H3N2 Influenza
-
పొంచి ఉన్న ఇన్ఫ్లుయెంజా.. ఈ జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ హెచ్చరిక
బనశంకరి: దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా ప్లూ రోగం బెడద పెరుగుతోంది. ఎంతోమంది దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు తదితర లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రజలకు కొన్ని సలహాలు విడుదల చేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్లో ఎక్కువ కేసులు నమోదు కాగా ఐసీఎంఆర్ ల్యాబ్ డేటా విశ్లేషణలో కర్ణాటకలో కూడా ఇన్ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ జబ్బుకు ఒసెల్టామివిర్ మాత్రలను చికిత్సా విధానంలో చేర్చారు. ఇవి అన్ని ఆరోగ్యకేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు పాటించాల్సిన నియమాలు ● తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోరు, ముక్కుకు టవల్, కర్చీఫ్, లేదా టిష్యూ పేపర్‌ను అడ్డుగా పెట్టుకోవాలి, ఆపై చేతులను సబ్బుతో నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అవసరం లేకుండా కన్ను, ముక్కు , నోటిని చేతులతో ముట్టరాదు. ● అధిక రద్దీ ఉండే స్థలాలకు వెళ్లడం తగ్గించాలి, రద్దీ ప్రాంతాల్లో మాస్కును ధరించాలి. ప్లూ జ్వరంతో బాధపడే వ్యక్తులనుంచి కనీస దూరం పాటించాలి ● రోజూ బాగా నిద్రపోవాలి. తీవ్ర శ్రమ కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఆలింగనం, ముద్దు పెట్టుకోవడం, జనరద్దీ ప్రాంతాల్లో ఉమ్మివేయడం వంటివి చేయరాదు. వైద్యుల సలహాలేకుండా ఔషధాలను, యాంటి బయాటిక్ మందులను తీసుకోరాదు. ఇన్ఫ్లుయెంజా ఉంటే ఇలా చేయండి ● జ్వరం, జలుబు, అస్వస్దత, ఆకలి లేకపోవడం, చేతులు,కాళ్లు నొప్పులు, దీర్ఘకాలికంగా జలుబు తదితర లక్షణాలు ఇన్ఫ్లుయెంజా రోగ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాలి. వైద్యుల సలహా మేరకు ఇంటిలోనే విశ్రాంతి తీసుకోవాలి. ప్రయాణాలు చేయరాదు. మాస్కు ధరించడం ముఖ్యం. రోగ లక్షణాలు ప్రారంభమైన తరువాత కనీసం 7 రోజుల పాటు ఆరోగ్యవంతులకు దూరంగా ఉండాలి. లేదంటే రోగి వల్ల ఇతరులకు సులభంగా వ్యాపించే ప్రమాదం ఉంది. -
దేశాన్ని అల్లకల్లోలం చేస్తోన్న H3N2 వైరస్
-
ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10 రోజులు స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే!
భారత్‌లో మెల్లమెల్లగా హెచ్3ఎన్2 వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటికే పలు నగరాల్లో చాప కింద నీరులా పాకుతున్న ఈ వైరస్ ఎఫెక్ట్ తాజాగా పుదుచ్చేరికి తాకింది. ఈ నేపథ్యంలో పాఠశాలలను 10 రోజులు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు. సీజనల్ ఇన్ఫ్లుఎంజా H3N2 వైరస్ కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారనే నివేదికల నేపథ్యంలో మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలను మూసివేయాలని పుదేచ్చేరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశంలో హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా కేసులు అకస్మాత్తుగా పెరగుతూ ఆందోళన కలిగిస్తోంది. గత వారం ప్రారంభంలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి 2 మార్చి 5 మధ్య భారత్‌లో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో 23 ఏళ్ల వైద్య విద్యార్థి H3N2 వైరస్‌తో మరణించగా.. గుజరాత్‌లోని వడోదరలో ఈ వైరస్ కారణంగా మొదటి మరణం నమోదైంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో 82 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. హెచ్3ఎన్2 వైరస్ పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తోంది కాబట్టి కోవిడ్ ప్రోటోకాల్‌లను మళ్లీ అనుసరించాల్సిన సమయం ఆసన్నమైందని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంట పాటించడంతో పాటు మహమ్మారి సమయంలో అనుసరించిన నియమాలను మళ్లీ పాటించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. చదవండి: ఇంత బలుపేంటి భయ్యా.. దెబ్బకు తిక్క కుదిరిందిగా.. -
మహారాష్ట్రలో దడపుట్టిస్తున్న H3N2.. తొలి మరణం.. పెరుగుతున్న కేసులు
ముంబై: మహారాష్ట్రలో హెచ్3ఎన్2 దడపుట్టిస్తోంది. రోజురోజుకు కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ వైరస్ సోకి అహ్మద్ నగర్‌కు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మృత్యువాత పడినట్లు అనుమానిస్తున్నారు. మార్చి 14న చనిపోయిన అతనికి హెచ్3ఎన్2తో పాటు కోవిడ్ కూడా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే విద్యార్థి మృతికి గల ప్రధాన కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇతను ఇన్ఫ్లూయెంజాతో చనిపోయినట్లు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ అదే జరిగితే మహారాష్ట్రలో ఇదే తొలి హెచ్3ఎన్2 మరణం అవుతుంది. పుదుచ్చేరిలో స్కూల్స్ బంద్.. పుదుచ్చేరిలో కూడా హెచ్3ఎన్2 వైరస్ పంజా విసురుతోంది. దీంతో పాఠశాలలను మార్చి 16 నుంచి 26 వరకు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఏ నమస్సివాయం బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఢిల్లీ ప్రభుత్వం చర్యలు.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా హెచ్3ఎన్2 క్రమంగా విజృంభిస్తోంది. దీంతో ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఆస్పత్రులతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేక బృందాలతో పాటు, ఔషధాలను సమకూర్చుతోంది. ఎల్ఎన్జేపీ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ బ్లాక్‌లో 20 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. స్వైన్‌ఫ్లూ.. కరోనా, ఇన్ఫ్లూయెంజాతో పాటు దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు పెరగడం కూడా ఆందోళన కల్గిస్తోంది. ఇంటిగ్రేటేడ్ డిసీజ్ సర్వైవలెన్స్ ప్రోగ్రాం గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 28 నాటికి 955 హెచ్1ఎన్1(స్వైన్ ఫ్లూ) కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తమిళనాడులో 545, మహారాష్ట్రలో 170, గుజరాత్లో 170, కేరళలో 42, పంజాబ్‌లో 28 కేసులు వెలుగుచూశాయి. మరోవైపు కోవిడ్, ఇన్‌ఫ్లూయెంజా కేసులు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. చదవండి: ఓ వైపు కరోనా.. మరోవైపు ఇన్‌ఫ్లూయెంజా.. మాస్కులు ధరించకపోతే అంతే! -
H3N2 Influenza: గుజరాత్లో తొలి హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా మరణం..
గాంధీనగర్: భారత్‌లో ఇన్‌ఫ్లూయెంజా ఉపరకం H3N2 కేసులతోపాటు మరణాల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. తాజాగా గుజరాత్లో హెచ్3ఎన్2 తొలి మరణం సంభవించింది. ఈ వైరస్‌కు గురైన 58 ఏళ్ల మహిళ వడోదరలోని ఎస్ఎస్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు గుజరాత్ అధికారులు మంగళవారం వెల్లడించారు. దీంతో హెచ్3ఎన్2 కారణంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 7కు పెరిగింది. ఈ వైరస్‌కు గురై తొలి మరణం కర్ణాటకలో చోటుచేసుకుంది. హాసన్ జిల్లాకు 82 ఏళ్ల వ్యక్తి ఇన్ఫ్లుయెంజా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా జనవరి 2 నుంచి మార్చి 5 మధ్య భారతదేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర వైద్యాఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే దేశంలో వైరస్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అంతేగాక ఈ నెలఖరు నాటికి కేసులు తగ్గుముఖం పట్టనున్నట్లు అంచనా వేసింది. మరోవైపు హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నందున దేశంలో మాస్క్‌ల వాడకం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. ప్రజలు సొంత మెడికేషన్ తీసుకోరాదని, ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడవద్దని ఐసీఎంఆర్ ఇటీవల హెచ్చరించింది. హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ నాన్ హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా అని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ ప్రకటనలో పేర్కొంది. దగ్గు, ముక్కు కారడం(జలుబు), వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పి వంటి సాధారణ లక్షణాలుగా పేర్కొంది. -
హెచ్3ఎన్2పై వైద్య శాఖ అప్రమత్తం.. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హెచ్3ఎన్2 ప్రభావం లేనప్పటికీ ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని గుర్తించి వారికి వైద్య సహాయం అందించడానికి సోమవారం నుంచి ఫీవర్ సర్వేను చేపట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారుల (డీఎంహెచ్‌వో)కు ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలను స్క్రీనింగ్ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమవుతున్న క్రమంలో వాతావరణ మార్పులతో దగ్గు, జలుబు, వైరల్ జ్వరాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2 అనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇప్పటికే వెల్లడించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సైతం రాష్ట్రాలకు ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసింది. సీజన్ మారడం వల్లే.. హెచ్3ఎన్2 ఫ్లూ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేయడం కోసం టెస్టింగ్ కిట్లను వైద్య ఆరోగ్య శాఖ కొనుగోలు చేస్తోంది. రెండు రోజుల్లో అన్ని బోధనాస్పత్రులకు వీటిని పంపనుంది. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్‌లోని వీఆర్డీఎల్ ల్యాబ్‌లో హెచ్3ఎన్2 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇక్కడ జనవరిలో 12, ఫిబ్రవరిలో తొమ్మిది పాజిటివ్ కేసులను నిర్ధారించారు. అయితే ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఏటా సీజన్ మారుతున్న సమయంలో కేసులు కొంత పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ మొదలవుతుండటంతో అవే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు వస్తున్న బాధితులకు చాలా అరుదుగా మాత్రమే అడ్మిషన్ అవసరమవుతోందని చెబుతున్నారు. సాధారణంగా ఆస్పత్రులకు వచ్చే ఓపీల్లో 5 నుంచి 6 శాతం వరకు జ్వరం, దగ్గు, జలుబు వంటి కేసులే ఉంటాయని గుర్తు చేస్తున్నారు. వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు.. ► క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ► ఫ్లూ లక్షణాలున్నవారు మాస్క్ ధరించాలి. ► వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ► షేక్‌హ్యాండ్, ఆలింగనాలు మానుకోవాలి. ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు. కంగారు పడవద్దు.. వాతావరణం మారుతున్నప్పుడు సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి. వీటికే ప్రజలు కంగారు పడిపోవద్దు. ఈ లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ఆశా వర్కర్, ఏఎన్ఎంలను సంప్రదించవచ్చు. వారు మందులు ఇవ్వడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతారు. హెచ్3ఎన్2 ప్రభావం రాష్ట్రంలో లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తల్లో భాగంగా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, డైరెక్టర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జాగ్రత్త.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై వైరస్లు, బ్యాక్టీరియాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు, షుగర్, హెచ్ఐవీ బాధితులు మాస్క్ ధరించాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే పారాసెటమాల్, బ్రూఫెన్ మాత్రలు, గొంతు ఉపశమనానికి విక్స్ బిళ్లలు వేసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఒసెల్టామివిర్ 75 ఎంజీ మాత్ర రోజుకు రెండుసార్లు వేసుకోవాలి. – డాక్టర్ ఎస్.రఘు,సూపరింటెండెంట్, ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రి, గుంటూరు -
H3N2: సీజనల్ ఇన్‌ఫ్లూయెంజాపై కేంద్రం కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా కారణంగా కర్ణాటక, హర్యానాలో ఒక్కొక్కరు మరణించిన తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఇండిగ్రేటెడ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్(ఐడీఎస్పీ) ద్వారా సీజనల్ ఫ్లూ పరిస్థితిని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపింది. వాస్తవ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఇన్‌ఫ్లూయెంజా కారణంగా ఎంతమంది అనారోగ్యం బారినపడుతున్నారు, ఎంత మంది మరణిస్తున్నారో కూడా ట్రాకింగ్ చేస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ఈ ఫ్లూ వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న పిల్లలు, వృద్ధులు ఎక్కువ ప్రభావితం అవుతున్నట్లు తెలిపింది. హెచ్3ఎన్2 కారణంగా కర్ణాటక, హర్యానాలో ఒక్కొక్కరు మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించింది. అయితే ఈ ఫ్లూ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. మార్చి చివరి నాటికి కేసుల్లో తగ్గుదల నమోదవుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90 హెచ్3ఎన్2 కేసులు వెలుగుచూశాయి. 8 హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి. గొత కొద్దినెలలుగా ఈ కేసుల్లో పెరుగుదల కన్పిస్తోంది. 'హాంగ్ కాంగ్ ఫ్లూ'గా పేరున్న ఈ హెచ్3ఎన్2 వైరస్ వల్ల ఇతర ఫ్లూలతో పోల్చితే ఆస్పత్రిలో చేరాల్సిన ముప్పు అధికంగా ఉంటుంది. చదవండి: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా? ఇదిగో డాక్టర్ల క్లారిటీ..! -
H3N2 Virus: భారత్‌లో రెండు మరణాలు.. ఎక్కడంటే?
సాక్షి, ఢిల్లీ: హెచ్3ఎన్2 ఇన్ప్లూయెంజా ఫ్లూ.. ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్యలో దేశంలో రోజురోజుకు పెరిగిపోతోంది. మరోవైపు.. ఈ వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ ఫ్లూ వైరస్ పట్ల భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, హెచ్3ఎన్2 వైరస్ కారణంగా హర్యానాలో తొలి మరణం సంభవించిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలో కూడా మరో వ్యక్తి ఇదే వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. చనిపోయిన వ్యక్తి హసన్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. మరోవైపు.. ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య గతకొన్ని నెలలుగా వేల సంఖ్యలో ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే.. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించాలని ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. ఇక, ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అలాగే ఈ ఫ్లూ లక్షణాలు ఒకటి నుంచి నాలుగు రోజుల్లోనే తెలిసిపోతాయి. హెచ్3ఎన్2 బారినపడివారిలో లక్షణాలు కన్పించకపోతే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఇన్‌ఫ్లూయెంజా బారినపడితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆక్సిజన్ అందిచాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే, ఓ వ్యక్తికి సోకింది కోవిడ్ లేక ఫ్లూనా అని కచ్చితంగా నిర్ధరించుకోవాలంటే కరోనా టెస్టు తప్పకుండా చేయించుకోవాల్సిందేని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా బారిన వారికి చికిత్సలో యాంటీబయాటిక్స్ ఉపయోగించవద్దని ఐసీఎంఆర్ సూచించింది. BIG BREAKING NEWS | H3N2 Influenza: Two deaths due to virus in Karnataka & Haryana - Sources Total of 90 H3N2 Influenza cases so far reported#BreakingNews #H3N2Influenza #H3N2 pic.twitter.com/ju9IA7JlfQ — Mirror Now (@MirrorNow) March 10, 2023 -
హెచ్3ఎన్2పై ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి : కొత్త రకం ఫ్లూ హెచ్3ఎన్2 ప్రభావం రాష్ట్రంలో పెద్దగా లేదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. అనవసరంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ♦ ముక్కు నుంచి గొంతు మధ్యలోనే ఈ ఫ్లూ వైరస్ ప్రభావం ఉంటుంది. ♦ కరోనా వైరస్లాగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయే స్వభావం దీనికి లేదు. ♦ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్న కొందరిలో ఊపిరితిత్తుల్లోకి చేరి న్యుమోనియాకు దారితీస్తుంది. ♦ ప్రస్తుతం ఫ్లూ చిన్న పిల్లలు, వృద్ధుల్లో కొంతమేర ప్రభావం చూపుతుంది. దీనిని కనిపెట్టడం చాలా సులభం. ♦ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు ద్వారా కేసులు గుర్తిస్తున్నాం ♦ తిరుపతి స్విమ్స్‌లో తరచూ వైరస్‌లపై సీక్వెన్సింగ్ చేస్తుంటాం.. ఇలా గత జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయి. ♦దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. టవైరల్ జ్వరాలకు యాంటిబయోటిక్స్ పనిచేయవు. కాబట్టి జ్వరం వచి్చందని ప్రజలు అనవసరంగా వాటిని వాడొద్దు. ఆస్పత్రుల్లో చేరేవారు చాలా అరుదు ఇక జ్వరాలు, ఇతర లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారిలో ప్రతి వెయ్యి ఓపీల్లో 0.1 శాతం సందర్భాల్లో అడ్మిషన్ అవసరం అవుతోందని విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్, జనరల్ మెడిసిన్ వైద్యుడు డా. సుధాకర్ చెప్పారు. ఎవరికైనా జ్వరం, జలుబు వచ్చినట్లయితే పారాసిటమాల్, దగ్గు ఉన్నట్లైతే సిట్రిజీన్ మాత్ర వాడితే సరిపోతుందన్నారు. అదే విధంగా గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే వేడినీళ్లు తాగడంతో పాటు, విక్స్ బిళ్లలు వాడాలన్నారు. మరోవైపు.. గుంటూరు జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది సీజన్ మారేప్పుడు జ్వరాలు వస్తుంటాయన్నారు. వీటికి ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకుంటే చాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కాలేజీల్లో అడ్మిషన్లు కాగా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ వినోద్ తెలిపారు. విజయనగరం వైద్య కళాశాలకు ఇప్పటికే అనుమతులు లభించాయని.. మిగిలిన నాలుగు కళాశాలలకు అనుమతులు వస్తాయని భావిస్తున్నామన్నారు. ఏడాదికి మూడు నుంచి నాలుగు వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచించామన్నారు. అలాగే, ఖాళీ అయిన 246 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఎన్నికల కోడ్ ముగియగానే భర్తీ చేస్తామని.. సీనియర్ రెసిడెంట్ల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వినోద్ చెప్పారు.