ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు
40 ఏళ్లలోపే చుట్టుముడుతున్న నొప్పులు, ఇతర ఇబ్బందులు
వేగంగా పెరుగుతున్న దీర్ఘకాలిక సమస్యలు
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ఐసీఎంఆర్
సాక్షి, అమరావతి: జీవితంలో త్వరగా స్థిరపడాలంటే ఐటీ ఉద్యోగమే భేష్ అని చాలామంది అనుకుంటారు. మంచి వేతనం.. వారాంతపు సెలవులు వంటి వెసులుబాట్లు సౌకర్యాలెన్నో వారికి ఉంటాయని చెబుతారు. టెకీల జీవితంలో ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు పరిశీలిస్తే వారిని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒత్తిడి వల్ల తరచూ వెన్నునొప్పి వంటి సమస్యలతో టెకీలు ఇబ్బందులు పడుతున్నారు. యాంత్రిక జీవన శైలితో 25 నుంచి 40 ఏళ్లలోపే ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒకేచోట గంటల తరబడి కూర్చుని పని చేయడం, శారీరక శ్రమ లేమి వంటి కారణాలతో 40 ఏళ్లు పైబడిన వారిలో ఆరోగ్య సూచీలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి.
43% మందిలో ఆరోగ్య సమస్యలే
దేశంలో 43 శాతం మంది టెకీలు పని నుంచి ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ అంశాన్ని నాలెడ్జ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (కేసీసీఐ) సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. టెకీల్లో సగానికిపైగా వారానికి సగటున 52.50 గంటలు పని చేస్తున్నారు. అస్థిరమైన పని షెడ్యూళ్లతో 26 శాతం మంది నిద్ర లేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 51 శాతం మంది రోజుకు సగటున ఐదున్నర గంటల నుంచి ఆరు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు.
ఎక్కువ మందిలో వెన్నునొప్పి
ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మందిలో మెడ, వెన్నునొప్పి సాధారణంగా ఉంటోంది. ఈ సమస్యలతో తమ దగ్గరకు వచ్చే యువతలో అత్యధికులు టెకీలే ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. టెకీలు గంటల తరబడి కార్యాలయాల్లో కూర్చుని పనిచేస్తుంటారు. మెడ ఎముక, భుజం ఎముక వెన్నెముకతో అనుసంధానమై ఉంటాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల మెడ, వెన్నెముకలో ఒకచోట అమరిక అస్తవ్యస్తమై ఇతర భాగా లపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో కూర్చోవడంతో పాటు, నిలబడినప్పుడు భంగిమ సరిగా ఉండేలా చూసుకోవాలని వైద్యు లు సూచిస్తున్నారు.
నిల్చున్నప్పుడు తల, భుజాల వెనుక భాగం, పిక్కలు గోడకు తాకి ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఫోన్, ల్యాప్‌ట్యాప్ చూసేప్పుడు సహజంగానే మెడ ముందుకు వాల్చకుండా ఉండాలి. ఒత్తిడిని అధిగమించడానికి యోగా, మెడిటేషన్ చేయాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కుటుంబ సభ్యులు, పిల్లలతో గడపడం, ఇష్టమైన సంగీతం వినడం, సినిమాలు చూడటం ద్వారా ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటున్నారు.
యాంత్రిక జీవన శైలితో ఇబ్బందులు పడుతున్న టెకీల వయసు 25 - 40
సగానికి పైగా టెకీలు వారానికి (5 రోజులు) సగటున పనిచేస్తున్న గంటలు 52.50
అస్థిరమైన పని షెడ్యూళ్లతో నిద్రలేమిని ఎదుర్కొంటున్నవారు (శాతంలో) 26
రోజుకు సగటున ఐదున్నర గంటలు మాత్రమే నిద్రపోతున్న టెకీలు (శాతంలో) 51
ఐసీఎంఆర్ ఏం చెబుతోందంటే..
పనిలో ఎంత బిజీగా ఉన్నా శారీరక శ్రమను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచిస్తోంది. ఆ సూచనలు ఇవీ..
» ఎంత బిజీగా ఉన్నప్పటికీ పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కుపోకుండా పనిచేసే ప్రదేశాల్లో స్టాండింగ్ డెస్క్ ఉపయోగించాలి. లేదంటే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి.
» ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలి.
» ఇల్లు లేదా పని ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడేప్పుడు నడుస్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్‌కు బదులు మెట్లను వినియోగించాలి.
» టీవీ చూస్తున్నప్పుడు కుర్చికే పరిమితం కాకూడదు. కమర్షియల్ బ్రేక్ సమయంలో లేచి తిరగాలి.
» రోజుకు 30 నుంచి 60 నిమిషాలు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి. వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరి.
» రోజులో 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి.
Comments
Please login to add a commentAdd a comment