హెచ్‌3ఎన్‌2పై వైద్య శాఖ అప్రమత్తం.. రాష్ట్రవ్యాప్తంగా  ఫీవర్‌ సర్వే  | Medical department alerted on H3N2 Virus Andhra Pradesh | Sakshi
Sakshi News home page

హెచ్‌3ఎన్‌2పై వైద్య శాఖ అప్రమత్తం.. రాష్ట్రవ్యాప్తంగా  ఫీవర్‌ సర్వే 

Published Mon, Mar 13 2023 3:39 AM | Last Updated on Mon, Mar 13 2023 11:45 AM

Medical department alerted on H3N2 Virus Andhra Pradesh - Sakshi

ఫీవర్‌ సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది(ఫైల్‌)

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హెచ్‌3ఎన్‌2 ప్రభావం లేనప్పటికీ ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని గుర్తించి వారికి వైద్య సహాయం అందించడానికి సోమవారం నుంచి ఫీవర్‌ సర్వేను చేపట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారుల (డీఎంహెచ్‌వో)కు ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్‌లు, గ్రామ, వార్డు వలంటీర్‌లు ఇంటింటికీ వెళ్లి ప్రజలను స్క్రీనింగ్‌ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది.

శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమవుతున్న క్రమంలో వాతావరణ మార్పులతో దగ్గు, జలుబు, వైరల్‌ జ్వరాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్‌3ఎన్‌2 అనే వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఇప్పటికే వెల్లడించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సైతం రాష్ట్రాలకు ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసింది.  

సీజన్‌ మారడం వల్లే.. 
హెచ్‌3ఎన్‌2 ఫ్లూ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేయడం కోసం టెస్టింగ్‌ కిట్‌లను వైద్య ఆరోగ్య శాఖ కొనుగోలు చేస్తోంది. రెండు రోజుల్లో అన్ని బోధనాస్పత్రులకు వీటిని పంపనుంది. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్‌లోని వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లో హెచ్‌3ఎన్‌2 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇక్కడ జనవరిలో 12, ఫిబ్రవరిలో తొమ్మిది పాజిటివ్‌ కేసులను నిర్ధారించారు. అయితే ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

ఏటా సీజన్‌ మారుతున్న సమయంలో కేసులు కొంత పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్‌ మొదలవుతుండటంతో అవే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు వస్తున్న బాధితులకు చాలా అరుదుగా మాత్రమే అడ్మిషన్‌ అవసరమవుతోందని చెబుతున్నారు. సాధారణంగా ఆస్పత్రులకు వచ్చే ఓపీల్లో 5 నుంచి 6 శాతం వరకు జ్వరం, దగ్గు, జలుబు వంటి కేసులే ఉంటాయని గుర్తు చేస్తున్నారు.  

వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు.. 
► క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. 
► ఫ్లూ లక్షణాలున్నవారు మాస్క్‌ ధరించాలి. 
► వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. 
► షేక్‌హ్యాండ్, ఆలింగనాలు మానుకోవాలి. 
► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు.  

కంగారు పడవద్దు.. 
వాతావరణం మారుతున్నప్పుడు సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి. వీటికే ప్రజలు కంగారు పడిపోవద్దు. ఈ లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ఆశా వర్కర్, ఏఎన్‌ఎంలను సంప్రదించవచ్చు. వారు మందులు ఇవ్వడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతారు. హెచ్‌3ఎన్‌2 ప్రభావం రాష్ట్రంలో లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తల్లో భాగంగా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం.  
– డాక్టర్‌ రామిరెడ్డి, డైరెక్టర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 

రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జాగ్రత్త.. 
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై వైరస్‌లు, బ్యాక్టీరియాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు, షుగర్, హెచ్‌ఐవీ బాధితులు మాస్క్‌ ధరించాలి.  జలుబు, దగ్గు, జ్వరం ఉంటే పారాసెటమాల్, బ్రూఫెన్‌ మాత్రలు, గొంతు ఉపశమనానికి విక్స్‌ బిళ్లలు వేసుకోవాలి.  శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.  ఒసెల్టామివిర్‌ 75 ఎంజీ మాత్ర రోజుకు రెండుసార్లు వేసుకోవాలి.        
– డాక్టర్‌ ఎస్‌.రఘు,సూపరింటెండెంట్, ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రి, గుంటూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement