Covid Positive Cases In India Last 24 Hours: ఆపతరమా...! కరోనా ప్రళయం! - Sakshi
Sakshi News home page

ఆపతరమా...! కరోనా ప్రళయం!

Published Fri, Apr 23 2021 4:04 AM | Last Updated on Fri, Apr 23 2021 12:10 PM

3,14,835 more people tested positive for Covid-19 in the last 24 hours - Sakshi

అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రి వద్ద కారులోనే చికిత్సపొందుతున్న కోవిడ్‌ బాధితురాలు

సాక్షి, న్యూఢిల్లీ:  ఎటు చూసినా హాహాకారాలు.. భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్న ప్రజలు...ఆసుపత్రుల ముందు చికిత్స కోసం పడిగాపులు.. ప్రాణం పోయిన అనంతరం చితిపైకి చేరేందుకు సైతం పార్థ్ధివ దేహాలతో కుటుంబసభ్యులు ఎదురుచూడాల్సిన దుస్థితి..ఇవీ దేశంలోని ప్రస్తుత పరిస్థితులు..! కరోనా మహమ్మారి సంక్రమణలో దేశం రోజుకో రికార్డును బద్దలుకొడుతోంది. గత ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన సమయంలో మన దేశంలోని భారీ జనాభా దృష్ట్యా పరిస్థితులు చేజారవచ్చని భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, లాక్‌డౌన్‌ లాంటి కఠిన చర్యలతో పరిస్థితులు ఎలాగోలా అదుపులోకి వచ్చాయి.

అయితే, ఈ ఏడాది సెకండ్‌ వేవ్‌ మాత్రం దేశంలో భారీ విస్పోటనం సృష్టిస్తోంది. కరోనా వైరస్‌ ప్రళయ తాండవంతో ప్రపంచ రికార్డులను భారత్‌ తిరగరాస్తోంది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ఒక్కరోజులో అత్యధికంగా 3,14,835 మందికి కరోనా వైరస్‌ సోకింది. ప్రపంచదేశాల్లో కేవలం ఒక్క రోజులోనే నమోదైన కేసులలో ఇదే అత్యధికం. అంతకుముందు ఈ ఏడాది జనవరి 8న అమెరికాలో అత్యధికంగా 24 గంటల్లో 3.07లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలోని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి 10 రాష్ట్రాల్లోనే 75.66% పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసులు 1,59,30,965కు చేరాయి.

1.33 లక్షలు పెరిగిన యాక్టివ్‌ కేసులు
పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్యలోనూ గణనీయ మార్పు వచ్చింది. గత 24 గంటల్లోనే 1.33 లక్షల యాక్టివ్‌ కేసులు పెరిగి ఆ సంఖ్య 22,91,428కి చేరుకుంది. అదే çసమయంలో వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,104తో మొత్తం 1,84,657కు చేరింది. మరణాల రేటు ప్రస్తుతం 1.16% వద్ద నిలకడగా ఉంది. బ్రెజిల్‌ తరువాత, ప్రపంచంలో ఒకే రోజులో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా భారత్‌ నిలిచింది. మిగతా అన్ని దేశాల్లోనూ వెయ్యిలోపే మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల్లో దేశంలో 1.79 లక్షల మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. ఒక్క రోజు రికవరీల్లో ఇది ఒక రికార్డు.

మరోవైపు, కరోనా ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు బుధవారం దేశవ్యాప్తంగా 16,51,711 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తంగా 27 కోట్ల 27 లక్షల 5 వేల 103 నమూనాలను పరీక్షించారు. దేశవ్యాప్త కోవిడ్‌ టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు వేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య గురువారానికి 13.23 కోట్లు దాటింది. 24 గంటలలో 22 లక్షలమందికి పైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులు తీసుకున్నారు. దేశవ్యాప్త టీకాల కార్యక్రమం 96వ రోజైన ఏప్రిల్‌ 21వ తేదీన 22,11,334 వ్యాక్సిన్‌ డోసులిచ్చారు. అందులో 15,01,704 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 7,09,630 మందికి రెండో డోస్‌ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement