న్యూయార్క్ : మానవ శరీర జన్యువుల్లోకి ప్రాణాంతక కరోనా వైరస్‌ను ప్రవేశించకుండా అడ్డుకునే యాంటీ బాడీస్ మందును కనుగొన్నామని అమెరికా, శాండియాగో నగరంలోని సొరెంటో థెరాప్యూటిక్స్ బయోటెక్ కంపెనీ ప్రకటించింది. ఈ మందు ఉత్పత్తికి అనుమతి ఇవ్వాల్సిందిగా అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ’కి దరఖాస్తు చేసుకున్నామని, అనుమతి రాగానే నెలకు రెండు లక్షల డోసుల చొప్పున ఉత్పత్తి చేయగలమని కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. మానవ శరీర జన్యువుల్లో కరోనా వైరస్ ప్రవేశించకుండా తాము కనిపెట్టిన మందు నూటికి నూరుపాళ్లు అడ్డుకుంటుంది కనుక ఆ మందుకు ‘క్యూర్’ అని పేరు పెట్టామని, ‘కోవిడ్–19’కు వ్యాక్సిన్ కనుగొనే వరకు తాము కనిపెట్టిన మందును వాడి కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని వారు చెప్పారు. (కరోనా విజృంభణ: ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా)
తాము న్యూయార్క్‌లోని ఎంటీ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సహకారంతో కరోనా వైరస్‌పై పలు యాంటీ బాడీస్‌ను పరీక్షిస్తూ వచ్చామని, ‘ఎస్‌టీఐ–1499’ యాంటీ బాడీస్‌తో తమ పరీక్ష విజయవంతమైందని శాస్త్రవేత్తలు వివరించారు. నూటికి నూరు పాళ్లు కరోనాకు మందుందని, ల్యాబ్‌లో మానవ సెల్స్‌పై యాంటీ బాడీస్‌తో నిర్వహించిన పరీక్షలు మంచి ఫలితాలు ఇచ్చాయని, మానవ ట్రయల్స్ మాత్రం ఇంకా జరపలేదని కంపెనీ సీఈవో డాక్టర్ హెన్రీ జీ తెలిపారు. అనుమతి కోసం ‘అత్యవసర కేటగిరి’ కింద దరఖాస్తు చేశామని, అప్పుడు నేరుగానే హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించవచ్చని ఆయన చెప్పారు. (ట్రంప్: డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల కోత?)
Comments
Please login to add a commentAdd a comment