సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఇప్పుడు కరోనా సోకుతున్న వారంతా తొలిసారి ఆ వైరస్ బారినపడుతున్న వారే. ఇప్పటికే కోవిడ్ వచ్చి తగ్గిపోయినవారిలో మళ్లీ సోకుతున్నవారి సంఖ్య అత్యల్పంగా ఉంటోంది. యూరోపియన్ యూనియన్ వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (ఈయూ–సీడీసీ) దీనిపై క్షుణ్నంగా అధ్యయనం చేసి, తాజాగా నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సెకండ్, థర్డ్ వేవ్ కరోనా వ్యాపిస్తున్న అన్నిప్రాంతాల్లో కూడా రీఇన్ఫెక్షన్ పెద్దగా లేదని తేల్చింది. ఫస్ట్ వేవ్‌లో కరోనా వచ్చిన ప్రతి వెయ్యి మందిలో కేవలం ఇద్దరు ముగ్గురికే సెకండ్ వేవ్‌లో సోకే అవకాశం ఉందని పేర్కొంది.
చాలా దేశాల్లో పరిశోధన చేసి..
► అమెరికాలో 28,76,773 మంది కరోనా నెగెటివ్ వచ్చినవారు, అప్పటికే కరోనా వచ్చిపోయిన 3,78,606 మందిపై శాస్త్రవేత్తలు నాలుగున్నర నెలల పాటు అధ్యయనం నిర్వహించారు. అందులో అప్పటికి కరోనా సోకని (నెగెటివ్ వచ్చిన) వారిలో 3 శాతం మంది పాజిటివ్ అయ్యారు. అదే ఫస్ట్‌వేవ్‌లో సోకినవారిలో కేవలం 0.3 శాతం మందికి రీఇన్ఫెక్షన్ వచ్చింది. అమెరికాలో సెకండ్ వేవ్‌లో వైరస్ సోకినవారిలో 99.7 శాతం కొత్తవారేనని తేలింది.
► ఖతార్‌లో 43,400 మంది కరోనా బాధితులను 240 రోజులు పరిశీలించారు. మళ్లీ కరోనా వచ్చిందా, లేదా అనేదానిపై జీనోమ్ సీక్వెన్సింగ్స్ చేశారు. పాజిటివ్ వచ్చినవారిలో కొత్తరకం వైరస్ ఉందా, పాత వైరసే వచ్చిందా అని పరిశీలించారు. రీఇన్ఫెక్షన్ 0.1 శాతం మందికి మాత్రమే ఉన్నట్టు నిర్ధారించారు.
► బ్రిటన్‌లో థర్డ్ వేవ్ కొనసాగుతోంది. అక్కడి యూకే వేరియంట్ వైరస్ విజృంభిస్తున్న సమయంలో.. ఆ వేరియెంట్ బారినపడ్డ 1,769 మందిపై, ఇతర రకాల వైరస్ సోకినవారిపై వేర్వేరుగా పరిశోధన చేశారు. యూకే వేరియెంట్ వారిలో వెయ్యిలో 11 మందికి రీఇన్ఫెక్షన్ రాగా.. నాన్ యూకే వేరియెంట్ల వారిలో ఏడుగురికి రీఇన్ఫెక్షన్ వచ్చింది.
► ఇక సిరెన్ అనే సంస్థ 20 వేల మంది ఆరోగ్య సిబ్బంది మీద అధ్యయనం చేసింది. వారిలో మొదటి వేవ్‌లో 6,614 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సెకండ్ వేవ్‌లో 362 మందికి పాజిటివ్ రాగా.. ఇందులో తొలిసారి కరోనా బారినపడ్డవారు 318 మందికాగా.. రీఇన్ఫెక్షన్‌కు గురైనవారు 44 మంది. అంటే సగటున వెయ్యిలో 22 మంది రీఇన్ఫెక్షన్ బారినపడ్డారు.
వ్యాక్సిన్ వేసుకున్న వెయ్యి మందిలో ఇద్దరికి కరోనా
కరోనా వచ్చిపోయిన వెయ్యి మందిలో ముగ్గురి వరకు మరోసారి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉండగా.. వ్యాక్సిన్లు వేసుకున్నవారిలో వెయ్యికి ఇద్దరు కరోనా బారినపడుతున్నారని సీడీసీ నివేదిక పేర్కొంది. అయితే వ్యాక్సిన్ వేసుకున్నవారికి కరోనా వస్తే.. ఆరోగ్య పరిస్థితి సీరియస్ కాకుండా వంద శాతం రక్షణ లభిస్తుందని తెలిపింది. ఇజ్రాయిల్‌లో మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత కరోనా వచ్చినవారిలో.. మామూలు వారితో పోలిస్తే వైరస్ లోడ్ నాలుగో వంతు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. వ్యాక్సిన్ వల్ల యాంటీబాడీస్ వృద్ధి చెంది, కరోనా వైరస్‌ను అడ్డుకుంటున్నాయని, టీ సెల్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. అయితే దక్షిణాఫ్రికా వేరియెంట్ కరోనా వైరస్‌పై మాత్రం ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావం 25 శాతమే ఉంటోందని.. యూకే వేరియెంట్‌పై 60 శాతం ప్రభావం చూపుతున్నాయని తెలిపింది.
రీఇన్ఫెక్షన్ తక్కువని నిర్లక్ష్యం తగదు
‘ఫస్ట్ వేవ్‌లో కరోనా వచ్చిన వారికి సెకండ్ వేవ్‌లో రీఇన్ఫెక్షన్ రావడం చాలా స్వల్పమని ఈయూ సీడీసీ చెబుతోంది. భారత్‌లో అదే పరిస్థితి ఉంది. అలాగని ఫస్ట్ వేవ్‌లో కరోనా వచ్చి పోయిన వారు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం. కరోనాలో కొత్త స్ట్రెయన్లు వస్తున్నాయి. వాటిపై వ్యాక్సిన్ల ప్రభావం తక్కువ.
– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ
మన దగ్గర రీఇన్ఫెక్షన్ కేసులు తక్కువే..
మన దేశంలో, రాష్ట్రం లో రీఇన్ఫెక్షన్ కేసులు తక్కువే. కరోనా వచ్చిపోయిన వారి శరీరం లో యాంటీబాడీస్ ఉండటం, లేదా టీ సెల్స్ నుంచి రక్షణ దొరకడమే రీఇన్ఫెక్షన్ రాకపోవడానికి కారణం. వారిపై వైరస్ ప్రభావం చూపించకున్నా.. వారి ద్వారా ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది.
– డాక్టర్ ఏవీ గురవారెడ్డి, సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ
( చదవండి: క్యా కరోనా: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి! )
Comments
Please login to add a commentAdd a comment