
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం రికవరీ రేటు 63.28 శాతంగా నమోదయింది. మొన్నటివరకూ ఇది 50 నుంచి 55 శాతం మధ్య ఉండేది. మంగళవారం ఒక్కరోజే 9,113 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ దూకుడు కొనసాగిస్తోంది. మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో 25,92,619 టెస్టులు చేశారు. మిలియన్ జనాభాకు 48,551 టెస్టులు చేస్తున్నారు.
దేశంలో ఇదే అత్యధికమని ఐసీఎంఆర్ గణాంకాల్లో తేలింది. గడిచిన 24 గంటల్లో 58,315 టెస్టులు చేశారు. 9,024 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే, వివిధ ఆస్పత్రుల్లో 87 మంది మృతిచెందారు. మరణాల సంఖ్య 2,203కు చేరింది. మంగళవారం నమోదైన కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,372 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 342 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment