పాత్రలు వాడితే మంచిదో కూడా సూచనలు ఇచ్చిందో అవేంటో సవివరంగా తెలుసుకుందామా!.
ఎందుకు మంచిది కాదంటే..
నాన్‌స్టిక్ వంటపాత్రలపై చిన్న గీత పడినా దాని మీద ఉన్న టెఫ్లాన్ పైపూత (కోటింగ్)లో నుంచి విష వాయువులు, హానికారక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఒక్క గీత నుంచి కనీసం 9,100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది. గీతలు పడిన నాన్‌స్టిక్ వంటపాత్రలను 170 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది.
కడిగేటప్పుడు నాన్‌స్టిక్ పాత్రలపై బోలెడన్ని గీతలు పడుతుంటాయి. ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. అవి తెలియకుండానే మనం తినే ఆహారంలో కలిసిపోతాయని పేర్కొంది. అందువల్ల వీటిని వినియోగించటం ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వెల్లడించింది.
వచ్చే అనారోగ్య సమస్యలు..
హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది. నాన్ స్టిక్ వంటపాత్రల బదులు మట్టిపాత్రల్లో వండుకోవటం అత్యంత సురక్షితమని తెలిపింది. మరో ప్రత్యామ్నాయంగా గ్రానైట్ పాత్రలను కూడా సూచించింది. అయితే వాటిపై ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొంది. అలాగే ఫుడ్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. ఈ మేరక సీఎంఆర్ భారతీయులకు ఆహార మార్గదర్శకాలు అనే పేరుతో ఈ సూచనలను ఇటీవలే విడుదల చేసింది.
(చదవండి: ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?)
Comments
Please login to add a commentAdd a comment