Study: Two Thirds Of Indians Have Covid Antibodies, Details Inside- Sakshi
Sakshi News home page

కోవిడ్‌ ప్రమాదంలో 40 కోట్ల మంది

Published Wed, Jul 21 2021 2:52 AM | Last Updated on Wed, Jul 21 2021 2:51 PM

Two Thirds Of Indians Have Covid Antibodies, 40 Crore Still At Risk - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని ఆరేళ్లపైబడి వయస్సున్న మూడింట రెండొంతుల మంది జనాభాలో కోవిడ్‌ నిరోధక యాంటీబాడీలు అభివృద్ధి చెందినప్పటికీ, సుమారు 40 కోట్ల మంది కోవిడ్‌ బారిన పడే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది. జాతీయ స్థాయిలో జూన్‌–జూలైల్లో చేపట్టిన నాలుగో సెరో సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ మీడియాకు చెప్పారు. దేశ జనాభాలోని ఆరేళ్లకు పైబడిన మూడింట రెండొంతుల జనాభా, 67.6% మందిలో కోవిడ్‌ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు తేలిందని చెప్పారు. ఇంకా, సుమారు 40 కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మారి బారినపడే ప్రమాదంలో ఉన్నారని పేర్కొన్నారు.

సర్వేలో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తల్లో 85 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడైంది. కానీ, దేశంలోని ప్రతి 10 మందిలో ఒక ఆరోగ్య కార్యకర్త ఇప్పటికీ టీకా వేయించుకోలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలకు చెందిన 28,975 మంది సాధారణ ప్రజలు, 7,252 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ సర్వే జరిగింది. పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ కోవిడ్‌పై పోరులో రాజీ పడరాదని స్పష్టం చేశారు. కోవిడ్‌ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిం దేనని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, సామాజిక, మత, రాజకీయ సమావేశాలకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. చిన్నారులు వైరల్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడేందుకు అవకాశాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే స్కూళ్లు తెరవడం మంచిదని సూచించారు.

125 రోజుల్లో కనిష్ట స్థాయికి కేసులు
దేశంలో 125 రోజుల తర్వాత ఒక్క రోజులో కనిష్టంగా 30,093 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,11,74,322కు చేరాయి. అదేవిధంగా, 111 రోజుల తర్వాత ఒక్క రోజులో అతితక్కువగా 374 కోవిడ్‌ మరణాలు సంభవించాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో, కోవిడ్‌ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,14,482కు చేరుకుంది. యాక్టివ్‌ కేసులు కూడా 117 రోజుల తర్వాత 4,06,130కి తగ్గాయని పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్‌ కేసులు 1.30% మాత్రమే. రికవరీ రేట్‌ కూడా 97.37%గా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,03,53,710 మంది కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు.  

చిన్నతరగతులతో స్కూళ్లు ఆరంభించడం బెటర్‌! 
ఒకవేళ భారత్‌లో బడులు తెరవడం ఆరంభించేట్లయితే ముందుగా చిన్న తరగతులతో ఆరంభించడం మేలని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ్‌ సూచించారు. మానవ కణాల్లో వైరస్‌ రాకను అనుమతించే గ్రాహకాలు చిన్నపిల్లల్లో తక్కువని, అందువల్ల పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లల్లో వైరస్‌ సోకే అవకాశాలు చాలా తక్కువని వివరించారు. అయితే బడులు తెరిచినా సరే నిబంధనలు కఠినంగా పాటించాల్సిందేనని సూచించారు. ముఖ్యంగా టీచర్లు ఇతర సిబ్బంది టీకాలు వేయించుకొనిఉండాలన్నారు. దేశంలో 6–9వయసు గ్రూపు జనాభాలో సీరోప్రీవాలెన్స్‌(బ్లడ్‌ సీరమ్‌లో సూక్ష్మజీవి స్థాయి) పెద్దలతో సమానంగా దాదాపు 57.2 శాతంఉందని జాతీయ సర్వేలో తేలిందన్నారు. ప్రైమరీ తరగతులకు చెందిన పిల్లలతో బడులు ఆరంభించడం మంచిదని అభిప్రాయపడ్డారు. పలు దేశాల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్‌ వేవ్‌ సందర్భాల్లో కూడా ప్రైమరీ బడులు మూసివేయలేదని తెలిపారు. అందువల్ల మనదగ్గర కూడా ముందుగా ప్రైమరీ పాఠశాలలు తెరవడం మంచిదన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement