ఎంత బిజీగా ఉన్నా శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చండి
తరచూ లేచి నడవండి
టీవీ చూస్తున్నప్పుడు కొన్ని నిమిషాలు లేచి తిరగండి
పెద్దలు రోజుకు కనీసం 30 నుంచి 60 నిమిషాలు వ్యాయామం, వాకింగ్ తప్పనిసరి
శారీరక, మానసిక ఆరోగ్యానికి ఐసీఎంఆర్ సూచనలు
ఏ వయసు వారైనా రోజుకు తగినంత శారీరక శ్రమ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. చదువు, పనిలో ఎంత బిజీగా ఉన్నా శారీరక శ్రమను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సూచిస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్), ఐసీఎంఆర్ కలిసి డైట్రీ గైడెన్స్ ఫర్ ఇండియా పేరిట మెరుగైన ఆరోగ్యం కోసం 17 మార్గదర్శకాలను ఇటీవల వెల్లడించాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం శారీరక శ్రమ, యోగా, వ్యాయామంపై పలు సిఫార్సులు చేశాయి. – సాక్షి, అమరావతి
ప్రతి కొద్ది గంటలకు కదలిక ఉత్తమం
ఎంత బిజీగా ఉన్నా పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కోపోవడం సరికాదు. ప్రతి కొన్ని గంటలకు ఒకసారి శరీరాన్ని కదల్చాలని ఐసీఎంఆర్ సూచించింది. పని చేసే ప్రదేశాల్లో స్టాడింగ్ డెస్క్ ఉపయోగించాలి. లేదంటే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి. అదే విధంగా ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలని పేర్కొంది. ఇంట్లో, పని ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడేప్పుడు నడుస్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్‌కు బదులు మెట్లను వినియోగించాలి. టీవీ చూస్తున్నప్పుడు కుర్చీకే పరిమితం కాకూడదు. టీవీల్లో వచ్చే కమర్షియల్ బ్రేక్ సమయంలో లేచి తిరగాలి.
30 నుంచి 60 నిమిషాల వ్యాయామం
⇒ 19 నుంచి 60 ఏళ్ల వయసు వారు రోజుకు 30 నుంచి
60 నిమిషాల పాటు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి.
⇒ వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరి.
⇒ వయసు, ఆరోగ్య స్థితిగతులను పరిగణనలో ఉంచుకుని ఏరోబిక్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్, వాకింగ్ వంటి ఇతర శారీరక శ్రమ చేయాలి.
⇒ ఇదే తరహాలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు కూడా వారం మూడు, అంతకంటే ఎక్కువ రోజులు శారీరక శ్రమను ఐసీఎంఆర్ సూచించింది.
⇒ 5–19 ఏళ్ల పిల్లలు, యుక్త వయస్కులకు రోజుకు కనీసం 60 నిమిషాల ఇంటెన్సిటీ యాక్టివిటీని సూచించింది.
భారత్‌లో డబ్ల్యూహెచ్‌వో సూచనలు అందుకోలేక పోయిన వారు.. (శాతం)
సంపూర్ణ ఆరోగ్యం కోసం దైనందిన జీవనంలో వివిధ కార్యకలాపాలపై సిఫార్సులు ఇలా..
లాన్సెట్ అధ్యయనం ఏం చెబుతోందంటే..
భారత్‌లోని 57 శాతం మహిళలు, 42 శాతం మంది పురుషులు ఫిజికల్ ఇనాక్టివ్‌గా ఉంటున్నట్టు తాజాగా ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లోని డేటాను అధ్యయనం చేయగా భారత్ 12వ స్థానంలో ఉన్నట్టు స్పష్టమైంది. ప్రపంచ వ్యాప్తంగా 31 శాతం మంది పెద్దలు అంటే.. దాదాపు 1.8 బిలియన్‌ల మంది 2022లో ఇనాక్టివ్‌గా ఉంటున్నారు. 2010 నుంచి 2022 మధ్య 5 శాతం మేర ఈ స్థాయి పెరిగినట్టు తేలింది.
వారానికి కనీసం 150 నిమిషాలు..
ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతీయుల్లో కూడా శారీరక శ్రమ తగ్గిపోతోంది. జీవన శైలి జబ్బుల బారినపడకుండా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment