గుండెపోటు ముప్పు పెంచిన కరోనా | Corona has increased the risk of heart attacks | Sakshi
Sakshi News home page

గుండెపోటు ముప్పు పెంచిన కరోనా

Published Sun, Dec 31 2023 4:36 AM | Last Updated on Sun, Dec 31 2023 4:17 PM

Corona has increased the risk of heart attacks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా 18–45 మధ్య వయస్కుల గుండెపోటు మరణాలు సాధారణంగా ఏడాదికి లక్షకు నాలుగు ఉంటాయి. కానీ కరోనా కాలంలో ఈ సంఖ్య పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే కరోనా కాలంలో యువతీ యువకులు అత్యధికంగా ఆకస్మిక గుండెపోటుకు గురై చనిపోయారు. దీనిపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) శాస్త్రీయ అధ్యయనం చేసింది.

దీని ప్రకారం కరోనా రాని యువకులతో పోలిస్తే వైరస్‌ సోకిన వారు మొదటి వారంలో గుండెపోటుకు గురయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ ఉంది. అదే రెండో వారంలో రెండున్నర రెట్లు, 30 రోజుల తర్వాత రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తేలింది. ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్, మితిమీరిన వ్యాయామం లాంటి కారణాలతో పాటు కరోనా సోకడం యువతకు ముప్పు పెంచిందని నిర్ధారించింది.

ముఖ్యంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల మరణాలు సంభవించలేదని అధ్యయనం తేల్చింది. పైగా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. 

31.6% మంది వ్యాక్సిన్‌ తీసుకోలేదు
మరణించిన 729 యువకుల్లో 31.6 శాతం మంది అసలు వ్యాక్సిన్‌ తీసుకోలేదు. కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరినవారు 2.3 శాతం మంది ఉన్నారు. అందులో పొగతాగేవారు 26 శాతం ఉన్నారు. ఆల్కహాల్‌ తీసుకునేవారు 27 శాతం ఉన్నారు. చనిపోవడానికి 48 గంటలకు ముందు మితిమీరి ఆల్కహాలు తీసుకున్నవారు 7 శాతం ఉన్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్‌ వంటి డ్రగ్స్‌ తీసుకున్నవారు 1.7 శాతం ఉన్నారు. ఏ రకమైన వ్యాయామం చేయనివారు 81 శాతం, 48 గంటలకు ముందు మితిమీరిన శారీరక శ్రమ లేదా అధిక వ్యాయామం చేసినవారు 3.5 శాతం ఉన్నారు.

సాధారణ వ్యాయామం చేసినవారు 16 శాతం ఉన్నారు. ఆకస్మికంగా మరణించిన ఆ యువకులకు చెందిన 10 శాతం మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అంటే గుండెపోటుకు సంబంధించి కుటుంబ చరిత్ర ఉన్నవారు అన్నమాట. కుటుంబ సభ్యులంటే తల్లి, తండ్రి, తోబుట్టువులని ఐసీఎంఆర్‌ పేర్కొంది. కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన యువకుల్లో సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఆకస్మిక మరణాలు నాలుగు రెట్లు అధికంగా సంభవించాయి.

48 గంటలకు ముందు మితిమీరిన మద్యం తీసుకుంటే మరణాలు ఆరు రెట్లు ఎక్కువ. విపరీతమైన శారీరక శ్రమ చేయడం వల్ల మూడు రెట్లు రిస్క్‌ ఎక్కువగా ఉంది. డ్రగ్స్‌తో నాలుగు రెట్లు, పొగతాగడం వల్ల రెండు రెట్లు రిస్క్‌ ఎక్కువగా ఉంది. వ్యాయామం చేస్తున్నప్పుడు సాధారణంగా రెండు నిమిషాల్లోనే శ్వాస అదుపులోకి వస్తుంది. కానీ 10 నిమిషాల పాటు కొనసాగితే దాన్ని మితిమీరిన వ్యాయామం అంటారు. అటువంటి వారిలో మరణాలు సంభవించాయి. 

వ్యాక్సిన్‌ వల్ల గుండెపోట్లు తగ్గాయి...
కోవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల యువకులు ఆకస్మిక మరణాలకు గురైనట్లు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐసీఎంఆర్‌ వీటిపైనా అధ్యయనం చేసింది. వార్తల్లో కథనాలను ఆధారంగా చేసుకొని పరిశోధన కొనసాగించింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల మరణాలు సంభవించలేదని తేల్చింది. పైగా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారిలో ఆకస్మిక మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది.

ఆకస్మిక మరణాలపై అధ్యయనం
దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 47 మెడికల్‌ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల పరిధిలో ఐసీఎంఆర్‌ పరిశోధన చేసింది. 2021 అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు కరోనా కాలంలో యువకుల ఆకస్మిక మరణాలపై అధ్యయనం చేసింది. ఆయా కాలేజీల పరిధిలో 18–45 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించిన 29,171 మంది యువకుల్లో 729 మందిపై ప్రత్యేకంగా పరిశో ధన చేసింది. వారి మరణాలకు కారణాలపై డేటా సేకరించి విశ్లేషించింది. నాలుగింట మూడొంతుల మంది మరణాల వివరాలను ప్రత్యక్ష సాక్షుల నుంచే తీసుకుంది. 

కరోనా సామాజికంగా కూడా దెబ్బతీసింది
అలవాటు లేని శారీరక శ్రమ, వ్యాయామం అతిగా చేయడం వల్ల యువకుల్లో ఆకస్మిక మరణాలు సంభవించాయి. తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలిక జబ్బులు కూడా దోహదపడ్డాయి. కోవిడ్‌ అనేది సాధారణ జబ్బే కాదు. అది సామాజికంగా కూడా దెబ్బతీసింది. ఉద్యోగం కోల్పోవడం లాంటివి పరోక్షంగా ప్రభావం చూపించాయి. మరోవైపు మానసిక రుగ్మతలు 25 శాతం పెరిగాయి. వదంతులు, ప్రచారాలు కూడా ప్రజలపై మానసికంగా ప్రభావం చూపాయి.    – డాక్టర్‌ కిరణ్‌ మాదల,  ఐఎంఏ సైంటిఫిక్‌ కన్వీనర్, తెలంగాణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement