భారత్‌లో తొలి కరోనా కేసు నమోదైన రాష్ట్రంగా నిలిచిన కేరళ మరోమారు భయపెడుతోంది. సెకండ్ వేవ్ ముగిసిపోతోందని దేశమంతా ఊపిరి తీసుకుంటున్న వేళ థర్డ్‌వేవ్‌కు కేరళ కేంద్రంగా నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ కేరళ ప్రాంతంలో పెరిగిపోతున్న ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి కేరళ ప్రభుత్వాన్నే కాదు, కేంద్రాన్ని కూడా కలవరపెడుతోంది. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు రాష్ట్రం మరోమారు వీకెండ్ లాక్‌డౌన్ అస్త్రాన్ని ప్రయోగించింది, అటు కేంద్రం ఒక నిపుణుల బృందాన్ని కేరళకు పంపి పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. గతేడాది ఒకదశలో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేస్తోందని ప్రశంసలు అందుకున్న కేరళలో పరిస్థితి ఎందుకిలా మారింది? పరిస్థితి ఎంత డేంజర్? ప్రభుత్వం ఏంచేస్తోంది? కేంద్రం నుంచి ఎలాంటి సాయం లభిస్తోంది? నిపుణులేమంటున్నారు?.. చూద్దాం!
పరిస్థితేంటి?
కరోనా సెకండ్ వేవ్ ఆరంభమైన కొత్తలో కేరళ కోవిడ్ నిర్వహణలో మంచి పనితీరే చూపింది. కానీ క్రమంగా పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. తాజాగా ఐసీఎంఆర్ చేసిన నేషనల్ సీరోసర్వేలో దేశంలో అత్యల్ప యాంటీబాడీలున్న రాష్ట్రంగా కేరళ(44 శాతం) నిలిచింది. అంటే రాష్ట్ర జనాభాలో 56 శాతం మందికి కోవిడ్ ముప్పుందని తేలుస్తోంది. పొరుగురాష్ట్రాలతో పోలిస్తే కేరళలో కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి.
ఉదాహరణకు తమిళనాడులో జూన్ 6న 20వేల పైచిలుకు కేసులుండగా, జూలై 27నాటికి ఈ కేసులు 1,767కు పరిమితమయ్యాయి. కర్ణాటకలో జూన్ 27న 1,501కేసులు నమోదయ్యాయి. కానీ కేరళలో జూలై 27న 22వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అదేరోజు దేశం మొత్తం మీద నమోదైన కొత్త కేసులు 43 వేలున్నాయి. అంటే ఒక్క కేరళ నుంచే దేశంలోని మొత్తం కేసుల్లో సగభాగం వచ్చాయి. అలాగే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 33 .3 లక్షలకు చేరింది. దేశంలో ఆర్ రేట్ విలువ 0.95 ఉండగా, కేరళలో 1.11గా ఉంది. అలాగే దేశంలో టాప్ 30 కరోనా జిల్లాల్లో పది జిల్లాలు కేరళలోనే ఉన్నాయి.
ఎందుకిలా?
కేరళలో జనాభా సాంద్రత అధికం(చదరపు కిలోమీటర్‌కు 859 మంది). అలాగే జనాభాలో 15 శాతం వరకు 60 ఏళ్లు పైబడినవారున్నారు. అలాగే డయాబెటిస్‌లాంటి వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా అధికమే. ఇవన్నీ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతున్నాయి. తక్కువ టెస్టింగ్ రేటు, బ్యూరోక్రసీపై అధికంగా ఆధారపడాల్సిరావడం వంటి కారణాలు కరోనాపై కేరళ పోరాటానికి అడ్డుతగులుతున్నాయన్నది నిపుణుల అభిప్రాయం. కేసులు తగ్గుముఖం పడుతున్న దశలో అనూహ్యంగా లాక్‌డౌన్ ఎత్తివేయడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమైందని కొందరి భావన.
కేరళకు కేంద్ర బృందం
రాష్ట్రంలో పరిస్థితిపై ఆందోళనగా ఉన్న కేంద్రం పరిస్థితి అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో కూడిన ఒక నిపుణుల బృందాన్ని కేరళకు పంపింది. ఎన్‌సీడీసీ డైరెక్టర్ ఎస్‌కే సింగ్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను బృందం సమీక్షిస్తుందని, తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నిబంధనలు కఠినంగా పాటించాలని, ప్రజలు గుంపులుగా కూడకుండా నిరోధించాలని కేంద్రం కోరింది. మరోవైపు రాçష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పకుండా మరోమారు వీకెండ్ లాక్‌డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శని, ఆదివారాల్లో లాక్‌డౌన్ పాటించనుంది. ప్రపంచవ్యాప్తంగా థర్డ్‌వేవ్ ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ మనదేశంలో థర్డ్‌వేవ్‌కు కేరళ కేంద్రంగా మారకూడదని ప్రభుత్వాలు యత్నిస్తున్నాయి. అలాంటి పరిస్థితి రాకూడదంటే ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటించాలని, ప్రజలు కూడా గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా నడుచుకోవాలిన నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మూడో ముప్పు తప్పదని హెచ్చరించారు.
ఆర్– వాల్యూ అంటే?
దేశంలో జూలై చివర్లో ఆర్– వాల్యూ (రిప్రొడక్టివ్ ఫ్యాక్టర్) 0.95గా ఉంటే... కేరళలో మాత్రం దేశంలోనే అత్యధికంగా 1.11గా ఉంది. ఇది ప్రమాదఘంటికగా నిపుణులు పేర్కొంటున్నారు. ఒక కోవిడ్ బాధితుడి నుంచి ఎంతమందికి వైరస్ సోకుతోందనే దాన్ని ఆర్ వాల్యూ సూచిస్తుంది. కేరళలో 1.11 ఆర్ వాల్యూ ఉందంటే దానర్థం... ప్రతి 100 మంది కోవిడ్ రోగుల నుంచి 111 మందికి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు లెక్క. ఆర్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంటే... కేసులు అదుపులోకి వస్తున్న ట్లు, తగ్గుముఖం పడుతున్నట్లు నిపుణులు పరిగణిస్తారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పుడు (మార్చి– ఏప్రిల్‌లో) దేశ సగటు ఆర్ వాల్యూ ఏకంగా 1.37 శాతం ఉండేది.
సెరో పాజిటివిటీ...
ఐసీఎంఆర్ జూన్ 14 – జూలై 6వ తేదీల మధ్య పదకొండు రాష్ట్రాల్లో సీరో సర్వే (సెరో పాజిటివీటి... జనాభాలో ఎంతశాతం మందికి కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నాయో తెలుపుతుంది) నిర్వహించింది. దీంట్లో అన్ని రాష్ట్రాల్లో 69 శాతం పైనే సెరో పాజిటివిటీ ఉండగా... కేరళలో మాత్రం ఇది కేవలం 44.4 శాతం మాత్రమే కావడం గమనార్హం. అంటే రాష్ట్ర జనాభాలో మరో 56 శాతం మందికి కోవిడ్ బారినపడే అవకాశం ఉన్నట్లు లెక్క.
–నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment