ఘజియాబాద్‌లో శ్మశానవాటిక వద్ద అంత్యక్రియల కోసం మృతదేహాలను వరసలో ఉంచిన దృశ్యం
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ మహమ్మారి విలయతాండవం ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,17,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాక ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కేసులు రావడం గమనార్హం. ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా మరో 1,185 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 1,74,308కు చేరింది. క్రియాశీల (యాక్టివ్) కేసుల సంఖ్య వరుసగా 37వ రోజు పెరిగింది.
గత 24 గంటల్లో కొత్తగా 97,866 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,69,743 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో వీటి సంఖ్య 10.98 శాతం. మరోవైపు కరోనా రికవరీ రేటు క్రమంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రికవరీ రేటు 87.80 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,25,47,866 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. తాజాగా ఒక్కరోజులో 1,18,302 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.22 శాతానికి పడిపోయింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఏప్రిల్ 15 వరకు 26,34,76,625 నమూనాలను (శాంపిల్స్) పరీక్షించారు.
80 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే...
దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 79.10 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని పేర్కొంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కరోనా కేసుల్లో 65.86 శాతం వాటా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలదే కావడం గమనార్హం. మొత్తం యాక్టివ్ కేసుల్లో 39.60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. మొత్తం కరోనా సంబంధిత మరణాల్లో 85.40 శాతం మరణాలు కేవలం 10 రాష్ట్రాల్లో సంభవించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడులో మరణాలు అధికంగా సంభవించాయి.
11.72 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ
ఇప్పటివరకు 17.37 లక్షల సెషన్లలో 11,72,23,509 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల్లో 59.63 శాతం డోసులను మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళలో∙ఇచ్చారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 27.30 లక్షల డోసులను పంపిణీ చేశారు.
కోవాగ్జిన్ ఉత్పత్తి గణనీయంగా పెంపు..
దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచి సెప్టెంబరు కల్లా నెలకు 10 కోట్ల డోసులకు చేరుస్తామని బయోటెక్నాలజీ శాఖ తెలిపింది. ఇందుకోసం మూడు ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించామని తెలిపింది. అలాగే కోవిడ్ చికిత్సలో వాడే రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ్ వెల్లడించారు. గడిచిన ఐదు రోజుల్లో 6.69 లక్షల డోసులను రాష్ట్రాలకు అందించినట్లు తెలిపారు. నెలకు 28 లక్షల ఉత్పత్తి సామర్థ్యాన్ని 41 లక్షలకు పెంచామన్నారు.
యడియూరప్పకు మళ్లీ కరోనా
కర్ణాటక సీఎం యడియూరప్ప(78) రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. శుక్రవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. యడియూరప్పకు తొలుత గత ఏడాది ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పట్లో ఆసుపత్రిలో చేరి, తొమ్మిది రోజులపాటు చికిత్స అనంతరం కోలుకున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ (70) కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్, కాంగ్రెస్ నేత రణదీప్‌సింగ్ సూర్జేవాలా(53), శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌లకూ కరోనా సోకింది.
Comments
Please login to add a commentAdd a comment