హైదరాబాద్: దేశీయ కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ ఉత్పత్తిదారులైన భారత్ బయోటెక్‌తో 2 కోట్ల టీకా డోసుల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని బుధవారం బ్రెజిల్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ఒప్పందంలో అవినీతి సహా పలు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ఇప్పటివరకు అడ్వాన్స్ పేమెంట్ ఏదీ తీసుకోలేదని భారత్ బయోటెక్ తెలిపింది.
ఒప్పందం కుదుర్చుకునే విషయంలో.. తాము విజయవంతంగా టీకా డోసులను సరఫరా చేసిన పలు ఇతర దేశాలతో అనుసరించిన విధానాన్నే బ్రెజిల్‌తోనూ అనుసరించామని పేర్కొంది. దేశ కంప్ట్రోలర్ జనరల్ సిఫారసు మేరకు భారత్ బయోటెక్‌తో కోవాగ్జిన్ టీకా కొనుగోలు ఒప్పందాన్ని జూన్ 29 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బ్రెజిల్ వైద్య శాఖ ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని వైద్య శాఖకు చెందిన ఇంటిగ్రిటీ డైరెక్టరేట్ కూడా సమీక్షించిందని, ఒప్పందానికి సంబంధించిన పరిపాలనపరమైన అంశాలపై విచారణ కొనసాగుతోందని తెలిపింది.
ఈ నిర్ణయంపై భారత్ బయోటెక్ స్పందిస్తూ.. బ్రెజిల్ నుంచి ముందస్తుగా ఎలాంటి చెల్లింపులను తాము స్వీకరించలేదని, అలాగే, బ్రెజిల్‌కు ఇప్పటివరకు టీకాలను కూడా సరఫరా చేయలేదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ప్రెసికా మెడికామెంటోస్’సంస్థ ‘భారత్ బయోటెక్’కు బ్రెజిల్‌లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. బ్రెజిల్‌లో నియంత్రణ అనుమతులు, బీమా, లైసెన్స్, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ తదితర విషయాల్లో ఈ సంస్థ భారత్ బయోటెక్‌కు సహకరిస్తోంది. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై బ్రెజిల్ అటార్నీ జనరల్ దర్యాప్తు ప్రారంభించారు.
ముందు జాగ్రత్తగానే ఒప్పందంపై తాత్కాలిక నిషేధం విధించామని కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ వాగ్నర్ రోస్రియొ తెలిపారు. ‘ఒప్పందానికి సంబంధించిన ఆడిట్‌పై వారం క్రితం ప్రాథమిక విచారణ ప్రారంభించాం. సాధ్యమైనంత త్వరగా విచారణ ముగిస్తాం’అన్నారు. ఒప్పందానికి సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి అవకతవకలను గుర్తించలేదని, అయితే, విచారణ కొనసాగించాలన్న నిర్ణయం నేపథ్యంలో నిబంధనల మేరకు తాత్కాలిక నిషేధం విధించామని బ్రెజిల్ వైద్య మంత్రి మార్సెల్ క్వీరొగా వెల్లడించారు. బ్రెజిల్‌కు 15 డాలర్లకు ఒక డోసు చొప్పున అమ్మేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో డోసుకు 15 నుంచి 20 డాలర్ల మధ్య పలు ఇతర దేశాలతో కూడా ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్ పేమెంట్ కూడా తీసుకున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది.
‘డెల్టా’పై కొవాగ్జిన్ పనితీరు భేష్: ఎన్‌ఐహెచ్
డెల్టా వేరియంట్‌పై కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. కరోనా ఆల్ఫా వేరియంట్‌పైనా ఈ టీకా చక్కగా పనిచేస్తోందని పేర్కొంది. ఎన్‌ఐహెచ్, భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మధ్య పలు శాస్త్రీయ పరిశోధనల్లో భాగస్వామ్యం ఉంది. కోవాగ్జిన్ రూపకల్పనలోనూ ఎన్‌ఐహెచ్ సహకరించింది.
Comments
Please login to add a commentAdd a comment