మనందరికీ తెలుసు ఇప్పటివరకూ రకరకాల వయసుల వారికీ, ఎన్నోరకాల జబ్బులున్నవారికీ, మరెన్నో రకాల ఆరోగ్య సమస్యలున్నవారికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చి ట్రయల్స్ నిర్వహించారు. కానీ ఎందుకైనా మంచిదంటూ మొదట్లో గర్భవతుల మీద, 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల మీద ట్రయల్స్ జరగలేదు. అయితే ఇప్పుడు ఆ ట్రయల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి.
ఇటీవలే దాదాపు ప్రసవానికి రెడీగా అంటే... తొమ్మిదినెలలప్పుడు నెలలుపూర్తిగా నిండిన గర్భవతికి (ఖచ్చితంగా చెప్పాలంటే 36 వారాల మూడురోజుల గర్భవతి గా ఉన్నప్పుడు) కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి చూశారు. ఆ గర్భవతికి మాడర్నాఎమ్‌ఆర్‌ఎన్‌ఏ తరహా వ్యాక్సిన్ ఇచ్చి పరిశీలించారు. మరో మూడు వారాల తర్వాత ఆమెకు పండంటి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా చురుగ్గా ఉంది. చిన్నారి పాప పుట్టిన వెంటనే ఆమె నుంచి రక్తం సేకరించి పరిశీలించి చూశారు. విచిత్రం ఏమిటంటే... అప్పుడే పుట్టిన ఆ చిన్నారి కూడా దేహంలో పుష్కలమైన యాంటీబాడీస్‌తో పుట్టడం చూసి ఆశ్చర్యపోవడం శాస్త్రవేత్తల వంతయ్యింది.
దీన్ని బట్టి తేలుతున్నదేమిటంటే... గర్భవతిగా ఉన్న కాబోయే తల్లికి వ్యాక్సిన్ ఇచ్చినా లేదా గర్భవతిగా ఉన్న మహిళకు కోవిడ్ వచ్చినా... బొడ్డుతాడు (ప్లాసెంటా) ద్వారా ఆ యాంటీబాడీస్ చిన్నారుల్లోకి కూడా ప్రవేశించి, వారికీ రక్షణ కల్పిస్తాయని తేలింది. అంటే కాబోయే తల్లికి వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల కొంతమేర బిడ్డకు సైతం కరోనా వైరస్ నుంచి రక్షణ కలుగుతుందని చాలావరకు తేలిందంటున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న అమెరికాలోని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు పాల్ గిల్బర్ట్, చాడ్ రడ్నిక్‌లు. అయితే ఇలా ఇచ్చిన ఈ వ్యాక్సిన్ల ప్రభావం (ఎఫెకసీ) బిడ్డలో ఖచ్చితంగా ఎంత ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
అంతేకాదు... ఇలా గర్భవతులకు వ్యాక్సిన్ ఇచ్చాక... బిడ్డ పుట్టిన అనంతరం... ఆ చిన్నారులకు రొమ్ముపాలు పడుతూ... తద్వారా ఆ వ్యాక్సిన్ ప్రభావం ఎంత ఉందో కూడా చూడాలంటున్నారు పరిశోధకులు. అయితే ఇవి కేవలం తొలి దశ పరిశోధనలు మాత్రమే కావడంతోనూ, ఇంకా పరిశోధనలూ, ట్రయల్స్ జరుగుతుండటం వల్లనూ కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం గర్భవతులూ... వారి గర్భస్థ శిశువులపై ఎలా ఉంటుందనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఇక్కడ ఆశారేఖగా కనిపించే విషయం ఒక్కటే... ఇప్పటికి వస్తున్న ఫలితాల మేరకు గర్భవతుల్లోనూ వ్యాక్సిన్ చాలావరకు సురక్షితమేననీ, బిడ్డకు సైతం గర్భస్థపిండానికీ, కడుపులో ఎదుగుతున్న శిశువుకూ అది హాని చేయకపోగా... ఎంతోకొంత సంరక్షణ ఇస్తుందనే సానుకూల ఫలితాలు వస్తుండటంతో పరిశోధకులు చాలా ఆశావహంగా, ఆనందంగానే ఉన్నట్లు తొలి పరిశీలనల ద్వారా తెలుస్తోంది. l
Comments
Please login to add a commentAdd a comment