సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వచ్చిన వారిలో టీకా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోంది. రెండు డోసులు వేసుకున్న వారు కరోనా బారిన పడుతున్నప్పటికీ ప్రమాదకర పరిస్థితులు లేవు. ఇక టీకా తీసుకోని వారు మాత్రం కరోనా బారిన పడితే వారి ఆరోగ్యస్థితి సంకటంలో పడినట్లేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) స్పష్టం చేస్తోంది. దేశంలో గత ఏప్రిల్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 2 వరకు చోటుచేసుకున్న కరోనా మరణాలపై ఐసీఎంఆర్ విశ్లేషణ జరిపింది.
ఇందులో సగటున 95 శాతానికిపైగా వ్యాక్సిన్ తీసుకోని వారుగా తేలింది. గత ఏప్రిల్ నుంచి దేశంలో నమోదవుతున్న కోవిడ్–19 మరణాలను నమోదుచేస్తున్న ఐసీఎంఆర్.. వారానికోసారి ఈ గణాంకాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తోంది. గత ఏడాది చివరి వారమైన డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు దేశవ్యాప్తంగా 2,088 మంది మరణించగా, వీరిలో 2,082 మంది (99.70%) టీకా తీసుకోని వారే ఉన్నారు. కేవలం ఆరుగురే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ 60 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కావడం గమనార్హం.
ఐదు లక్షలకు చేరువలో...
దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3.7 లక్షల మంది రికవరీ కాగా, మరో 23 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,89,848 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. అంటే వైరస్ సోకిన వారిలో సగటున 1.24 శాతం మంది మరణించారు. మొదటివేవ్‌తోపాటు రెండోవేవ్‌లో అర్ధభాగం వరకు జరిగిన మరణాల్లో అన్ని వయసుల వారుండగా... వ్యాక్సినేషన్ మొదలయ్యాక మాత్రం మరణాల సంఖ్య తగ్గింది.
టీకాతో 88 రెట్లు సురక్షితం
♦2021లో చివరి నాలుగు వారాల్లో దేశవ్యాప్తంగా 9,226 మంది కరోనాతో మరణించారు. వీరిలో టీకా వేసుకున్న వారు 24 మంది మాత్రమే.
♦దేశంలో కోవిడ్‌తో అత్యధిక మరణాలు గత మే నెల రెండో వారంలో జరిగాయి. వారం రోజుల వ్యవధిలో 26,820 మంది మరణించారు. ఇందులో టీకా తీసుకోని వారు 26,438 మంది కాగా, సింగిల్ డోస్ తీసుకున్న వారు 243 మంది, డబుల్ డోసు తీసుకున్నవారు 39 మంది ఉన్నారు.
♦వ్యాక్సిన్ తీసుకుని మరణించిన వారిలో 83 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నట్లు ఐసీఎంఆర్ పరిశీలన చెబుతోంది.
♦60 ఏళ్లు పైబడిన వారిలో టీకా తీసుకోని వారితో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారు 88 రెట్లు సురక్షితంగా ఉన్నారు.
♦గత నవంబర్ నుంచి 60ఏళ్లు పైబడిన వారి మరణాలు 1.3 రెట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వారిలో రెండు డోసుల టీకా వేసుకున్న తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతుండటమే. అందువల్లనే బూస్టర్ డోసు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఐసోలేషన్‌లో ఉంటే మేలు
డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల
60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఐసోలేషన్ పాటించడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయం ఇంట్లో జాగ్రత్తలు పాటిస్తే వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. అదేవిధంగా రెండు డోసులు వేసుకున్న వాళ్లు అర్హతల ఆధారంగా తప్పకుండా బూస్టర్ డోసు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment