ప్రపంచవ్యాప్తంగా నిత్యం 2వేల మంది చిన్నారుల మృత్యువాత
కలుషిత గాలిని పీల్చడంతోనే బలి
2021లో గాలి కాలుష్యంతో 80 లక్షల మంది మృతి
పొగాకు వినియోగం, అధిక రక్తపోటు తర్వాత కాలుష్య మరణాలే ఎక్కువ
హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఇప్పటి దాకా ఐదేళ్ల లోపు చిన్నారుల్లో మరణానికి పోషకాహార లోపం ప్రధాన పాత్ర వహిస్తుంటే... తాజాగా ఈ జాబితాలోకి వాయు కాలుష్యం కూడా చేరింది. ప్రపంచ వ్యాప్తంగా రోజూ దాదాపు 2వేల మంది చిన్నారులు కలుషిత గాలిని పీల్చడం వల్ల మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అపరిశుభ్రత, కలుషిత నీరు కంటే గాలి కాలుష్యంతోనే ఆరోగ్యంప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హెల్త్ ఎఫెక్టŠస్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌ఈఐ) విడుదల చేసిన కొత్త అధ్యయనం ప్రకారం..2021లో 80లక్షల మందికిపైగా కలుíÙత గాలి కారణంగా మృతి చెందారు. వీరిలో చిన్నారులతో పాటు వయోజనులు ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే... ఇంట్లో కూడా కాలుష్యం పెరుగుతుండటంతో గాలి నాణ్యత మరింత క్షీణించి అనారోగ్య సమస్యలు విజృంభిస్తున్నాయి.
పొగాకు, రక్తపోటు తర్వాత ఇదే..
ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం, అధిక రక్తపోటు తర్వాత మనిషి ప్రాణాలకు వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా తయారైంది. అధిక ఆదాయ దేశాల్లో కంటే ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో 500 రెట్లు చిన్నారుల మరణాల రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం. పీఎం 2.5గా పిలిచే చిన్న కణాలు.. అంటే 2.5 మైక్రోమీటర్ల వ్యాసం కంటే చిన్నవిగా గాల్లో కలిసిపోయి ఉండే వివిధ రకాల ధూళి కణాలు ప్రపంచ వాయు కాలుష్య మరణాల్లో 90 శాతం కంటే ఎక్కువగా కారణం అవుతున్నాయని నివేదిక పేర్కొంది.
వాయు కాలుష్యంతో నష్టాలు..
⇒ శ్వాస తీసుకున్నప్పుడు గాలి ద్వారా ధూళి కణాలు రక్తంలోకి ప్రవేశించి శరీరంలోని అవయవాల పనితీరును
తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
⇒ ఊపిరితిత్తుల వ్యాధులు సంభవిస్తున్నాయి.
⇒ గుండెజబ్బులు, మధుమేహం, చిత్త వైకల్యం తలెత్తుతున్నాయి
⇒ మహిళల్లో గర్భస్రావాలు
వాయు కాలుష్యానికి కారణాలు..
⇒ చెట్ల నరికివేత, అడవుల్లో కార్చిచ్చు
⇒ తీవ్రమైన కరువులు, భూములు ఎండిపోవడం
⇒తీవ్ర గాలులు, తుపానులు
⇒ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు
⇒ వాయు మార్గంలో ప్రయాణాలతో నైట్రోజన్ ఆక్సైడ్‌ల విడుదల
వాతావరణ సంక్షోభమే కారణమా?
వాతావరణ సంక్షోభం కూడా గాలి నాణ్యతను దిగజార్చుతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాలుష్య కారకాలు ఓజోన్‌లోకి ప్రవేశించడం ద్వారా 2021లో ఐదు లక్షల మందికిపైగా మరణాలకు కారణమైనట్టు నివేదిక తెలిపింది. ప్రధానంగా బయోమాస్, బొగ్గు, పారాఫిన్, ముడి ఇంధనాలతో వంట చేయడంతోనూ కాలుష్యం పెరిగి చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గుర్తించింది. సోలార్ స్టవ్‌ల వినియోగం అందుబాటులోకి వస్తే పీఎం 2.5 ఉద్గారాలు, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను చాలా వరకు తగ్గించవచ్చని స్పష్టం చేస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 230 కోట్ల మందికి శుభ్రమైన వంట ఇంధనాలు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment