
ప్రతీకాత్మక చిత్రం
కోవిడ్ కట్టడికి ప్రపంచమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంటే.. అమెరికాకు చెందిన ఎలి లిలీ అనే ఫార్మా కంపెనీ మరో శుభవార్త తెచ్చింది. యాంటీబాడీలతో కోవిడ్ చికిత్స చేసేందుకు తాము జరిపిన ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయని ప్రకటించింది. బామ్లానివిమాబ్ పేరుతో తాము సిద్ధం చేసిన యాంటీబాడీలు 80 శాతం సామర్థ్యాన్ని కనబరిచినట్లు తెలిపింది. మూడోదశ ప్రయోగాలకు సంబంధించిన ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంది. వ్యాక్సిన్ వేయించుకోలేని వారికి కరోనా నుంచి రక్షణ పొందే వీలు కలుగుతుందని కంపెనీ ప్రకటించింది. వైరస్‌లను ఎదుర్కొనే యాంటీబాడీల తయారీకి టీకాలు ఉపయోగపడతాయన్నది మనకు తెలిసిన విషయమే.
కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలతో చికిత్స చేస్తే అది ప్లాస్మా థెరపీ అంటారు. ఎలి లిలీ అభివృద్ధి చేసిన కొత్త చికిత్స పద్ధతిలో పరిశోధనశాలలో అభివృద్ధి చేసిన యాంటీబాడీలను శరీరంలోకి ఎక్కిస్తారు. గతేడాది అక్టోబర్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రిజెనెరాన్ అనే కంపెనీ తయారు చేసిన యాంటీబాడీలను తీసుకుని, బాగా పనిచేస్తుందని కితాబిచ్చారు కూడా. గతేడాది నవంబర్‌లోనే ఎలి లిలీ ‘బామ్లానివిమాబ్’కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ (ఎఫ్‌డీఐ) అత్యవసర అనుమతులు ఇచ్చింది. అయితే వ్యాధి బాగా ముదిరాక యాంటీబాడీలు ఇవ్వడం వల్ల పరిస్థితి మరింత క్షీణించే అవకాశముందని కొన్ని హెచ్చరికలు వినిపించాయి.
కొత్త వారికి మాత్రం మేలు..
కొత్తగా వ్యాధి బారిన పడిన వారిపై మోనోక్లోనల్ యాంటీ బాడీ చికిత్స సత్ఫలితాలు ఇస్తుందని ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు నిరూపించాయి. ఇప్పుడు ఎలి లిలీ బామ్లాని విమాబ్ మూడో దశ మానవ ప్రయోగాలు కూడా దాన్ని రూఢీ చేశాయి. వ్యాధి సోకక ముందు కూడా ముందు జాగ్రత్త చర్యగా దీన్ని వాడొచ్చని కంపెనీ చెబుతోంది. గతేడాది ఆగస్టులో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో మూడో దశ మానవ ప్రయోగాలు చేశామని, సిబ్బందితో పాటు రోగులకు కూడా బామ్లానివిమాబ్, ఉత్తుత్తి మందులను అందించామని కంపెనీ తెలిపింది. ఫలితాలను పరిశీలిస్తే బామ్లానివిమాబ్ తీసుకున్న వారిలో 80 శాతం మందికి వ్యాధి సోకలేదని పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్త మైరాన్ కోహెన్ తెలిపారు. మూడో దశ మానవ ప్రయోగాలు కొనసాగు తున్నాయని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment