సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 వైరస్ పరిస్థితులను అంచనా వేసేందుకు నిర్వహించనున్న సీరో సర్వైలెన్స్ ద్వారా మహమ్మారి ఉధృతం, విస్తరణ వంటివి తెలియనున్నాయి. ఇప్పటికే.. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఈ సర్వే నిర్వహించగా.. అధిక శాతం జనాభాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అద్భుతంగా యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్లు వెల్లడైంది. ఢిల్లీలో అయితే 23 శాతం మందికి వైరస్ సోకి తమకు తెలియకుండానే కోలుకున్నారు. అక్కడ లక్షన్నర పాజిటివ్ కేసులు నమోదు అయినప్పుడు ఈ సర్వే నిర్వహించారు. ప్రాంతాల వారీగా కొన్ని శాంపిళ్లు నిర్వహించి వారిలో ఎంతమేరకు యాంటీబాడీస్ అభివృద్ది చెందాయి అన్నది తేల్చారు. దీనివల్ల వైరస్ గమనం ఎలా ఉందో తెలిసింది. ఇక ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో సీరో సర్వైలెన్స్ నిర్వహించనున్నారు. ఈ సర్వే ద్వారా పలు విషయాలు తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
► ఉభయగోదావరి జిల్లాలు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సర్వే నిర్వహిస్తారు.
► ఒక్కో జిల్లాలో 3,700 శాంపిళ్లను సేకరించి వారిలో యాంటీబాడీస్ వృద్ధిని పరిశీలిస్తారు.
► ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం.. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారిని కేటగిరీలుగా విభజించి నమూనాలు సేకరిస్తారు.
► ఈ 4 జిల్లాల్లో పూర్తయిన తర్వాత మిగతా జిల్లాల్లో నమూనాల సేకరణ ఉంటుంది.
► ఈ సర్వేతో వైరస్ ప్రభావంతో పాటు, అది ఎంతమందికి సోకిందీ, దానివల్ల యాంటీబాడీస్ వృద్ధి ఎలా ఉంది అన్నది తెలుస్తుంది.
► ఎక్కువ మందిలో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఉంటే గనుక వారికి తెలియకుండానే కరోనా సోకి నయమైనట్టు పరిగణించవచ్చు.
► ఇలాంటి సర్వైలెన్స్ ఆధారంగా భవిష్యత్‌లో ఏ ప్రాంతంలో టెస్టులు చేయవచ్చు, ఎవరికి అవసరం అన్న విషయాలపై ఒక అంచనాకు రావచ్చు.
► తాజా పరిస్థితుల నేపథ్యంలో రోజూ సగటున 10 వేల కేసులతో వైరస్ స్థిరంగా ఉన్నట్టు అంచనా వేశారు
► నాలుగు జిల్లాల్లో ఈనెలాఖరుకు లేదా సెప్టెంబర్‌కు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.
గుట్టు తేల్చనున్న సీరో సర్వైలెన్స్
Published Mon, Aug 10 2020 6:02 AM | Last Updated on Mon, Aug 10 2020 6:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment