హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) తమ కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్‌కు సహ యజమానిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)ను చేర్చినట్లు తెలిపింది.
భారత్ బయోటెక్ తమ కొవాగ్జిన్ ఒరిజినల్ పేటెంట్ ఫైలింగ్‌లో ఐసీఎంఆర్‌ను చేర్చకపోవడం వివాదానికి దారితీసింది. అయితే ఈ తప్పిదం అనుకోకుండా జరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బీబీఐఎల్-ఐసీఎంఆర్ అగ్రిమెంట్ కాపీ గోప్యమైన డాక్యుమెంట్ కావడంతో అందుబాటులో లేదని, దీంతో ఐసీఎంఆర్‌ను ఒరిజినల్ అప్లికేషన్ లో చేర్చలేదని వివరణ ఇచ్చింది.
ఈ తప్పిదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, ఐసీఎంఆర్ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని, వివిధ ప్రాజెక్టులపై నిరంతరం సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ పొరపాటును గుర్తించిన వెంటనే, కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం పేటెంట్ దరఖాస్తులకు సహ యజమానిగా ఐసీఎంఆర్‌ను చేర్చడం ద్వారా దానిని సరిదిద్దే ప్రక్రియను బీబీఐఎల్ ఇప్పటికే ప్రారంభించింది. అవసరమైన లీగల్ డాక్యుమెంట్లను సిద్ధం చేస్తున్నామని, అవి సిద్ధమై సంతకం చేసిన వెంటనే పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేస్తామని కంపెనీ పేర్కొంది.
ఐసీఎంఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థ. పుణెలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, భారత్ బయోటెక్ సంయుక్తంగా 2020 ఏప్రిల్‌లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) తర్వాత కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment