బనశంకరి: దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా ప్లూ రోగం బెడద పెరుగుతోంది. ఎంతోమంది దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు తదితర లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రజలకు కొన్ని సలహాలు విడుదల చేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌లో ఎక్కువ కేసులు నమోదు కాగా ఐసీఎంఆర్ ల్యాబ్ డేటా విశ్లేషణలో కర్ణాటకలో కూడా ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ జబ్బుకు ఒసెల్టామివిర్ మాత్రలను చికిత్సా విధానంలో చేర్చారు. ఇవి అన్ని ఆరోగ్యకేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రజలు పాటించాల్సిన నియమాలు
● తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోరు, ముక్కుకు టవల్, కర్చీఫ్, లేదా టిష్యూ పేపర్‌ను అడ్డుగా పెట్టుకోవాలి, ఆపై చేతులను సబ్బుతో నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అవసరం లేకుండా కన్ను, ముక్కు , నోటిని చేతులతో ముట్టరాదు.
● అధిక రద్దీ ఉండే స్థలాలకు వెళ్లడం తగ్గించాలి, రద్దీ ప్రాంతాల్లో మాస్కును ధరించాలి. ప్లూ జ్వరంతో బాధపడే వ్యక్తులనుంచి కనీస దూరం పాటించాలి
● రోజూ బాగా నిద్రపోవాలి. తీవ్ర శ్రమ కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఆలింగనం, ముద్దు పెట్టుకోవడం, జనరద్దీ ప్రాంతాల్లో ఉమ్మివేయడం వంటివి చేయరాదు. వైద్యుల సలహాలేకుండా ఔషధాలను, యాంటి బయాటిక్ మందులను తీసుకోరాదు.
ఇన్‌ఫ్లుయెంజా ఉంటే ఇలా చేయండి
● జ్వరం, జలుబు, అస్వస్దత, ఆకలి లేకపోవడం, చేతులు,కాళ్లు నొప్పులు, దీర్ఘకాలికంగా జలుబు తదితర లక్షణాలు ఇన్‌ఫ్లుయెంజా రోగ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాలి. వైద్యుల సలహా మేరకు ఇంటిలోనే విశ్రాంతి తీసుకోవాలి. ప్రయాణాలు చేయరాదు. మాస్కు ధరించడం ముఖ్యం. రోగ లక్షణాలు ప్రారంభమైన తరువాత కనీసం 7 రోజుల పాటు ఆరోగ్యవంతులకు దూరంగా ఉండాలి. లేదంటే రోగి వల్ల ఇతరులకు సులభంగా వ్యాపించే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment