న్యూఢిల్లీ: రోజూవారీ కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం రోజుకు 16–20 లక్షల కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తుండగా జూన్ నెల చివరినాటికల్లా రోజుకు 45 లక్షల టెస్టులు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు. మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్‌కు చెందిన ‘ఇంట్లోనే చేసుకోగల ర్యాపిడ్ యాంటిజెన్ కరోనా టెస్టింగ్ కిట్’కు ఐసీఎంఆర్ తాజాగా అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో భార్గవ మాట్లాడారు.
‘మరో మూడు కిట్ల తయారీ సంస్థలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. వాటికి వారంలోపు అనుమతులు రావచ్చు. 105 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంపెనీలు అర్హత సాధించగా వాటిలో 41 సంస్థలకు అమనుతులు ఇచ్చాం. వీటిలో 31 స్వదేశీ సంస్థలున్నాయి. జూన్ చివరికల్లా 18 లక్షల ఆర్‌టీ–పీసీఆర్, 27 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు కలిపి మొత్తంగా రోజుకు 45 లక్షల టెస్ట్‌ల సామర్థ్యం సాధిస్తాం’ అని భార్గవ తెలిపారు. ‘మెడికల్ షాప్‌లో టెస్ట్ కిట్ కొనండి. మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. యూజర్ మ్యాన్యువల్ ప్రకారం కరోనా టెస్ట్ చేసుకోండి. తర్వాత కిట్ ఫొటోను యాప్‌లోకి అప్‌లోడ్ చేసి టెస్ట్ రిజల్ట్ పొందండి’ అని భార్గవ అన్నారు. మే 3న 17.13 శాతంగా ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు 12.1 శాతానికి పడిపోయాయని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.
జూన్ చివరికల్లా రోజుకు 45 లక్షల టెస్టులు చేస్తాం
Published Fri, May 21 2021 6:11 AM | Last Updated on Fri, May 21 2021 6:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment