
కరోనా వైరస్‌ను మట్టుబెట్టేందుకు ప్రస్తుతానిౖకైతే ఎలాంటి చికిత్స, టీకా అందుబాటులో లేదు. ఇతర వ్యాధుల కోసం తయారుచేసిన మందులను కరోనా రోగులపై ప్రయోగిస్తూ తాత్కాలిక ఉపశమనం మాత్రం పొందుతున్నాం. వీటితోపాటు వ్యాధిబారిన పడి కోలుకున్న వారి రక్తం నుంచి యాంటీబాడీలను వేరుచేసి వాడటమూ జరుగుతోంది. అయితే ఈ ప్లాస్మా చికిత్స కొందరికి పనిచేస్తోం ది. మరికొందరికి లేదు. ఈ నేపథ్యంలో స్క్రిప్స్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనం ఆసక్తి రేకెత్తిస్తోంది. వైరస్‌ను ఎదుర్కొనే లక్ష్యంతో శరీర రోగనిరోధక వ్యవస్థ తయారుచేసే యాంటీబాడీల్లో కొన్ని ఇతరాల కంటే శక్తిమంతంగా ఉన్నట్లు వీరు గుర్తించారు. ప్లాస్మా చికిత్స అందుకున్న వారిలో సుమారు 300కుపైగా వేర్వేరు యాంటీబాడీలున్నట్లు పలు అధ్యయనాల ద్వారా ఇప్పటికే తెలియగా.. స్క్రిప్స్ శాస్త్రవేత్తలు వీటన్నింటినీ నిశితంగా పరిశీలించారు. రోగ నిరోధక వ్యవస్థకు చెందిన బీ–కణాలు తయారుచేసే యాంటీబాడీలు సాధారణంగా వై ఆకారంలో ఉంటాయి. ప్రొటీన్లతో తయారవుతాయి. మన వ్యవస్థలోని ఒక్కో బీ–సెల్ ఒక్కో రకమైన యాంటీబాడీని తయారుచేస్తుంది.
ఆసక్తికరంగా.. ఐజీహెచ్‌వీ3–53 అనే జన్యువు ఉత్పత్తిచేసే యాంటీబాడీలు మిగిలిన వాటికంటే ఎక్కువ శక్తి కలిగి ఉన్నట్లు తెలిసింది. ఇవి కరోనా వైరస్‌ను అత్యంత సమర్థంగా మట్టుబెట్టగలవని తేలింది. ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ పద్ధతి ద్వారా ఈ శక్తిమంతమైన యాంటీబాడీలు రెండింటి ఛాయాచిత్రాలను పరిశీలించినప్పుడు వాటి నిర్మాణం కూడా స్పష్టమైందని, ఈ అంశం ఆధారం గా సమర్థమైన వ్యాక్సిన్లు తయారుచేసే వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా.. సార్స్ కోవిడ్ –2 వైరస్‌కు ఈ యాంటీబాడీలు అతుక్కుపోయిన విధానం, ప్రాంతాల ఆధారంగా కోవిడ్ –19 చికిత్సకు కొత్త మందు లు కూడా తయారు చేయవచ్చునని అంచనా.
ఐజీహెచ్‌వీ3–53 జన్యువు కారణంగా ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఆరోగ్యంగా ఉన్న సాధారణ ప్రజల్లోనూ కొద్ది మోతాదుల్లో ఉంటాయని ఇప్పటికే జరిగిన పరిశోధనలు చెబుతుండగా.. వీటి సంఖ్యను పెంచేలా ఒక వ్యాక్సిన్‌ను తయారుచేస్తే కరోనా వైరస్ నుంచి దీర్ఘకాలం రక్షణ పొం దవచ్చునని స్క్రిప్స్ రీసెర్చ్ శాస్త్రవేత్త, ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఐయాన్ విల్సన్ చెబుతున్నారు. కరోనా రోగుల్లోనూ ఈ యాంటీబాడీలను గుర్తించామని, కాకపోతే అసలువాటి కంటే ఇవి కొంచెం భిన్నంగా ఉన్నాయని విల్సన్ వివరించారు. మనిషి వేల ఏళ్లుగా కరోనా వైరస్‌ల బారినపడతున్నాడని, రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీల రూపంలో ఎప్పుడో వీటికి విరుగుడును కూడా సిద్ధంగా ఉంచిందని, సరైన వాటిని గుర్తించి వాడటమే ప్రస్తుతం చేయాల్సిన పనని విల్సన్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment