ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 60 శాతం మందికిపైగా కరోనా పలకరించి వెళ్లిపోయింది! అధికారికంగా జరిగిన కరోనా పరీక్షలు ద్వారా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది 15 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ ‘సీరో’ సర్వేలో 60.7 శాతం మంది కరోనా సోకి కోలుకున్నట్లు తేలింది. మహిళలు, పురుషులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఇలా రకరకాలుగా నమూనాలు సేకరించి సర్వే నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 9 నుంచి 15వ తేదీల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించింది. పట్టణాల్లో 63.5 శాతం మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 56.8 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్టు తేల్చారు. వీరంతా టీకాలు తీసుకోని వారే.
79 శాతం మందిలో యాంటీబాడీస్
ఇక కరోనా టీకాలు తీసుకున్న వారిని మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్– 1లో హెల్త్‌కేర్ వర్కర్లు, గ్రూప్ –2లో ఫ్రంట్‌లైన్ వర్కర్లు, గ్రూప్– 3లో ఇతర విభాగాల సిబ్బంది నుంచి నమూనాలు సేకరించారు. వీరంతా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారే. వీరి నుంచి 6,284 శాంపిళ్లు సేకరించి పరీక్షించారు. మొత్తమ్మీద టీకాలు తీసుకున్న 79 శాతం మందిలో యాంటీబాడీస్ కనిపించాయి.
కృష్ణాలో అత్యధికంగా పాజిటివ్ రేటు..
సీరో సర్వే లెన్స్‌లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా పాజిటివిటీ రేటు కనిపించింది. జిల్లా మహిళల్లో అత్యధికంగా కరోనా వచ్చి పోయినట్టు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 72.7 శాతం మంది మహిళలకు కరోనా వచ్చిపోయింది. పట్టణాల్లోనూ 79.1 శాతం మంది మహిళల్లో పాజిటివిటీ రేటు నమోదైంది. ఇక రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో కూడా ఎక్కువగా కృష్ణా జిల్లాలోనే యాంటీబాడీస్ వృద్ధి చెందిన వారున్నారు. వ్యాక్సిన్ మొదటి గ్రూపు వారిలో పట్టణాల్లో 84.5, గ్రామాల్లో 92.6 శాతం మందిలో యాంటీబాడీస్ కనిపించాయి.
విశాఖపట్నంలో అత్యల్పంగా...
విశాఖ జిల్లాలో పట్టణాల్లో పురుషులు 35.4% మంది కరోనా సోకి కోలుకున్నారు. గ్రామీణ ప్రాంత పురుషుల్లో 29.1 శాతం మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మహిళల్లో పల్లెల్లో 33.2 శాతం, పట్టణాల్లో 46.8 శాతం మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. రెండు డోసులు వేసుకున్న వారిలో అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో గ్రూప్–1 వారికి పట్టణాల్లో 63.6 శాతం, గ్రామాల్లో 54.1 శాతం, గ్రూప్ –2 వారికి పట్టణాల్లో 64 శాతం, గ్రామాల్లో 49 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment