సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కరోనా వ్యాధి నిర్ధారణకు అభివృద్ధి చేసిన ఓ వినూత్న పద్ధతికి భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) గుర్తింపు లభించింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైరస్ నమూనాలను సీసీఎంబీలో పరీక్షిస్తుండగా... ఆయా పరీక్షా పద్ధతుల్లో చోటుచేసుకుంటున్న లోటుపాట్లను సవరిస్తూ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని రూపొందించారు. ప్రస్తుతం కరోనా అనుమానితులకు చేసే పరీక్షల్లో భాగంగా ముక్కు లేదా గొంతు లోపల స్వాబ్స్‌ను ఉంచి శరీర ద్రవాల నమూనాలు సేకరించి వాటిని పరీక్ష కేంద్రాలకు తరలిస్తున్నారు.
రవాణా సమయంలో స్వాబ్స్‌ను వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియం (వీటీఎం) పేరున్న ద్రావణంలో ఉంచుతున్నారు. అయితే ఈ ద్రావణం బయటకు రాకుండా నమూనాలను ప్యాక్ చేసే క్రమంలో ఎంతో సమయం వృధా అవుతోందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వీటీఎం లీక్ అవుతున్నట్లు కూడా తెలిసింది. దీనివల్ల ఆయా నమూనాలు పరీక్షించేందుకు పనికిరాకుండా పోవ డమే కాకుండా అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని తేలింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన సీసీఎంబీ... వీటీఎంను పూర్తిగా నివారించవచ్చని గుర్తించింది. పొడిగా ఉండే స్వాబ్ ద్వారా రైబోన్యూక్లిక్ యాసిడ్ (ఆర్‌ఎన్‌ఏ)ను వేరు చేయాల్సిన అవసరం కూడా రాదని, నేరుగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు జరపవచ్చని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఈ పద్ధతిని ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా గుర్తించింది. ఆర్‌ఎన్‌ఏ వెలికితీతకు తగిన సౌకర్యాలు లేనిచోట ఈ పద్ధతిని వాడవచ్చని తెలిపింది.
సమయం కలిసొస్తుంది: డాక్టర్ రాకేశ్ మిశ్రా
సీసీఎంబీ అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ టెక్నిక్ ద్వారా కరోనా పరీక్షల్లో ఎంతో సమయం ఆదా అవుతుందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఆటోమేషన్ పద్ధతిలో నిర్వహించే ఆర్‌ఎన్‌ఏ వెలికితీత కోసం 500 నమూనాలకు సుమారు 4 గంటల సమయం పడుతుందని ఆయన చెప్పారు. వీటీఎం, ఆర్‌ఎన్‌ఏ వెలికితీత వల్ల ఖర్చులు, ఫలితాల వెల్లడికి పట్టే సమయం పెరిగిపోతాయని, భారీ సంఖ్యలో నమూనాలను పరీక్షించాల్సిన పరిస్థితుల్లో వాటిని పరిహరించేందుకు కొత్త పద్ధతి ఉపయోగపడుతుందని వివరించారు. డ్రై స్వాబ్ టెక్నిక్‌ను వాడటం ద్వారా పరీక్షల ఖర్చు 40–50 శాతం తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యవస్థల ద్వారానే కొత్త రకం పరీక్షలను నిర్వహించగలగడం మరో విశేషమన్నారు.
లే'టెస్ట్' డ్రై స్వాబ్..
Published Sat, Nov 28 2020 4:53 AM | Last Updated on Sat, Nov 28 2020 4:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment