
న్యూఢిల్లీ: భారత్‌లో శనివారం భారీ స్థాయిలో పరీక్షలు జరిగాయి. ఒక్క రోజులోనే 10 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 4.14 కోట్లు దాటింది. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మాత్రం ఆగడం లేదు. ఆదివారం తాజాగా మరో 78,761 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35,42,733కు చేరుకుంది. గత 24 గంటల్లో 64,935 మంది కోలుకోగా 948 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 63,498కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 27,13,933 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,65,302గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 21.60గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే 19.5 లక్షల కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. ఆదివారానికి ఇది 76.61 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.79 శాతానికి పడిపోయిందని తెలిపింది.
ఆగస్టు 29 వరకు 4,14,61,636 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం మరో 10,55,027 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. గతం వారం రోజుల్లోనే అయిదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా 948 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 328 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి.
కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని, టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 1,583 ల్యాబుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. భారత్ లో ప్రతి మిలియన్ మందికి రోజుకు 545 పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ జరిపిన పరీక్షలు ప్రతి మిలియన్ మందికి 30,044 కి చేరాయి. కరోనా కేసులు 20 లక్షల నుంచి 30 లక్షలకు 16 రోజుల్లోనే చేరుకున్నాయి.
2.5 కోట్లు దాటిన కేసులు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా భారీ ప్రభావాన్నే చూపుతోంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ప్రపంచంలో 2.5 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధిక సంఖ్యలో అమెరికాలో 59 లక్షల కేసులు, బ్రెజిల్‌లో 38 లక్షల కేసులు, భారత్‌లో 35 లక్షలు కేసులు నమోదయ్యా యి. అమెరికా ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుత కేసులక 10 రెట్లు అధిక కేసులు ఉండవచ్చని చెబుతున్నారు. వారందరినీ గుర్తించి ఉండకపోవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 8,42,000 మందికి పైగా మరణించారు.