న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బతో అన్ని దేశాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ)పెంచుకోవడమే ఏకైక మార్గమని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్యునాలజీ నిపుణులు రోగనిరోధక శక్తిపై ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. ప్రజలు రోగనిరోధకశక్తిను పెంచుకునేందుకు మార్కెట్లలో రకరకాల పండ్ల జ్యూస్‌లు, విటమిన్ ట్యాబ్లెట్లు వాడుతున్నారు. నిజంగా ఆహారపు అలవాట్లు, విటమిన్ ట్యాబ్లెట్లతో కరోనాను నివారించవచ్చా తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి అనేది సంక్లిష్టమైన అంశమని, ప్రజలకు ఇంకా పూర్తిగా ఈ అంశంపై అవగాహన రాలేదని సీఎస్‌ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) మాజీ డైరెక్టర్, ఇమ్యునాలజీ నిపుణులు రామ్ విశ్వకర్మ తెలిపారు. ఆయన స్పందిస్తు.. ముఖ్యంగా మనిషి తీవ్రంగా రోగగ్రస్తులను చేసే యాంటిజన్స్(వ్యాధి కారకం)ను ఎదుర్కొనేందుకు సహజసిద్దంగా శరీరంలో యాంటిబాడీస్(యాంటీజన్స్‌ను ఎదుర్కొనేవి) ఉంటాయి. మరోవైపు సహజ రోగనిరోధక శక్తి (ఇన్నేట్ ఇమ్యున్ రెస్పాన్స్) మానవుని నిరంతరం కాపాడుతూ ఉంటుంది.
సహజ రోగనిరోధక శక్తిలో తెల్లరక్తకణాల, న్యూట్రోఫిల్స్, టీసెల్స్(కణాలు), బీసెల్స్(కణాలు), యాంటిబాడీస్‌లతో కూడిన రక్షణాత్మక వ్యవస్థ కాపాడుతూ ఉంటుంది. కాగా ఈ కణాలను సైటోకైన్స్ ఉత్పత్తి చేస్తాయి. సైటోకైన్స్ అనేది ప్రొటీన్ ఇమ్యూన్ కణాలకు సిగ్నలింగ్ వ్యవస్థ లాంటిది. ఆహారపు అలవాట్ల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోలేమని అన్నారు. సాధారణంగా కొందరు తమకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని చెబుతుంటారు. వారికి ఎక్కువగా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. విటమిన్ సీ, జింక్ ట్యాబ్లెట్లతో రోగనిరోధకశక్తి పెంచుకోవచ్చనే అపోహలు ఉన్నాయి. మరోవైపు ఈ ట్యాబ్లెట్ల ద్వారా కిడ్నీ, లివర్ తదితర వ్యాధులతో చాలా మంది సతమతమవుతున్నారని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే మేలైన మార్గమని రామ్ విశ్వకర్మ పేర్కొన్నారు. 1962లో నోబెల్ బహుమతి పొందిన పాలింగ్ కూడా విటమిన్ సీ, జింక్ ట్యాబ్లెట్లు ఏ మాత్రం ప్రభావం చూపవని తెలిపారు. కానీ ఆహారం ద్వారానే రోగనిరోధక శక్తి లభిస్తుందని ప్రకృతి, ఆయుర్వేద నిపుణులు గట్టిగా చెబుతున్నారు.
కానీ అందరు ఏకీభవించేది మాత్రం వ్యాయామం. జీవనశైలి మార్పులతో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చని అందరు ఏకీభవీస్తున్నారు. మానవ శరీరంలో రక్షణాత్మక వ్యవస్థను బలంగా ఉంచే సైటోకైన్స్, న్యూట్రోఫిల్స్, టీకణాలు, బీకణాలు వ్యాయామంతో బలోపేతమవుతాయని అల్లోపతి, ఆయుర్వేద, అన్ని రంగాల నిపుణులు ఏకీభవిస్తున్నారు. రోజుకు ఒక గంట వ్యాయామంతో రక్షణాత్మక వ్యవస్థను బలోపేతం చేసే అన్ని కణాలు ఉత్తేజితమవుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment